Samantha: రాజకీయాల్లో ఒకరినొకరు విమర్శించడం కోసం నాయకులు ఎంత దూరమయినా వెళ్తారు. అదే విధంగా తాజాగా కేటీఆర్‌ను విమర్శించడం కోసం ఆయనపై తీవ్రమైన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ లీడర్ కొండా సురేఖ. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతే కాకుండా సినీ సెలబ్రిటీల దృష్టికి కూడా వెళ్లాయి. నాగచైతన్య, సమంత విడిపోవడానికి కేటీఆరే కారణమంటూ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ ముందుగా స్పందించారు. ఆ తర్వాత నాగార్జున కూడా ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా మాట్లాడారు. ఇప్పుడు సమంత కూడా ఈ విషయంపై డైరెక్ట్‌గా రియాక్ట్ అయ్యింది.
చాలా ధైర్యం కావాలి
‘ఒక అమ్మాయిగా పుట్టడం, బయటికి వచ్చి పనిచేయాలని అనుకోవడం, అమ్మాయిలను ఆటబొమ్మల్లాగా కాకుండా మనుషులుగా ఎక్కువగా ట్రీట్ చేయని గ్లామర్ ప్రపంచంలో అడుగుపెట్టి ముందుకు సాగడం, ప్రేమలో పడడం, ప్రేమ నుండి బయటపడడం, అయినా నిలబడి పోరాడడం.. ఇవన్నీ అంత సులభం కాదు. దీనికోసం చాలా శక్తి, ధైర్యం కావాలి. ఈ ప్రయాణం నన్ను ఎలా మలిచింది అనే విషయంపై నేను గర్వపడుతూనే ఉంటాను కొండా సురేఖ గారు. దయజేసి దానిని చిన్నచూపు చూడకండి. మినిస్టర్‌గా మీరు మాట్లాడే మాటలు జనాల్లోకి ఎలా వెళ్తాయో ఒక్కసారి ఆలోచించండి’ అంటూ నేరుగా కొండా సురేఖ పేరును ప్రస్తావిస్తూనే ఈ విషయంపై స్పందించింది సమంత.
Also Read: నిజంగా నాగార్జున.. కోడలి విషయంలో అంత నీచానికి దిగజారాడా.. ?
క్లారిటీ ఇస్తున్నాను
‘మినిస్టర్‌గా ప్రతీ మనిషి ప్రైవసీని కాపాడడం మీ బాధ్యత అని నేను భావిస్తున్నాను. నేను విడాకులు తీసుకోవడం అనేది నా పర్సనల్ విషయం. దయజేసి దీని చుట్టూ పుకార్లు పుట్టించొద్దని మిమ్మల్ని వేడుకుంటున్నాను. మా విషయాలను ప్రైవేట్‌గా ఉంచుకోవాలని మేము నిర్ణయించుకున్నాం అంతే కానీ ఇలా తప్పుగా అర్థం చేసుకోవడానికి కాదు. అందరికీ ఒక విషయం క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. నా విడాకులు అనేవి ఇద్దరి ఇష్టంతోనే జరిగాయి. అందులో ఎలాంటి రాజకీయ జోక్యం లేదు’ అంటూ మరోసారి నాగచైతన్యతో తన విడాకులకు కారణమేంటో చెప్పకుండానే ఎవరికి నచ్చింది వారు ఊహించుకోవద్దని రిక్వెస్ట్ చేసింది సామ్.
దూరంగానే ఉంటాను
‘దయజేసి నా పేరును మీ రాజకీయ గొడవల్లో రానివ్వకుండా చూస్తారా? నేనెప్పుడూ రాజకీయాలకు దూరంగానే ఉన్నాను. ఇకపై కూడా అలాగే ఉండాలని అనుకుంటున్నాను’ అని వివరించింది సమంత. కేటీఆర్ వల్లే నాగచైతన్య, సమంత విడిపోయారు అని మాత్రమే కాకుండా చాలామంది హీరోయిన్లు సినీ పరిశ్రమ నుండి దూరమవ్వడానికి కూడా కేటీఆరే కారణమని కొండా సురేఖ తీవ్రంగా ఆరోపించారు. అంతే కాకుండా సమంతను తన దగ్గరకు పంపిస్తేనే ఎన్ కన్వెన్షన్‌ను విడిచిపెడతానని కేటీఆర్ బెదిరించారని అన్నారు. అందుకే సమంత.. అక్కినేని ఫ్యామిలీకి దూరమయ్యిందని తీవ్ర ఆరోపణలు చేశారు కొండా సురేఖ. నాగార్జున కూడా ఇప్పటికే కొండా సురేఖ చేసినవన్నీ అబద్ధపు ఆరోపణలు అని, రాజకీయాల్లోకి తమను లాగొద్దని తీవ్రంగా ఖండించారు. నాగచైతన్య ఇంకా ఈ విషయంపై స్పందించాల్సి ఉంది.
. @Samanthaprabhu2 condemns the comments passed by @KondaSurekha 🔥!!
Don’t involve any actor/actress name and their personal life for your cheap political purpose !!#SamanthaRuthPrabhu #Samantha pic.twitter.com/eZYVzTPRGP
— Virat Naveen (@_Virat_Naveen_) October 2, 2024