Sampoornesh Babu: సినిమాల్లో హీరో అవ్వాలంటే ఆరడుగుల హైట్ ఉండాలి, చూడడానికి అందంగా ఉండాలి, ఫెయిర్‌గా ఉండాలి.. ఇలా పెద్ద లిస్టే ఉంటుందని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ టాలెంట్ ఉంటే.. ఇవేమీ లేకపోయినా హీరో అవ్వొచ్చు అని నిరూపించిన వారు కూడా ఉన్నారు. టాలీవుడ్‌లో కూడా అలాంటి వారు ఉన్నారు. అందులో సంపూర్ణేష్ బాబు ఒకడు. ‘హృదయ కాలేయం’ అనే సినిమాతో ప్రేక్షకులకు హీరోగా పరిచయమయ్యాడు సంపూర్ణేష్ బాబు. అప్పట్లో తను హీరో అవ్వడం అనేది ఒక సెన్సేషన్. త్వరలో ‘సోదర’ అనే మూవీతో థియేటర్లలో సందడి చేయనున్నాడు. ఆ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ‘హృదయ కాలేయం’ గురించి మరోసారి మాట్లాడాడు సంపూ.
హ్యాపీగా ఉంది
2014లో సాయి రాజేశ్ దర్శకత్వంలో సంపూర్ణేశ్ బాబు (Sampoornesh Babu) హీరోగా నటించిన చిత్రమే ‘హృదయ కాలేయం’. ఈ మూవీ విడుదలయిన వెంటనే అసలు ఏంటీ సినిమా, ఇతను హీరో ఏంటి అని చాలా నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. కానీ ఈ సినిమాను ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు కూడా ఉన్నారు. దానిపై సంపూ స్పందించాడు. ‘‘ఆ సినిమా విడుదలయ్యి 11 ఏళ్లు అయ్యింది. అయినా ఇంకా ఎక్కడికి వెళ్లినా ఆ సినిమా గుర్తుచేస్తున్నారంటే చాలా హ్యాపీ’’ అని చెప్పుకొచ్చాడు. ‘బేబి’ తర్వాత దర్శకుడిగా సాయి రాజేశ్ రేంజ్ మారిపోయింది కాబట్టి వారి మధ్య రిలేషన్ ఏమైనా మారిందా అనే ప్రశ్నకు సమాధానమిచ్చాడు సంపూ. అప్పటికీ, ఇప్పటికీ వారి రిలేషన్ ఏం మారలేదన్నాడు.
అంతా ఆయన వల్లే
‘‘మా మధ్య ఎలాంటి మార్పు లేదు. రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటాను. ఇంటికి వెళ్తుంటాను. ఆయన ఫ్రీగా ఉన్నారంటే కలుస్తాను. ఆయనకు, నాకు ఇప్పటివరకు ఎలాంటి మనస్పర్థలు రాలేదు. నిజంగా అలా వచ్చినా రోజు నేను ఉండను. నేను వెండితెరపై ఒక నిమిషం కనిపిస్తే చాలు అని అనుకున్నాను. అలాంటిది నన్ను హీరోగా పెట్టి ఆయన సినిమా తీశాడు. హృదయ కాలేయం షూటింగ్ సమయంలో ఆ హైప్ అంతా నమ్మకు, సినిమా తేడా కొడితే ఊరు వెళ్లిపోయి నీ పని నువ్వు చేసుకోవాలని చెప్పారు. అది నాకు బాగా ఎక్కేసింది. నువ్వు అందరితో బాగుండాలి, ఎక్కడి నుండి వచ్చావో మర్చిపోవచ్చు అనేవారు. అందుకే ఇప్పటికీ అలాగే ఉంటున్నాను’’ అంటూ సాయి రాజేశ్ గొప్పదనాన్ని బయటపెట్టాడు సంపూ.
Also Read: ‘సాగర సంగమం’ రీమేక్‌లో ఎన్‌టీఆర్.. అసలు ఆ ఆలోచన ఎలా వచ్చింది కొరటాల.!
అదొక మైలురాయి
ప్రస్తుతం సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తున్నా కూడా ‘హృదయ కాలేయం’ (Hrudaya Kaleyam)కు సీక్వెల్ అనేది రాకపోవచ్చని, సాయి రాజేశ్ చేయకపోవచ్చని అనేశాడు సంపూర్ణేశ్ బాబు. ఆ సినిమా ఒక మైలురాయి అని, అది అలాగే నిలబడాలని అన్నాడు. ఇక రీ రిలీజ్ ట్రెండ్ గురించి మాట్లాడుతూ.. ‘హృదయ కాలేయం’ రీ రిలీజ్‌కు అవకాశం ఉందని తెలిపాడు. ‘‘11 ఏళ్ల క్రితం ఏప్రిల్ 4న ఆ మూవీ రిలీజ్ అయ్యింది. మళ్లీ ఇప్పుడు అదే రోజు రీ రిలీజ్ అయితే నేను సంతోషపెడతాను. ఇదే విషయంపై మేకర్స్‌తో మాట్లాడాలని అనుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చాడు సంపూర్ణేశ్ బాబు. ఇక ఈ మూవీ రీ రిలీజ్ అయితే ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాలి.