Sankranthi Movies Ticket Price Hike : సంక్రాంతి సీజన్ కు టాలీవుడ్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి బడా నిర్మాతలు రెడీగా ఉంటారు. ముఖ్యంగా సీనియర్ హీరోలు చాలా రోజుల ముందు నుంచే సంక్రాంతిపై కన్నేస్తారు. ఫలితంగా ప్రతి ఏడాది సంక్రాంతికి పెద్ద సినిమాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంటుంది. అయితే ఈసారి సంక్రాంతికి ఎప్పటిలాగే పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’ (Game Changer), ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj), ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam) సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.
అయితే రీసెంట్ గా తెలంగాణలో ఇక నుంచి టికెట్ ధరల పెంపు ఉండబోదని ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఏపీలో ఈ సినిమాల టికెట్ రేట్లు భారీగా పెరగబోతున్నట్టుగా టాక్ నడుస్తోంది. ఈసారి సంక్రాంతికి ఒక్కో సినిమాకు ఒక్కో రకమైన క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే పాన్ ఇండియా రేంజ్ లో మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తుంది మాత్రం ‘గేమ్ ఛేంజర్’ మూవీ కోసమే. దాదాపు మూడేళ్ల నుంచి ఈ సినిమా కోసం మెగా ఫాన్స్ ఎదురు చూస్తున్నారు. భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా టికెట్ల ధరల పెంపుకు ఏపీ ప్రభుత్వం త్వరలోనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) మూవీకి ఏపీలో సింగిల్ స్క్రీన్ అయితే రూ.135, మల్టీప్లెక్స్ అయితే రూ. 175 వరకు పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతిని ఇవ్వబోతుందని తెలుస్తోంది. అలాగే అక్కడ బెనిఫిట్ షోలు అర్ధరాత్రి ఒంటిగంట నుంచే ప్రారంభం కాబోతున్నాయని, వీటికి 600 వరకు టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతులు వచ్చే అవకాశాలు ఉన్నాయని టాక్ నడుస్తోంది.
ఇక సంక్రాంతి బరిలో ఉన్న సినిమాల్లో ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj), వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam) సినిమాలకు కూడా మంచి బజ్ ఉంది. జనవరి 10న ‘గేమ్ ఛేంజర్’ మూవీ రిలీజ్ అయితే, జనవరి 12న బాలకృష్ణ ‘డాకు మహారాజ్’, జనవరి 14న ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఇందులో ‘డాకు మహారాజ్’ మూవీకి సింగిల్ స్క్రీన్ లో రూ.110, మల్టీప్లెక్స్ లో రూ.135 వరకు టికెట్ ధరలు పెంచే అవకాశం ఉన్నట్టు సమాచారం. అలాగే ఈ సినిమాకు సంబంధించిన బెనిఫిట్ షోలు ఉదయం 4 గంటలకు స్టార్ట్ కాబోతున్నాయని, వీటికి రూ. 500 వరకు టికెట్ ధరలు పెంచే ఛాన్స్ ఉందని అంటున్నారు.
వెంకటేష్ – అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న క్రేజీ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam). ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కి సింగిల్ స్క్రీన్ అయితే రూ. 75, మల్టీప్లెక్స్ లో రూ. 100 పెంచే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ టికెట్ రేట్ల ధరల విషయమై ఇంకా ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.