Monalisa : మహా కుంభమేళాలో వైరల్ గర్ల్ మోనాలిసా (Monalisa) కు సినిమా ఆఫర్ చేసిన దర్శకుడు సనోజ్ మిశ్రా (Sanoj Mishra) సోమవారం అత్యాచారం కేసులో అరెస్టు అయ్యారు. ఢిల్లీ హైకోర్టు బెయిల్ ను తిరస్కరించిన తర్వాత నబీ కరీం పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. దీంతో కుంభమేళాలలో పూసలు అమ్ముకుంటూ జీవించిన మోనాలిసా ఆశలపై నీళ్ళు చల్లినట్టుగా అయ్యింది.
డైరెక్టర్ పై అత్యాచారం ఆరోపణలు
బాధితురాలు ఇచ్చిన కంప్లయింట్ ప్రకారం ఆమె 2020 సంవత్సరంలో టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సనోజ్ మిశ్రాను కలిసింది. ఆ సమయంలో ఆమె ఝాన్సీలో నివసించింది. ఇద్దరూ కొంతకాలం ఇద్దరూ బాగానే మాట్లాడుకున్నారు. ఆపై డైరెక్టర్ 2021 జూన్ 17న ఆమెకు ఫోన్ చేసి తనను ఝాన్సీ రైల్వే స్టేషన్ దగ్గరకు రావాలని చెప్పాడు. సామాజిక ఒత్తిడి కారణంగా బాధితురాలు కలవడానికి నిరాకరించడంతో, నిందితుడు సనోజ్ మిశ్రా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో బాధితురాలు భయంతో అతన్ని కలవడానికి వెళ్ళింది. మరుసటి రోజు అంటే 2021 జూన్ 18న నిందితుడు మళ్ళీ కాల్ చేసి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి ఆమెను మరోసారి రైల్వే స్టేషన్‌కు పిలిచాడు.
అక్కడి నుంచి నిందితుడైన డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఆమెను రిసార్ట్ కు తీసుకెళ్లి, మత్తు మందు తినిపించి అత్యాచారం చేశాడని బాధిత మహిళ ఆరోపించింది. ఆ తరువాత అతను తన అభ్యంతరకరమైన ఫోటోలు, వీడియోలను తీసుకున్నాడని, ఈ విషయాన్ని బయట పెడితే ఆ ఫోటోలు లీక్ చేస్తానని బెదిరించాడని బాధితురాలు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. అనంతరం వివాహం సాకుతో ఆమెను చాలాసార్లు వేర్వేరు ప్రదేశాలకు పిలిపించి, ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. అంతేకాకుండా సినిమాల్లో ఛాన్స్ ఇప్పిస్తానని ఆమెను ప్రలోభ పెట్టినట్టు సమాచారం.
సనోజ్ మిశ్రా మూవీ ఛాన్స్… మోనాలిసా పరిస్థితి ఏంటి?
మహా కుంభమేళాలో పూసలు అమ్ముతూ, సోషల్ మీడియాలో ఓవర్ నైట్ పాపులర్ అయిన మోనాలిసాను డైరెక్టర్ సనోజ్ మూవీ ఛాన్స్ ఇచ్చారు. సనోజ్ మిశ్రా స్వయంగా సోషల్ మీడియా ద్వారా తాను దర్శకత్వం వహిస్తున్న ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ మూవీలో ఓ క్యారెక్టర్ కోసం మోనాలిసాను తీసుకుంటానని ప్రకటించారు. ఒకవేళ ఆమెకు యాక్టింగ్ రాకపోతే నేర్పించి మరీ ఛాన్స్ ఇస్తానని వెల్లడించారు. అన్నట్టుగానే మిశ్రా మోనాలిసాకు నటనలో శిక్షణ కూడా ఇస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
కానీ అంతలోనే ఓ బాలీవుడ్ నిర్మాత సనోజ్ మిశ్రా అమ్మాయిలను అవకాశాల పేరుతో వాడుకుంటాడని చెప్పి బాంబ్ పేల్చారు. అంతేకాకుండా అతనిపై రే*ప్ ఆరోపణలు ఉన్నాయని షాక్ ఇచ్చారు. దీంతో మోనాలిసా సినిమా ఆగిపోయింది అనే వార్తలు విన్పించాయి. ఎట్టకేలకు మిశ్రా అరెస్ట్ అయ్యాడు.
మోనాలిసా గంపెడన్ని ఆశలతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అవుతోంది. కానీ అంతలోనే సనోజ్ మిశ్రాపై రే*ప్ ఆరోపణలు రావడం, అతను అరెస్ట్ కావడంతో మోనాలిసా సినిమా ఆశలన్నీ అడియాసలయ్యాయి. మరి ఆమె నెక్స్ట్ ఏం చేయబోతోంది? అన్నది ఇప్పుడు అతి పెద్ద ప్రశ్న.