Indian 3: మామూలుగా హీరోలు అయినా ఒక మూవీ ఫ్లాప్ అయితే మరో మూవీకి కమ్ బ్యాక్ ఇస్తారనే ఆశ ఉంటుంది. ఒక సినిమా ఫ్లాప్ అయినా కూడా తన ఫ్యాన్ బేస్ అలాగే ఉంటుంది. అందుకే ఆ విషయంలో వారికేమీ ఇబ్బంది లేదు. కానీ దర్శకుల విషయానికొస్తే అలా కాదు. దర్శకుడు తెరకెక్కించిన సినిమా ఫ్లాప్ అవ్వగానే వారి మార్కెట్ వెంటనే పడిపోతుంది. అలా వారి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌పై ఎఫెక్ట్ చూపిస్తుంది. ఒకప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్ అయినా కూడా ఇప్పుడు మాత్రం ఒక్క హిట్ లేక కష్టంగా కాలాన్ని గడిపేస్తున్నాడు శంకర్. ఇప్పుడు తన చేతిలో ఉన్న ఒకేఒక్క ప్రాజెక్ట్‌పై తన ఆశలన్నీ ఉన్నాయి. అదే ‘ఇండియన్ 3’.
మేజర్ అప్డేట్
దాదాపు పాతికేళ్ల క్రితం కమల్ హాసన్‌తో కలిసి శంకర్ చేసిన ‘ఇండియన్’ మూవీ దేశవ్యాప్తంగా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. తమిళంలో తెరకెక్కిన ఈ మూవీ తెలుగు, హిందీ భాషల్లో డబ్ అయ్యి అక్కడ కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. అప్పట్లో ప్రేక్షకులకు ఆ కాన్సెప్ట్ చాలా నచ్చేసింది. పాతికేళ్ల తర్వాత దాదాపు అదే కాన్సెప్ట్‌తో ‘ఇండియన్ 2’ను తెరకెక్కించాడు శంకర్. కానీ అది ఈతరం ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు. ఇదిలా ఉండగా ఈ సినిమాకు మూడో భాగం కూడా ఉందని అనౌన్స్ చేశాడు. ‘ఇండియన్ 2’ వల్ల జరిగింది సరిపోలేదు అన్నట్టుగా ‘ఇండియన్ 3’ (Indian 3) కోసం కష్టపడడం మొదలుపెట్టాడు శంకర్ (Shankar). ఇప్పుడు ఆ మూవీకి సంబంధించిన మేజర్ అప్డేట్ అందించాడు.
ఆరు నెలల్లోనే
ఇటీవల శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ విడుదలయ్యింది. ఈ సినిమాను ఎలాగైనా సూపర్ హిట్ దిశగా నడిపించాలని ఇంకా ప్రమోషన్స్‌ను ఆపలేదు మేకర్స్. అందులో భాగంగానే శంకర్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో ‘ఇండియన్ 3’కు సంబంధించిన మేజర్ అప్డేట్ అందించారు. ‘‘నేను ఇప్పుడు పూర్తిగా ఇండియన్ 3పై ఫోకస్ చేస్తాను. మేము దీనిపై త్వరలోనే పనిచేయడం ప్రారంభించనున్నాం. మేము ఇప్పుడే దీనిని ప్రారంభిస్తే ఆరు నెలల్లో అంతా పూర్తిచేసి సినిమాను విడుదల చేయగలం. ఇంకా కొంచెం షూటింగ్‌తో పాటు వీఎఫ్ఎక్స్ పని కూడా ఉంది’’ అని తెలిపారు శంకర్.
Also Read: బాలయ్య ఫ్యాన్స్ ఓవరాక్షన్.. కేసు నమోదు చేసిన పోలీసులు..
మంచి ఆలోచన
‘ఇండియన్ 2’ ఫ్లాప్ అవ్వడం వల్ల మూడో భాగం నేరుగా ఓటీటీలో వస్తుందని అప్పట్లో రూమర్స్ మొదలయ్యాయి. కానీ శంకర్ మాట్లాడే విధానం చూస్తుంటే ‘ఇండియన్ 3’ నేరుగా ఓటీటీలోకి వెళ్లద్దని, థియేటర్లలోనే విడుదల అవుతుందనే విషయంపై క్లారిటీ వస్తుంది. ఇక ‘ఇండియన్ 2’ ఫెయిల్యూర్‌పై కూడా మునుపటి ఇంటర్వ్యూల్లో స్పందించారు శంకర్. ‘‘నేను ఒక మంచి ఆలోచన గురించి చెప్పాలనుకున్నాను. ఆ విధంగా నాకు హ్యాపీనే’’ అంటూ ఆ సినిమా విషయంలో తాను తృప్తిగానే ఉన్నానని స్టేట్‌మెంట్ ఇచ్చారు. మొత్తానికి ‘ఇండియన్ 3’ వర్కవుట్ అవ్వడం శంకర్ కెరీర్‌కు చాలా కీలకంగా మారిందని తెలుస్తోంది.