Shruti Haasan: ఇండస్ట్రీకి ఎలా వచ్చాం అన్నది కాదు.. ఎలా నిలబడ్డాం అన్నది ముఖ్యం. ఎంత స్టార్ హీరో కొడుకు అయినా, కూతురు అయినా కేవలం ఎంట్రీ మాత్రమే ఈజీగా ఉంటుంది. నిలదొక్కుకోవడం అనేది వారి చేతుల్లోనే ఉంటుంది. లోక నాయకుడు కమల్ హాసన్ నటవారసురాలిగా శృతి హాసన్ ఇండస్ట్రీకి పరిచయమైంది.
కెరీర్ ప్రారంభంలో శృతి ఏ సినిమా చేసినా అట్టర్ ప్లాప్. దీంతో ఆమెను ఐరెన్ లెగ్ అని ముద్రవేశారు. విజయం దరిచేరాలంటే ఓపిక అవసరం. శృతి కూడా అలాగే విజయాపజయాలను పక్కన పెట్టి.. తన నటన మీద ఫోకస్ చేసింది. గబ్బర్ సింగ్ సినిమాతో అమ్మడి ఫేట్ మొత్తం మారిపోయింది.
ఐరెన్ లెగ్ అన్నవారే.. శృతిది గోల్డెన్ లెగ్ అని వరుస అవకాశాలను ఇచ్చారు. అలా శృతి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నా శృతి తాజగా ఒక ఇంటర్వ్యూలో తన జీవితంలో ఎదుర్కున్న కొన్ని ఘటనల గురించి చెప్పుకొచ్చింది.
హీరోయిన్ గా కమర్షియల్ సినిమాలు చేయడం తన కెరీర్ కు ప్లస్ గా మారిందని, ఆ విషయం చెప్పడంలో సిగ్గు పడేది లేదని చెప్పుకొచ్చింది. ” నా కెరీర్ మొదట్లో నేను చాలా ఇబ్బందులు పడ్డాను. నన్ను ఎంతోమంది విమర్శించారు. విమర్శలు చాలా బాధను ఇస్తాయి. కొన్నిసార్లు ఇవే విమర్శలు కొత్తగా వచ్చే తారల కలలను ఆపేయగలవు. నేను వాటి నుంచి ఎంతో నేర్చుకున్నాను. నేను కమర్షియల్ సినిమాల్లో నటించడానికి ఏ మాత్రం సంకోచించను. ఒకానొక సమయంలో అవే నాకు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. ఆ విషయం చెప్పడంలో సిగ్గెందుకు” అని తెలిపింది.
అంతే కాకుండా.. ఇండస్ట్రీలో నేపోటిజం ఎక్కువ అని తాను ఒప్పుకున్నట్లు తెలిపిన శృతి.. తన కెరీర్ కు తన తల్లిదండ్రులు ఎలాంటి సహాయం చేయలేదని తెలిపింది. ఎన్నోసార్లు కమల్.. తనకు మార్గ నిర్దేశం చేయాలనీ కోరినా.. తానే స్వయంగా ఎదగాలని దృఢ నిశ్చయం చేసుకొని ఇంతవరకు వచ్చినట్లు తెలిపింది. ప్రస్తుతం శృతి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.