Singer Kalpana: తెలుగులో మాత్రమే కాకుండా అన్ని సౌత్ భాషల్లో పాటలు పాడి మంచి ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్న సింగర్ కల్పనా రాఘవేంద్ర. అలాంటి కల్పన ఉన్నట్టుండి ఆత్మహత్యాయత్నం చేసిందని వార్త ఇండస్ట్రీలో సెన్సేషన్‌గా మారింది. నిద్రలు మాత్రం తీసుకొని కల్పన ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారం. ఈ విషయాన్ని వెంటనే గుర్తించిన కుటుంబ సభ్యులు తనను దగ్గర్లో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కల్పనకు ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. నిజాంపేటలోని వర్టెక్స్ ప్రివిలేజ్ అనే అపార్ట్మెంట్‌లో తన భర్తతో కలిసి నివాసముంటుంది కల్పన. దీంతో తన భర్తను ముందుగా విచారణకు తీసుకెళ్లారు పోలీసులు. ఆయన రెండు రోజులుగా తాను ఇంట్లో లేనని సమాధానమిచ్చారు. దీంతో ఇంట్లో రెండు రోజులుగా ఇంట్లో ఒంటరిగా ఉంటున్న కల్పన.. ఎందుకిలా ఆత్మహత్యకు పాల్పడింది అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.
జీవితంలో ఎంతో విషాదం
కేవలం ఇండియన్ భాషల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో భాషల్లో దాదాపుగా 3 వేలకు పైగా పాటలు పాడింది కల్పన. ఇండియాలోనే కాకుండా ఫారిన్ దేశాల్లో కూడా ఎన్నో స్టేజ్ షోల్లో పాల్గొంది. చూడడానికి మోడర్న్‌గా ఉన్న తన వాయిస్‌తో మెలోడీని కూడా పలికించగల టాలెంట్ కల్పన సొంతం. తెలుగు బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోల్లో కనిపించి బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు కల్పన. అంతే కాకుండా ఎన్నో బుల్లితెర సింగింగ్ షోలకు ఆమె జడ్జిగా కూడా వ్యవహరించారు. కల్పన ఎక్కడ ఉంటే అక్కడ ఫన్ ఉంటుందని ఫ్యాన్స్ అంటుంటారు. కానీ కల్పన జీవితంలో ఉన్న విషాదం గురించి మాత్రం కొంతమందికే తెలుసు.
ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా
25 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుండి కల్పన ప్లేబ్యాక్ సింగర్‌గానే సెటిల్ అయ్యింది. అయితే తనకు ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత 2010లో తన భర్తతో విడిపోయానని చాలాకాలం క్రితం పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో తన లైఫ్ స్టోరీ గురించి చెప్పుకొచ్చింది కల్పన. అప్పట్లో తన పిల్లలను చదివించుకునే అవకాశం లేక ఏం తోచని పరిస్థితిలో మిగిలిపోయానని తెలిపింది. ఎలా జీవించాలో తెలియక ఆత్మహత్య చేసుకొని చనిపోవాలని అనుకున్నట్టు బయటపెట్టింది. కానీ అదే సమయంలో సింగర్ చిత్రకు తన కష్టం గురించి తెలిసి ధైర్యం చెప్పారని, ఆత్మహత్య చేసుకోకుండా ఆపారని చెప్పుకొచ్చింది. అదే సమయంలో ఒక సింగింగ్ పోటీలో పాల్గొనడం వల్ల తన జీవితం మారిపోయిందని తెలిపింది.
Also Read: గోల్డ్ స్మగ్లింగ్‌లో దొరికిపోయిన హీరోయిన్.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు
ఇప్పుడు ఎందుకీ నిర్ణయం.?
సింగర్‌గా ఎంతో ఉల్లాసంగా ఉండే కల్పన పర్సనల్ జీవితంలో ఇంత విషాదం ఉందని ఎవరూ ఊహించి ఉండరు. బిగ్ బాస్‌లోకి వచ్చేవరకు కల్పన అంత ఎమోషనల్ అన్న విషయం కూడా చాలామందికి తెలియదు. ఆ రియాలిటీ షోలో తనకు బాధ కలిగిన ప్రతీసారి కన్నీళ్లు పెట్టుకుంటూ ప్రేక్షకుల్లో జాలి క్రియేట్ అయ్యేలా చేసింది. నిజంగానే తన జీవితంలో అంత విషాదం ఉందని తెలిసిన ప్రేక్షకులు సైతం చాలా ఫీలయ్యారు. అలాంటిది అన్నీ దాటేసి ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవాలని కల్పన ఎందుకు నిర్ణయించుకుందా అని ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. తను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.