Sri Rama Navami 2025 Special:..శ్రీరామనవమి.. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే గ్రంథాలలో ‘రామాయణం’ కూడా ఒకటి. ఈ రామాయణంలో రాముడి పాత్ర ఎంతైతే ఉందో.. ఆయన వెంటే నడిచిన ధర్మపత్ని సీతాదేవి పాత్ర కూడా అంతే ఉంది. ఇక ఇంతటి అద్భుత కావ్యమైన రామాయణంలో రాముడి పాత్రతో సరి సమానమైన సీతమ్మ వారు ఎంతోమందికి ఆదర్శం. అలాంటి అద్భుతమైన సీతమ్మ పాత్రలో నటించిన కథానాయికలు ఎంతోమంది.. అయితే ఈ అదృష్టం అందరికీ వరించదు. మరి సీతమ్మ వారిలా అవతరించి, నిజంగా సీతమ్మే ఈ భూమిపైకి దిగివచ్చిందేమో అనేంతలా.. ఆ పాత్రలో జీవించేశారు కొంతమంది కథానాయికలు. మరి సీతమ్మ పాత్రలో మెప్పించి ఆ అదృష్టాన్ని సొంతం చేసుకున్న హీరోయిన్స్ ఎవరో ఈ శ్రీరామనవమి సందర్భంగా ఒకసారి గుర్తు చేసుకుందాం..
అంజలీదేవి..
సీతమ్మ అనగానే ప్రతి ఒక్కరికి అంజలీదేవి గుర్తుకొస్తుంది. వెండితెర సీతమ్మగా అంజలి దేవి (Anjali Devi) ఒక వెలుగు వెలిగారు. లవకుశ సినిమాలో సీతమ్మగా ఆమె ప్రేక్షక నీరాజనాలు కూడా అందుకున్నారు. ముఖ్యంగా ‘వీరాంజనేయ’ చిత్రంలో కూడా సీతమ్మ వారి పాత్రలో ప్రేక్షకులను అలరించడం గమనార్హం. ఇకపోతే అంజలీదేవి ఈ సీతమ్మ పాత్రలో ఎంతలా ప్రేక్షకులను అలరించింది అంటే అందుకు ఉదాహరణ కూడా చెప్పుకోవచ్చు. ఒకసారి ఒక పని నిమిత్తం ఆమె బయటకు వెళ్లగా.. అటుగా వెళుతున్న కొంతమంది మహిళలు ఆమె కారును ఆపి నిజంగా సీతాదేవి మన ముందుకు వచ్చిందేమో అని ఆమెకు పాదాభివందనం చేశారు. దీన్ని బట్టి చూస్తే ప్రేక్షకులు అంజలీదేవిని సీతాదేవిగా ఎంత ఓన్ చేసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. అంతలా సీతమ్మ పాత్రలో జీవించేశారు అంజలీదేవి.
జయప్రద..
అంజలీ దేవి తర్వాత అంత పేరు తెచ్చుకున్న హీరోయిన్ జయప్రద (Jayaprada).. ‘సీతాకళ్యాణం’ తో పాటు హిందీలో వచ్చిన ‘లవకుశ’ సినిమాలో కూడా జయప్రద సీత పాత్రలో మెరిశారు. బాపు డైరెక్షన్లో వచ్చిన సీతా కళ్యాణం అనే సినిమాలో సీతమ్మ పాత్రలో అద్భుతంగా నటించారు జయప్రద. అంతేకాదు అటు లవకుశ హిందీ రీమేక్ లో కూడా జయప్రదను చాలా అద్భుతంగా చూపించారు ప్రముఖ డైరెక్టర్ వి మధుసూదన్ రావు.
చంద్రకళ..
శోభన్ బాబు(Shobhan babu ) శ్రీరాముడిగా.. బాపూ దర్శకత్వంలో వచ్చిన ‘సంపూర్ణ రామాయణం’ సినిమాలో చంద్రకళ (Chandrakala) సీత పాత్రలో నటించారు.
నయనతార:
బాలకృష్ణ (Balakrishna) శ్రీరాముడిగా నటించి మెప్పించిన ‘శ్రీరామరాజ్యం’ సినిమాలో నయనతార (Nayanthara) సీతమ్మ పాత్రలో ఒదిగిపోయారు. లవకుశ సినిమాకు రీమేక్ గా వచ్చిన ఈ సినిమాలో నయనతార జీవించేశారు.
కృతి సనన్..
ప్రభాస్ (Prabhas) రాముడిగా ఓంరౌత్ (Om Raut) దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘ఆది పురుష్’ ఈ సినిమాలో కృతి సనన్ (Kriti Sanon) జానకి పాత్ర పోషించారు. అయితే ఈ సినిమా ఏ వర్గం వారిని కూడా మెప్పించలేకపోయింది. పైగా విమర్శలు కూడా ఎదుర్కొన్నారు.
ఇక వీరితోపాటు ‘శ్రీరామ పట్టాభిషేకం’ లో సంగీత, ఎన్టీఆర్ ‘సంపూర్ణ రామాయణం’లో పద్మిని, శ్రీకృష్ణాంజనేయయుద్ధంలో దేవిక, ‘దేవుళ్ళు’ సినిమాలో లయ, ‘శ్రీరామదాసు’ సినిమాలో అర్చన, ‘రామాయణం’ సినిమాలో స్మిత మాధవ్, ‘ఇంద్రజిత్తు’ సినిమాలో రాజశ్రీ, ‘భూ కైలాస్’ సినిమాలో విజయనిర్మల, ‘సీతారామకళ్యాణం’లో గీతాంజలి, ‘సీతారామ జననం’ లో త్రిపుర సుందరి, ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ సినిమాలో కనక తో పాటు పలువురు హీరోయిన్స్ ఈ సీతమ్మ వారి పాత్రలో నటించి గొప్ప అదృష్టాన్ని పొందారు.