Telugu Heroes Remuneration : రెండు రోజుల క్రితం తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ పెద్దలు ప్రెస్ మీట్ పెట్టారు. ఇప్పటి వరకు వచ్చిన బంద్ వార్తలతో పాటు అన్నింటికీ ఓ ముగింపు ఇవ్వాలని అనున్నారు. కానీ, అసలు పంచాయితీ అక్కడే స్టార్ట్ అయింది. ఈ వ్యాఖ్యల తర్వాత జరిగిన కాంట్రవర్సీల వల్ల ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ పదవికి ఏషియన్ సునీల్ నారంగ్ ఏకంగా రాజీనామానే చేయాల్సి వచ్చింది.
ఆ ప్రెస్ మీట్‌లో ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరి శ్రీధర్ మాట్లాడుతూ.. ఆవేశంలో హీరోల రెమ్యునరేషన్ గురించి మాట్లాడారు. నిజానికి ఇప్పుడు జరుగుతున్న అన్ని పరిణామాలకు ప్రధానం కారణం అదే. దాన్ని ఉద్ధేశించే… “కొంత మంది హీరోలకు ఇంత స్టార్ డం ఎక్కడిది. రెండు కోట్లు విలువ చేయనోడికి కూడా 13 కోట్లు ఇస్తున్నారు” అంటూ కామెంట్ చేశాడు.
ఆ మాటల్లో అసలేం తప్పు ఉంది..?
నిజానికి ఈ వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదు. ఆయన చెప్పిన విధానంలో తప్పు ఉండొచ్చు. “వాడు, వీడు” అంటూ అతను పదాలు వాడటంలో తప్పు ఉండొచ్చు. కానీ, ఆ మాటల్లో మాత్రం 100 శాతం నిజమే ఉంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో అదే జరుగుతుంది మరి. కనీస మార్కెట్ వాల్యూ లేని హీరోలకు కూడా కోట్లల్లో రెమ్యునరేషన్ ఇచ్చి.. ఇండస్ట్రీని పాడు చేస్తున్నారు నిర్మాతలు అంటూ ఇప్పటికే చాలా సార్లు చాలా మంది అనేక వేదికల్లో మాట్లాడారు
2 కోట్లు కూడా మార్కె ట్ వాల్యూ లేని హీరోపై 10 కోట్ల వరకు బడ్జెట్ పెడుతున్నారు. మరో 10 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇస్తున్నారు. వచ్చే ఫలితం మాత్రం కోట్లల్లో నష్టాలు.
పోని సినిమా సక్సెస్ అయితే… అది మరో తలనొప్పి. డైరెక్టర్‌తో పాటు ఇతర కాస్ట్ అండ్ క్రూ క్రెడిట్‌ను కూడా హీరోల ఖాతాలోనే వేసుకుని తమ పీఆర్ టీంతో గ్రాండ్‌గా పబ్లిసిటీ చేసుకుంటున్నారు. నిర్మాతలు కూడా అదే నమ్ముతున్నారు. తర్వాత సినిమాలకు ఆ హీరోలకు రెట్టింపు పారితోషికాలు చేతిలో పెట్టి మరీ సినిమాలకు ఒప్పిస్తున్నారు.
అసలు విడిచి కొసరు పట్టుకున్నారు
అదే విషయాన్ని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ శ్రీ ధర్ కాస్త లౌడ్ గా చెప్పాడు అంతే. దీనిలో ఎవరూ నొచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఆ పరిస్థితిని అర్థం చేసుకుని దాన్ని క్లీయర్ చేసే ప్రయత్నం చేయాలి.
కానీ, దురదృష్టవశాత్తు అలాంటి ప్రయాత్నాలు ఇండస్ట్రీలో జరగడం లేదు. అసలు విషయం పక్కన పెట్టి కొసరు పట్టుకున్నట్టు… శ్రీధర్ లేవనెత్తిన మెయిన్ టాపిక్‌ను పక్కన పెట్టి… అలా ఎలా మాట్లాడుతారు అంటూ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న ఇష్యూని క్లియర్ చేయలేని ఓ అనసవరమైన విషయాన్ని పట్టుకుని కొంత మంది హీరోలు సీరియస్ అవుతున్నారట.
అంతే కాదు, ఆ కొంత మంది హీరోల దెబ్బకు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు ఏసియన్ సునీల్ నారంగ్ ఏకంగా తన పదవికే రాజీనామా చేయాల్సి వచ్చిందనే వాదన కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తుంది.