Director:సినీ ఇండస్ట్రీకి చెందిన దర్శకుడిపై కొంతమంది కర్రలతో దాడి చేసిన విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అత్యంత వేగంగా బైకులపై దూసుకు వెళ్తున్న యువకులను ఎందుకు అంత వేగంగా డ్రైవ్ చేస్తున్నారు అంటూ ప్రశ్నించడంతో.. ఆ స్కూటరిస్టులు డైరెక్టర్ పై కర్రలతో దాడి చేసి, గాయపరిచిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ విషయం తెలిసి అటు సినీ పరిశ్రమ, ఇటు ప్రేక్షకులు అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బైక్ ను అంత వేగంగా ఎందుకు నడుపుతున్నారు అని ప్రశ్నించడం తప్పా.. అంటూ నెటిజన్లు కూడా ఆ స్కూటరిస్టు లపై మండిపడుతున్నారు. మరి అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
అసలేమైందంటే..
జూబ్లీహిల్స్ డోర్ నెంబర్ -5 లో నివాసం ఉంటున్న ప్రముఖ సినీ డైరెక్టర్ మీర్జాపురం అశోక్ తేజ (Ashok Teja) బుధవారం రాత్రి మాదాపూర్ నుంచి కృష్ణానగర్ వెళ్తుండగా జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ – 10 నుంచి రెండు బైకులపై నలుగురు కుర్రాళ్ళు మద్యం మత్తులో చాలా ర్యాష్ గా డ్రైవ్ చేస్తూ, ఓవర్ టేక్ చేస్తూ న్యూసెన్స్ క్రియేట్ చేశారట. ఇది గమనించిన డైరెక్టర్ అశోక్ తేజ వారిని ఆపి, ఎందుకు అంత స్పీడ్ గా వెళ్తున్నారు అని ప్రశ్నించారట. దీంతో మద్యం మత్తులో ఉన్న ఆ నలుగురు యువకులు డైరెక్టర్ ను చుట్టుముట్టి కర్రలతో దాడి చేశారు. ఇక వారి భారీ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినా .ఆ యువకులు వదిలిపెట్టలేదు. ఇక ఈ ఘటనను గుర్తించిన వాహనదారులు అక్కడికి చేరుకోవడంతో డైరెక్టర్ ను వదిలేసి ఆ యువకులు అక్కడి నుండి పరారైనట్లు సమాచారం. ముఖ్యంగా ఎఫ్జెడ్ బైకులపై రాత్రిలో ఆవారాగా తిరుగుతూ.. దారిన పోయే వారిని వేధిస్తూ.. ప్రశ్నిస్తే, కొడుతూ, అందిన కాడికి డబ్బులు లాక్కుంటున్నట్లు వారిపై ఫిర్యాదులు ఉన్నాయి. ఇక బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు .. నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వెంటనే పోలీసులు స్పందించి, ఆ నలుగురిపై తగిన యాక్షన్ తీసుకోవాలని కూడా నెటిజన్స్ కోరుతున్నారు. ఇకపోతే ఈ ఘటన బుధవారం రాత్రి చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.