Actress : సెలబ్రిటీల ఆలోచనలు, ముఖ్యంగా పెళ్లి, భర్త పిల్లలపై వాళ్ళు చేసే కామెంట్స్ తరచుగా హాట్ టాపిక్ గా మారుతాయి. తాజాగా ఓ బిగ్ బాస్ బ్యూటీ భర్తతో అవసరం ఏముంది? భర్త లేకుండా నేను ఒక మంచి తల్లిని అవుతాను అంటూ ఇచ్చిన స్టేట్మెంట్ వైరల్ అవుతుంది.
భర్త వద్దు పిల్లలు ముద్దు
ప్రముఖ బుల్లితెర నటి, బిగ్ బాస్ హిందీ 16 కంటెస్టెంట్ టీనా దత్తా (Tina Datta) తన ఫ్యూచర్ ప్లాన్స్ గురించి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ “టైం వచ్చినప్పుడు నేను గొప్ప తల్లిని అవుతానని గట్టిగా నమ్ముతున్నాను. ఇప్పటిదాకా సింగిల్ మదర్ గా ఉండాలని నేను ప్లాన్ చేయలేదు. కానీ ఒకవేళ దత్తత తీసుకున్నా లేదా సరోగసి ద్వారా అయినా నేను పిల్లలకు తల్లి కావాలని ఆలోచనలో ఉన్నాను.
ఇద్దరు అందమైన కుమార్తెలను దత్తత తీసుకున్న సుస్మితా సేన్ (Sushmitha Sen) వంటి మహిళలను నేను అభినందిస్తున్నాను. నిజానికి నా తల్లిదండ్రులు ఒక చిన్న పట్టణంలో నివసిస్తున్నారు. బెంగాలీ నేపథ్యం నుంచి వచ్చినప్పటికీ వాళ్ళు అభ్యుదయవాదులు. కాబట్టి నేను సరోగసి ద్వారా లేదా బిడ్డను దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నా సరే… నాకు నా తల్లిదండ్రుల నుంచి పూర్తిగా సపోర్ట్ ఉంటుంది. నేను ఇండిపెండెంట్ గా ఉండడాన్ని నమ్ముతాను. నన్ను నేను చూసుకోవడానికి భర్త అక్కర్లేదు. నా కుటుంబాన్ని నేను జాగ్రత్తగా చూసుకోగలిగితే, నేను పిల్లలను కూడా జాగ్రత్తగా చూసుకోగలను. అంతేగానీ నన్ను, పిల్లలను చూసుకునే బాధ్యత కోసం భర్తపై ఆధారపడాల్సిన అవసరం ఏమీ లేదు” అంటూ చెప్పుకొచ్చింది టీనా.
సెలబ్రిటీలు కాబట్టి వార్తల్లో…
టీనా (Tina Datta) మాట్లాడుతూ “ఇప్పటికే ఇలాంటి పద్ధతులను సమాజం అంగీకరించింది. కానీ మేము ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉండడం వల్ల మా వ్యక్తిగత జీవితాలపై ఎక్కువగా ఫోకస్ ఉంటుంది. సినిమా ఇండస్ట్రీ కొత్త మార్పును తీసుకొస్తుందని ప్రజలు అనుకుంటారు. కానీ సినిమా ఇండస్ట్రీలోనే కాదు బయట కూడా జనాలు చాలా మారిపోయారు. పిల్లలను దత్తత తీసుకున్న ఎంతో మంది స్నేహితులు ఉన్నారు నాకు. కాకపోతే వాళ్లది సాధారణ జీవితం కాబట్టి, ఆ వార్తలు బయటకు రావు.
సినిమా పరిశ్రమ అనేది ఆల్రెడీ జరుగుతున్న మార్పులను మరింత బెటర్ చేస్తుంది. ఎందుకంటే మనం చేసే ప్రతి పని పబ్లిక్ కి చేరుతుంది కాబట్టి” అంటూ భర్త లేకుండానే తను పిల్లలకు తల్లి కావడానికి సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా వెల్లడించింది.
‘ఉత్తరన్’ అనే హిందీ సీరియల్ తో పాపులర్ అయింది టీనా. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ (Salman Khan) హోస్ట్ చేసిన ‘బిగ్ బాస్ సీజన్ 16’ (Bigg Boss 16) లో కూడా పార్టిసిపేట్ చేసింది. ఈ అమ్మడి వయసు ప్రస్తుతం 33 ఏళ్లు. టీనా దత్త నటించిన క్రైం థ్రిల్లర్ సిరీస్ ‘పర్సనల్ ట్రైనర్’ (Personal Trainer) జనవరి 23న హంగామాలో రిలీజ్ అయింది.