Tollywood:గత కొన్ని రోజులుగా సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు అభిమానులను మరింత దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. కొంతమంది వయసు మీద పడడంతో తుది శ్వాస విడుస్తూ ఉండగా.. మరి కొంతమంది అనారోగ్య సమస్యలతో మృత్యువాతపడుతున్నారు. మరికొంతమంది చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించి అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఒక ప్రముఖ నటి తల్లి స్వర్గస్తులయ్యారు. అసలు విషయంలోకి వెళితే.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నటి గా గుర్తింపు తెచ్చుకున్న రజిత (Rajitha) అందరికీ సుపరిచితురాలే. ఇక ఈరోజు మధ్యాహ్నం ఈమె తల్లి విజయలక్ష్మి(Vijaya Lakshmi) గుండెపోటుతో మరణించారు. ప్రస్తుతం ఈమె వయసు 76 సంవత్సరాలు కావడం గమనార్హం. ఇకపోతే తల్లి మరణించిన విషయాన్ని రజిత తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకుంది. ఇక విజయలక్ష్మి ఎవరో కాదు ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కృష్ణవేణి (Krishnaveni), రాగిణి(Ragini ) లకు స్వయాన అక్క అవుతుంది. విజయలక్ష్మి మృతికి టాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. అదే సమయంలో రజిత ధైర్యంగా ఉండాలని కూడా చెబుతున్నారు.
ప్రముఖ నటి రజిత వ్యక్తిగత వివరాలు..
రజిత విషయానికి వస్తే.. 1972 అక్టోబర్ 18న తూర్పుగోదావరి జిల్లా కొల్ల అనే ప్రాంతంలో మల్లెల రామారావు, విజయలక్ష్మి దంపతులకు జన్మించారు. చిన్న వయసులోనే తండ్రి మరణించడంతో.. ఆమె తల్లి ఆమెను చదివించింది. రజితకు ఇద్దరు అక్కలు కూడా ఉన్నారు. పదో తరగతి వరకు కాకినాడలో చదివిన ఈమె.. ఇంటర్మీడియట్ చెన్నైలో పూర్తి చేసింది. ఇకపోతే ఈమె పిన్నమ్మలు కృష్ణవేణి, రాగిణి ఇండస్ట్రీలో ఉన్నా.. ఈమెకు నటనపై ఆసక్తి ఉండేది కాదు. కానీ ఒకసారి 9వ తరగతి చదువుకున్న సమయంలో చెన్నైలో ఉన్న తన పిన్నమ్మ కృష్ణవేణి దగ్గరికి వెళ్ళింది.ఆమె 1987లో రాఘవేంద్రరావు దర్శకత్వం వహిస్తున్న అగ్నిపుత్రుడు సినిమాలో నాగార్జునకు జోడిగా నటించింది ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో కృష్ణవేణి తో పాటు షూటింగ్ సెట్ కి వెళ్ళిన రజితను చూసిన పరుచూరి గోపాలకృష్ణ రాఘవేంద్రరావుకు పరిచయం చేశారు. ఆ సినిమాలో నాగేశ్వరరావు కూతురిగా నటించమన్నారు. కానీ సినిమాల మీద ఇంట్రెస్ట్ లేక మొదట్లో వద్దని చెప్పినా.. వారు నచ్చజెప్పడంతో అందుకు అంగీకరించింది. ఆ తరువాత సినిమాల మీద ఆసక్తి పెంచుకొని, చెన్నైలో ఇంటర్మీడియట్ పూర్తి చేస్తూనే మరొకవైపు సినిమాల్లో నటించింది.
రజిత సినిమాలు..
అలా తొలిసారి ‘అగ్ని పుత్రుడు’ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె.. ఆ తర్వాత సాహసం చేయరా డింభకా, వివాహ భోజనంబు, చినరాయుడు వంటి సినిమాలలో నటించింది. ఇక తమిళ్, కన్నడ భాషల్లో కూడా కథానాయికగా నటించింది. ఇక 1995 నుంచి నటనవైపు పూర్తి దృష్టి పెట్టిన ఈమె ‘పెళ్ళికానుక’ సినిమాతో ఉత్తమ హాస్యనటిగా రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం కూడా అందుకుంది. ఇక ఇప్పుడు తమిళ్, కన్నడ భాష చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు కూడా పోషిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇక ఇంకా ఈమె పెళ్లి చేసుకోలేదు. తల్లితోనే ఉంటూ జీవితాన్ని కొనసాగిస్తున్న ఈమెకు ఇప్పుడు తల్లి కూడా దూరం అవడంతో రజిత పూర్తిగా శోకసంద్రంలో మునిగిపోయిందని చెప్పవచ్చు.