Upendra: ఈరోజుల్లో చాలామంది హీరోలకు పాన్ ఇండియా పాపులారిటీ కావాలనే కోరిక మొదలయ్యింది. కేవలం యంగ్ హీరోలు మాత్రమే కాదు.. సీనియర్ హీరోలు సైతం తమ సినిమాలు పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలయితే చూడాలని ఆశపడుతున్నారు. ఒక మూవీ ఆ రేంజ్‌లో హిట్ కావాలంటే ముందుగా నార్త్ ఆడియన్స్‌ను మెప్పించాలి. తాజాగా కన్నడ సీనియర్ హీరో అయిన ఉపేంద్ర కూడా అదే ప్రయత్నంలో ఉన్నారు. తాజాగా ‘యూఐ ది మూవీ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఉపేంద్ర.. తాను నటించి డైరెక్ట్ చేసిన ఈ మూవీని హిందీలో రీమేక్ చేయాలని ఉంది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మల్టీ టాలెంటెడ్
దర్శకుడిగా, హీరోగా.. ఇలా రెండు కష్టమైప కేటగిరిల్లో సక్సెస్ అయిన సినీ సెలబ్రిటీలు చాలా తక్కువమంది ఉన్నారు. వారిలో ఉపేంద్ర కూడా ఒకరు. ఒకప్పుడు ఉపేంద్ర డైరెక్ట్ చేస్తూ నటించిన సినిమాలకు ఇప్పటికీ క్రేజ్ ఉంది. పైగా సోషల్ మీడియా అనేది వచ్చిన తర్వాత ఆ సినిమాలకు మరింత క్రేజ్ పెరిగింది. అందుకే ఆయన మళ్లీ డైరెక్ట్ చేస్తే చూడాలని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూశారు. అలా తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ దర్శకుడిగా మారి ‘యూఐ ది మూవీ’ అనే సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీకి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండడంతో థియేటర్లలో దూసుకుపోతోంది. ఇదే సమయంలో ఆయన బాలీవుడ్ ప్లాన్స్‌ను బయటపెట్టారు ఉపేంద్ర.
Also Read: బ్రెయిన్‌లో బ్లడ్ క్లాట్, అప్పుడే ప్రెగ్నెన్సీ.. ఈ వండర్ ఉమెన్ జీవితంలో ఇంత విషాదమా.?
ఇప్పటికి తగినట్టుగా
1999లో ఆయన పేరునే టైటిల్‌గా పెట్టి ‘ఉపేంద్ర’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఉపేంద్ర. ఆ సినిమాను హిందీలో రీమేక్ చేయాలని ఉందని తాజాగా కోరికను బయటపెట్టారు. అంతే కాకుండా ఆ సినిమా ఇప్పటి ప్రేక్షకులకు కూడా తగినట్టుగా ఉంటుందని తెలిపారు. భవిష్యత్తు తరాలకు కూడా కనెక్ట్ అయ్యేలా చేసిన ఆ మూవీని ఇప్పటికీ ఆడియన్స్ ఆదరిస్తారని అన్నారు. ఒకప్పుడు అమితాబ్ బచ్చన్ ప్రొడక్షన్ హౌస్‌లో ఉపేంద్ర ఒక సినిమా చేయాల్సి ఉంది. కానీ అప్పటికే ఆయనకు కన్నడతో పాటు తెలుగులో కూడా వరుసగా కమిట్మెంట్ ఉండడంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. అప్పట్లో ఒకే భాషపై ఫోకస్ చేయడం బెటర్ అనిపించింది అంటూ ఈ విషయాన్ని గుర్తుచేసుకున్నారు ఉపేంద్ర (Upendra).
పాన్ ఇండియా అంటే
‘‘కన్నడ సినిమా అనేది గత కొన్నేళ్లలో చాలా మారింది. టెక్నికల్‌గా చాలా ముందుకెళ్లింది. పాన్ ఇండియా ట్రెండ్ అనేది ఇండస్ట్రీలో సునామి సృష్టించింది. తక్కువ బడ్జెట్‌తో ఒక పాటను మూడు రోజుల్లో షూట్ చేసే దగ్గర నుండి వీఎఫ్‌ఎక్స్‌ను ఉపయోగించి చాలా జాగ్రత్తగా తెరకెక్కించడం వరకు చాలా విషయాలు మారాయి. పాన్ ఇండియా సినిమా అనేది ప్రతీ భాషలోని మూవీ లవర్స్‌ను దగ్గర చేయడానికి మాత్రమే. దాని వల్ల ఫిల్మ్ మేకింగ్‌లో కూడా చాలా మార్పులు వచ్చాయి. ఒక సినిమాను ఒకేసారి అయిదు భాషల్లో తెరకెక్కించడం వల్ల ఎక్కువమంది ఆడియన్స్‌కు రీచ్ అవుతుంది. కన్నడ సినిమాకు దేశవ్యాప్తంగా గుర్తింపు రావడం చాలా సంతోషంగా ఉంది’’ అని తెలిపారు ఉపేంద్ర.