The Goat: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ డబుల్ రోల్ లో నటించిన చిత్రం ది గోట్. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎన్నో అంచనాల మధ్య నేడు రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ను అందుకుంది. ఈ సినిమాపై మొదటి నుంచి అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. అందుకు కారణాలు చాలానే ఉన్నాయి. మొదటిది .. ఇదే విజయ్ చివరి చిత్రం కావడం.
రాజకీయ పార్టీని స్థాపించిన విజయ్.. ఈ సినిమా తరువాత మళ్లీ వెండితెరపై కనిపించడు అని చెప్పుకొచ్చారు. దీంతో ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకులుకూడా ఎంతగానో ఎదురుచూసారు. ఎన్నో వాయిదాల తరువాత ది గోట్ మూవీ ఈరోజు రిలీజ్ అయ్యింది. తమిళ్ తంబీలకు ఈ సినిమా నచ్చినా.. తెలుగువారికి ఇంతకంటే మంచి సినిమాలనే చూసాం అన్న ఫీల్ వచ్చింది.
ది గోట్ అని టైటిల్ పెట్టి.. ప్రేక్షకులకు గొర్రెలుగా చేసినట్లు అనిపించిందని చెప్పుకొస్తున్నారు. తెలుగులో స్పై కథలు కొత్తేమి కాదు. తమిళ్ లో వచ్చిన స్పై కథలు కూడా తెలుగు ప్రేక్షకులను మెప్పించాయి. కానీ, ది గోట్ మాత్రం ఆశించినట్లు లేదు. స్పై అనేవాడు ముందు వెనుక ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోడు.
కానీ ఈ సినిమాలో విజయ్.. అసలు తన కొడుకు చనిపోయాడా.. ? లేదా .. ? ఒకవేళ చనిపోతే ఎవరు చంపారు.. ? అనేది కనుక్కోవడానికి కూడా ప్రయత్నించడు. సరే కొన్నేళ్ల తరువాత కొడుకు బతికి వచ్చినప్పుడు తండ్రి ప్రేమకొద్దీ మొదట ఇంటికి తీసుకెళ్లినా.. ఇప్పటివరకు కొడుకు ఏం చేశాడు.. ? అసలు ఆ కొడుకు ఎలా బతికాడు అనేది తెలుసుకోడు. గ్రేటెస్ట్ అని టైటిల్ పెట్టడం తప్ప.. సినిమాలో అంత గ్రేట్ గా ఏది చూపించలేదు. కొన్ని యాక్షన్ సీన్స్ అన్ని.. హాలీవుడ్ జెమిని మ్యాన్ సినిమా నుంచి కాపీ కొట్టినట్లు అనిపిస్తున్నాయి.
ఇక కొద్దో గొప్పో ప్రేక్షకులు ఈలలు వేసిన సన్నివేశాలు అంటే.. క్యామియోలుగా త్రిష, శివ కార్తికేయన్, ధోని, విజయ్ కాంత్ కనిపించినప్పుడే అని చెప్పాలి. మానాడు లాంటి ఒక క్లిష్టమైన లూప్ సబ్జెక్టు ను ప్రేక్షకులకు అర్థమయ్యేలా తీసిన వెంకట్ ప్రభునేనా ఇలాంటి ఒక సినిమా తీసింది అని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. పాత రొట్ట కథలను తిప్పి తిప్పి తీసుకొచ్చి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే తమిళ్ వారు ఓకే అంటారేమో కానీ, తెలుగువారు అస్సలు ఆదరించరు.
ఒక కామెడీ లేదు, అర్ధం పర్థం లేని సమయంలో సాంగ్స్ రావడం, ఫ్యామిలీ ఎమోషన్స్ అయితే అస్సలు లేవని , విజయ్ ఇలాంటి కంటెంట్ ను ఎలా ఎంకరేజ్ చేస్తున్నాడని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. తండ్రి విజయ్.. స్పై గా నటించిన విధానము బాగానే ఉన్నా .. కొడుకు విజయ్ ముఖం తేడా కొట్టేసినట్లు అనిపించింది. తెరపై అతని ఫేస్ కనిపించిన ప్రతిసారి విజయ్ ను చూసినట్లు అనిపించలేదని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా విజయ్ చివరి చిత్రం ఇలాంటి డిజాస్టర్ టాక్ ను అందుకుంటుందని ఎవరు అనుకోలేదు. మరి ఈ సినిమా మొదటి రోజు ఎలాంటి కలక్షన్స్ అందుకుంటుందో చూడాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.