Vijay Sethupathi: ప్రతీ సినిమాకు తమను తాము కొత్తగా మార్చుకోవడం, మంచి కథలు ఎంచుకోవడం అనేది అందరికీ సాధ్యం కాని విషయం. అలాంటిది విజయ్ సేతుపతి అది చేసి చూపించాడు. అందుకే హీరో పాత్ర కాకపోతే విలన్ పాత్రలో ప్రేక్షకులను ఎల్లప్పుడూ అలరిస్తూనే ఉంటాడు. అలాంటి హీరో ఇప్పుడు పూరీ జగన్నాధ్‌తో సినిమా చేయడానికి అంగీకరించాడు. ఇందులో సీనియర్ నటి టబు హీరోయిన్‌గా నటిస్తోంది. పూరీ జగన్నాధ్ గత సినిమాలు అంతగా సక్సెస్ అవ్వకపోయినా విజయ్ సేతుపతి లాంటి స్టార్ తనతో కలిసి పనిచేయడానికి ఒప్పుకున్నాడు. అలా ఒప్పుకోవడానికి కారణమేంటో తాజాగా బయటపెట్టాడు విజయ్ సేతుపతి.
రిపీట్ చేయను
‘‘పూరీ జగన్నాధ్ (Puri Jagannadh)తో నేను చేస్తున్న సినిమా జూన్‌లో ప్రారంభమవుతుంది. నా దర్శకులు గతంలో ఏం చేశారు అనే విషయాన్ని నేను జడ్జ్ చేయను. నాకు స్క్రిప్ట్ నచ్చితే సినిమా చేస్తాను. పూరీ ప్రజెంట్ చేసింది నాకు నచ్చింది. అది ఒక పూర్తిస్థాయి యాక్షన్ సినిమా. అలాంటిది నేను ముందెప్పుడూ చేయలేదు. నేను ముందెప్పుడూ ట్రై చేయనివి చేస్తూ.. ఏదీ రిపీట్ చేయకుండా చూసుకోవాలి’’ అని చెప్పుకొచ్చాడు విజయ్ సేతుపతి. ఈ మూవీలో తను టబుతో కలిసి నటిస్తున్నాడు కాబట్టి తనతో కలిసి పనిచేయాలని తెలిసినప్పుడు ఎలా ఫీల్ అయ్యాడో కూడా బయటపెట్టాడు. ‘‘టబుకు సినిమాలో కీలక పాత్ర ఉంది. తను చాలా మంచి నటి. ఒక టాలెంటెడ్ కో స్టార్‌తో, అది కూడా ముందెప్పుడూ కలిసి పనిచేయడం ఎప్పుడూ మంచి అనుభవమే’’ అని తెలిపాడు.
చేస్తున్నప్పుడు వణికిపోయాను
విజయ్ సేతుపతి (Vijay Sethupathi) హీరోగా నటించిన చివరి చిత్రం ‘మహారాజా’ బ్లాక్‌బస్టర్ హిట్‌ను సాధించింది. థియేటర్లలోనే కాకుండా ఓటీటీలో కూడా మంచి సక్సెస్ అయ్యింది. ఆ సినిమాపై ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశాడు ఈ హీరో. ‘‘పిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి చెప్తూ తెరకెక్కించిన సినిమానే మహారాజా. చాలాసార్లు సీన్స్ చేస్తున్నప్పుడు నేనే వణికిపోయాను. ఎమోషనల్‌గా లీనమవ్వడంలో చూస్తే ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో మహారాజానే కష్టమైన పాత్ర. సూపర్ డీలక్స్, ఉప్పెనలో కూడా కష్టమైన పాత్రలే చేశాను. ముఖ్యంగా సూపర్ డీలక్స్‌లో నేను ఒక అమ్మాయిగా ఫీల్ అవ్వాలి. కానీ మహారాజా పాత్ర చాలా పర్సనల్‌గా అనిపించింది. ఎందుకంటే నిజ జీవితంలో నేను కూడా ఒక కూతురికి తండ్రినే’’ అని చెప్పుకొచ్చాడు.
Also Read: టైటిల్ వల్లే సినిమా ఆగలేదు.. ‘గాంజా శంకర్’పై దర్శకుడి క్లారిటీ
అన్నీ చేస్తాను
‘‘సినిమాల్లో స్ట్రాంగ్ మెసేజ్ ఉండడం నాకు ఇష్టం. అలా అని ఎంటర్‌టైన్మెంట్ సినిమాల్లో నటించను అని కాదు’’ అని స్టేట్‌మెంట్ ఇచ్చాడు విజయ్ సేతుపతి. ప్రస్తుతం తన చేతిలో చాలానే సినిమాలు ఉన్నాయి. అవే మిస్కిన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ట్రైన్’, అరుగుమ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఏస్’. ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి పూరీ జగన్నాధ్ సినిమా కూడా యాడ్ అయ్యింది. పూరీ గత సినిమాలు డిశాస్టర్ అవ్వడం చూసి తెలుగు హీరోలే తనకు అవకాశాలు ఇవ్వకపోయినా విజయ్ సేతుపతి మాత్రం బాగానే నమ్మాడంటూ ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు.