Sampath Nandi: టాలీవుడ్‌లోని కమర్షియల్ డైరెక్టర్స్‌లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకొని బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకున్నాడు సంపత్ నంది. చాలామంది మూవీ లవర్స్ ఈయనను ఒక అండర్ రేటెడ్ డైరెక్టర్ అని కూడా అంటుంటారు. అయితే తను డైరెక్ట్ చేసిన గత కొన్ని సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో సంపత్ నందిని చాలామంది మర్చిపోయారు. మళ్లీ ‘ఓదెల 2’తో బరిలోకి దిగనున్నాడు ఈ డైరెక్టర్. తమన్నా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు తను దర్శకుడు కాకపోయినా దర్శకత్వ వర్యవేక్షణ వరకు పరిమితమయ్యాడు. అందుకే ఈ మూవీ ప్రమోషన్స్‌లో ఆయన కూడా పాల్గొంటున్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో సాయి ధరమ్ తేజ్‌తో తను చేయాల్సిన ‘గాంజా శంకర్’పై క్లారిటీ ఇచ్చాడు సంపత్ నంది.
అందుకే కష్టపడుతున్నాను
ముందుగా తన కెరీర్‌లో వచ్చిన గ్యాప్ గురించి మాట్లాడాడు సంపత్ నంది. ‘‘గ్యాప్ కావాలని తీసుకోలేదు, వచ్చింది. ఓదెల 2 లాంటి కథ రాయాలంటే నాకు కనీసం ఒక సంవత్సరం పడుతుంది. నా తరువాతి సినిమా కంటెంట్ రాయాలంటే కనీసం ఏడాది, ఏడాదిన్నర కావాలి. సెపరేట్ ప్రపంచానికి సంబంధించిన కథ అది. 1960ల్లో మహారాష్ట్ర, ఆదిలాబాద్ బోర్డర్‌లో జరిగిన సంఘటనకు కొన్ని ఫిక్షనల్ విషయాలు యాడ్ చేశాం. దానిపై ఎంతో రీసెర్చ్ జరిగింది. ఇలాంటి వాటి వల్ల గ్యాప్ అనే ఫీలింగ్ ఏం లేదు. ప్రతీరోజూ నన్ను నేను బెటర్ చేసుకోవడానికే కష్టపడుతున్నాను. స్టోరీ టెల్లింగ్‌లో ఇంప్రూవ్ అవ్వడానికి ప్రయత్నం చేశాను. భవిష్యత్తులో నేను చేసే సినిమాల్లో నా కష్టం కనిపిస్తుందని నమ్ముతున్నాను’’ అని చెప్పుకొచ్చాడు.
మొత్తానికి క్లారిటీ
అసలైతే సంపత్ నంది (Sampath Nandi), సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్‌లో ‘గాంజా శంకర్’ (Ganja Shankar) అనే సినిమా రావాల్సింది. ఈ సినిమాకు సంబంధించిన పలు పోస్టర్స్, గ్లింప్స్ కూడా విడుదలయ్యాయి. కానీ అనుకోకుండా ఈ సినిమా ఆగిపోయింది. అసలు ఎందుకు ఆగిపోయింది? ఆగిపోయిందా లేదా అనే క్లారిటీ కూడా ఇప్పటికీ ప్రేక్షకులకు రాలేదు. అప్పటినుండి మేకర్స్ కూడా దీనిపై స్పందించలేదు. ఫైనల్‌గా ఇన్నాళ్ల తర్వాత ‘ఓదెల 2’ (Odela 2) ప్రమోషన్స్ కోసం సంపత్ నంది బయటికి రావడంతో తనకు ‘గాంజా శంకర్’ గురించి ప్రశ్న ఎదురయ్యింది. మొత్తానికి ఈ సినిమా ఆగిపోయిందని క్లారిటీ ఇచ్చేశాడు. కానీ ఇది ఆగిపోవడానికి టైటిల్ మాత్రం కారణం కాదని చెప్పుకొచ్చాడు సంపత్ నంది.
Also Read: గాసిప్ వండటంలో పీహెచ్‌డీ అంటే ఇదేనేమో.. పాపం బన్నీకే ఎందుకు ఇలా?
ప్రభుత్వానికి హక్కు ఉంది
‘‘గాంజా శంకర్ టీజర్ కూడా రిలీజ్ చేశాం. కానీ ఆ సినిమా ఆగిపోవడం అనేది ఫిల్మ్ మేకర్‌గా నాకు కూడా సర్‌ప్రైజే. అప్పుడు ఓటీటీ కారణాలు, బడ్జెట్ కారణాలు.. ఇలా ఎన్నో కారణాల వల్లే అది ఆగిపోయింది. ప్రభుత్వం నుండి నోటీసులు వచ్చినప్పుడు అందరం కలిసి కూర్చొని అది ముందుకు తీసుకెళ్లడం కరెక్ట్ కాదు అనగానే ఆపేశాం. టైటిల్ మాత్రమే సినిమా ఆగిపోవడానికి కారణం కాదు. గాంజాకు వ్యతిరేకంగా సినిమా తీస్తున్నాం కానీ ప్రభుత్వమే మమ్మల్ని వ్యతిరేకించింది. ప్రభుత్వానికి అడగడానికి హక్కు ఉంది. కానీ అప్పటి పరిస్థితులు వేరు. అందరం కలిసి కూర్చున్న నిర్ణయమే అది’’ అని ‘గాంజా శంకర్’ ఆగిపోవడం గురించి మాట్లాడాడు సంపత్ నంది.