Viral Prapancham Trailer: ఇంటర్నెట్, ఆన్‌లైన్ క్రైమ్స్‌పై ఇప్పటివరకు పలు సినిమాలు తెరకెక్కాయి. ప్రతీ సినిమాలో ఇంటర్నెట్‌కు సంబంధించి ప్రేక్షకులకు తెలియని ఏదో ఒక కొత్త విషయాన్ని వారికి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. అలాంటి సినిమాలు చూసిన ప్రతీసారి ఇంటర్నెట్ వల్ల ఇన్ని అపాయాలు ఉంటాయా అని ప్రేక్షకులు గ్రహించేలా చేస్తున్నారు. తాజాగా అదే జోనర్‌లో మరో మూవీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది. నిజంగా జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ పేరే ‘వైరల్ ప్రపంచం’. తాజాగా విడుదలయిన ఈ మూవీ ట్రైలర్ చూస్తుంటే ఇంటర్నెట్ అంటేనే ప్రేక్షకుల్లో భయం కలిగేలా చేస్తున్నారు.
స్క్రీన్ బేస్డ్ సినిమా
ఒక వ్యక్తి బిల్డిండ్‌పై నుండి దూకి సూసైడ్ చేసుకుంటున్న వీడియోతో ‘వైరల్ ప్రపంచం’ ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత అసలు రివెంజ్ పార్న్‌కు అర్థమేంటో చూపిస్తారు. ఈ మూవీని స్క్రీన్ బేస్డ్ సస్పెన్స్ డ్రామాగా తెరకెక్కించాడు దర్శకుడు బ్రిజేష్ తంగీ. ఇందులో సుప్రియా పాత్రలో ప్రియాంక శర్మ, రవి పాత్రలో సాయి రోనక్ నటించారు. ఇతర కీలక పాత్రల్లో సన్నీ నవీన్, నిత్యా శెట్టి నటించారు. ‘‘మన ప్రపంచంలో ఒక్కొక్క మనిషి ఒక్కొక్కలాగా చూస్తాం. కానీ నిజానికి ఆ మనిషి చాలా వేరు అయ్యిండొచ్చు’’ అంటూ కనెక్ట్ అయ్యే డైలాగ్‌తో అసలు కథ మొదలవుతుంది. ప్రియాంక, సాయి రోనక్ లాంగ్ డిస్టెన్స్ ప్రేమికులుగా కనిపించనున్నట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.
రహస్యాలు దాగవు
ప్రియాంక అమెరికా షిఫ్ట్ అయిపోవడంతో వారికి వీడియో కాల్స్ తప్పా మాట్లాడుకోవడానికి మరే ఇతర ఆధారం ఉండదు. అలాగే సన్నీ, నిత్యా కూడా దూరంగా ఉంటూ కేవలం వీడియో కాల్స్‌లోనే మాట్లాడుకుంటూ ఉంటారు. అలా వీడియో కాల్స్‌లో వారు చేసే పనుల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కుంటారో అదే ‘వైరల్ ప్రపంచం’ (Viral Prapancham) కథ అని ట్రైలర్ చూస్తేనే ప్రేక్షకులకు క్లారిటీ వచ్చేస్తుంది. ‘ఇంటర్నెట్‌లో చాలా రహస్యాలు ఉంటాయి. కానీ ఏ రహస్యం కూడా దాగదు’ అంటూ డైలాగ్‌తోనే స్టోరీ లైన్ మొత్తం బయటపెట్టేశాడు దర్శకుడు. వీడియో కాల్స్, స్క్రీన్ రికార్డింగ్ వల్ల వారి జీవితాలు ఎలా మారిపోయాయి అనేది ఈ సినిమా కథ అని డైరెక్టర్ చెప్పకనే చెప్పాడు.
Also Read: బాలీవుడ్ లో ‘సంక్రాంతికి వస్తున్నాం’ రీమేక్.. ఆ స్టార్ హీరోతో కలిసి అనిల్ రావిపూడి ఫన్..
చనిపోయేది ఎవరు?
‘స్క్రీన్ లైఫ్ ఇన్సిడెంట్స్ వల్ల ఎంతోమంది జీవితాలు ఎలా నాశనమయ్యాయి అనేదాని ఆధారంగా తెరకెక్కిన సినిమా వైరల్ ప్రపంచం’ అని చెప్పడంతో ఈ మూవీ ట్రైలర్ ఎండ్ అవుతుంది. మొత్తానికి ట్రైలర్ మొదట్లో, చివర్లో అసలు బిల్డింగ్‌పై నుండి దూకిన మనిషి ఎవరు అనేది మాత్రం ట్రైలర్‌లో రివీల్ చేయలేదు. మొత్తానికి చాలావరకు యూత్ కనెక్ట్ అయ్యే ఒక బోల్డ్ కథతో ఈ మూవీని బ్రిజేష్ తంగీ తెరకెక్కించాడని తెలుస్తోంది. ట్రైలర్ ఇంట్రెస్టింగ్‌గా సాగినా ఈ మూవీ మార్చి 7న థియేటర్లలో విడుదలకు సిద్ధమయ్యింది.