Vyjayanthi Movies: టాలీవుడ్‌లోని అత్యంత ప్రెస్టీజియస్, సీనియర్ అయిన నిర్మాణ సంస్థల్లో వైజయంతీ మూవీస్ కూడా ఒకటి. అలాంటి వైజయంతీ మూవీస్ ఎన్నో ఏళ్లుగా తెలుగులో ఎన్నో గుర్తుండిపోయే సినిమాలను నిర్మించింది. చాలావరకు ఈ నిర్మాణ సంస్థపై ఎలాంటి నెగిటివిటీ రాలేదు. ఇప్పటికే సక్సెస్‌ఫుల్‌గా తన లెగసీని కంటిన్యూ చేస్తోంది వైజయంతీ మూవీస్. అలాంటిది తాజాగా ఈ నిర్మాణ సంస్థలో పనిచేసే ఒక వ్యక్తిపై కేసు నమోదయ్యింది. అది ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఆ వ్యక్తి ఎవరు అనే విషయం పక్కన పెడితే.. పదేపదే ఈ కేసులో వైజయంతీ మూవీస్ పేరు వినిపిస్తోంది. దీంతో ఈ విషయంపై క్లారిటీ ఇవ్వడానికి ఈ నిర్మాణ సంస్థ ముందుకొచ్చింది.
ప్రొడక్షన్ మ్యానేజర్ అరెస్ట్
ఈరోజుల్లో ఆన్‌లైన్ బెట్టింగ్ అనేది చాలా కామన్‌గా జరుగుతోంది. అది క్రైమ్ అని తెలిసినా కూడా చాలామంది బెట్టింగ్‌కు బానిస అవుతున్నారు. అందులో ఒక వ్యక్తి నీలేశ్ చోప్రా. ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ కేసులో నీలేశ్ చోప్రాను ఎస్‌ఆర్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో తనపై ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యింది. అందులో నీలేశ్ చోప్రా అనే వ్యక్తి వైజయంతీ మూవీస్‌లో ప్రొడక్షన్ మ్యానేజర్‌గా పనిచేస్తున్నాడని పేర్కొన్నారు పోలీసులు. దీంతో ఈ ఎఫ్ఐఆర్ కాపీ ఇండస్ట్రీలో వైరల్ అయ్యింది. ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన వైజయంతీ మూవీస్‌లో పనిచేసే ప్రొడక్షన్ మ్యానేజర్‌ను ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారని అంతటా వైరల్ అవ్వడంతో దీనిపై వారు క్లారిటీ ఇచ్చారు.
ట్వీట్‌తో క్లారిటీ
‘ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో నీలేశ్ చోప్రా (Nilesh Chopra) అనే వ్యక్తిని ఎస్‌ఆర్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారని మా దృష్టికి వచ్చింది. కానీ ఆ వ్యక్తి వైజయంతీ మూవీస్‌తో కలిసి ఎప్పుడూ పని చేయలేదు. అంతే కాకుండా ఆ వ్యక్తితో మాకు ఎలాంటి సంబంధం లేదు. హైదరాబాద్ ఎస్‌ఆర్ పోలీసులతో కూడా ఈ విషయాన్ని అధికారికంగా చర్చించాం. ఏదైనా సమాచారాన్ని పబ్లిక్ చేసేముందే మీడియా కూడా నిజానిజాలను తెలుసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం’ అంటూ ట్విటర్‌లో ట్వీట్ చేసింది వైజయంతీ మూవీస్ (Vyjayanthi Movies). దీంతో ఇండస్ట్రీలో వైరల్ అవుతున్న వార్తలకు చెక్ పడింది. అసలు ఆ వ్యక్తి వైజయంతీ మూవీస్‌లో పనిచేయకుండానే దాని పేరును ఎందుకు ఉపయోగించుకున్నాడా అని ప్రేక్షకుల్లో అనుమానాలు మొదలయ్యాయి.
Also Read: తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం.. ఇక నుంచి ఆ రోజే అవార్డుల ప్రధానోత్సవం..!
రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు
జనవరి 31న ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న నీలేశ్ చోప్రాను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు పోలీసులు. ఆ తర్వాత తను తప్పు చేసిన విషయాన్ని తానే స్వయంగా ఒప్పుకున్నాడు నీలేశ్. తన సొంతూరు రాజస్థాన్ అయినా కూడా గత కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో సెటిల్ అయ్యాడు ఈ వ్యక్తి. తన దగ్గర నుండి ఆన్‌లైన్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న స్మార్ట్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అంతే కాకుండా రూ.1 లక్షకు పైగా డబ్బును కూడా స్వాధీనం చేసుకున్నారు. జనవరి 31న నీలేశ్ చోప్రాను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు తాజాగా తనపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు.