Writer Chinni Krishna.. గత కొన్ని రోజులుగా సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు అభిమానులను సడలించలేకపోతున్నాయి. ఒకరి తర్వాత ఒక్కరు అనారోగ్య బారిన పడడం, స్వర్గస్తులవడంతో అభిమానులు కంటతడి పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో సినీ రచయిత ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రముఖ టాలీవుడ్ రచయితగా గుర్తింపు తెచ్చుకున్న చిన్ని కృష్ణ (Chinni Krishna) వెంట విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి సుశీల (75) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఈ విషయంతో సినీ ఇండస్ట్రీ మూగబోయింది. పలువురు సినీ సెలబ్రిటీలు రచయిత తల్లి మరణానికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా ద్వారా తమ సంతాపం తెలియజేస్తున్నారు.
తల్లి మీద అమోఘమైన ప్రేమ.
చిన్ని కృష్ణకు తన తల్లి అంటే ఎంత ఇష్టమో ఇటీవలే మదర్స్ డే సందర్భంగా ఆయన పోస్టు అందుకు నిదర్శనమని చెప్పవచ్చు. తన తల్లి చేత కేక్ కట్ చేయించి చేసిన ఆ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాదు తన తల్లికి సంబంధించిన ఎన్నో విషయాలు అప్పుడప్పుడు అభిమానులతో కూడా పంచుకుంటూ ఉంటారు. ముఖ్యంగా తల్లి మీద ప్రేమతో కొన్ని పాటలు కూడా రాసినట్లు సమాచారం.
రచయిత చిన్ని కృష్ణ కెరియర్.
ప్రముఖ రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన చిరంజీవి (Chiranjeevi)తో ‘ఇంద్ర’, బాలకృష్ణ (Balakrishna) తో ‘నరసింహనాయుడు’, అల్లు అర్జున్(Allu Arjun) తో ‘గంగోత్రి’ వంటి చిత్రాలకు కథా రచయితగా పనిచేసి మంచి ఇమేజ్ సొంతం చేసుకున్నారు.
అల్లుఅర్జున్ అరెస్టుపై స్పందించిన చిన్నికృష్ణ..
ఇకపోతే సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ ని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే మధ్యంతర బెయిల్ వచ్చినా సరే ఆయన బెయిల్ పేపర్స్ సరిగ్గా లేవని చెప్పి, చంచల్గూడా జైల్లోనే రాత్రంతా ఉంచారు అధికారులు ఇక శనివారం ఉదయం 6:45 గంటలకు బెయిల్ మీద జైలు వెనుక గేటు నుంచి ఎస్కార్ట్ వచ్చి మరి ఇంటికి పంపించారు. అయితే అరెస్టు చేసిన నేపథ్యంలో బన్నీ ఆరోజు రాత్రంతా భోజనం చేయకుండా నేలపైనే పడుకున్నట్లు సమాచారం. దీంతో బన్నీ అరెస్టుపై చాలామంది సెలబ్రిటీలు స్పందించారు. అరెస్టును తప్పుపట్టారు కూడా. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ అరెస్టుపై చిన్ని కృష్ణ కూడా కాస్త ఘాటుగానే స్పందించారు. అల్లు అర్జున్ తో ‘గంగోత్రి’, ‘బద్రీనాథ్’ సినిమాలకు రచయితగా పనిచేసిన ఈయన మాట్లాడుతూ.. బన్నీని అరెస్టు చేయడం చాలా దారుణం. నిన్నటి నుంచి అల్లు అర్జున్ కోసం తినకుండా ఉన్నాను. టికెట్ ధర పెంపు అన్నది ఒక్క సినిమాకి మాత్రమే ఇవ్వలేదు కదా అరెస్టు వెనుక ఉన్నవారు సర్వనాశనం అవుతారు. తర్వాత ఆ పరిణామాలు మీరే చూస్తారు” అంటూ చాలా ఘాటుగా స్పందించడం చర్చనీయాంశంగా మారింది. ఇక ఈయన దర్శకుడిగా కూడా సినిమాలు చేశారు. కానీ వర్క్ అవుట్ కాలేదు.