South Korea : అత్యాధునిక యుద్ధ విమానాలు.. భీకర గర్దనలు చేస్తూ గగనతలంలో దూసుకుపోతున్నాయి. ఉన్నట్టుండి.. అవి బాంబులు జారవిడిచాయి.. నేరుగా అవి జనావాసాలపై పడడంతో.. అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటన దక్షిణ కొరియాలోని సరిహద్దు ప్రాంతంలో చోటుచేసుకుంది. దాంతో.. ఉత్తర కొరియా సైన్యం యుద్ధానికి వస్తుందని భయంతో గడగడలాడారు. కానీ.. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే.. బాంబులు జారవిడిచింది దక్షిణ కొరియా సైన్యమే అని తెలిసి మరింత షాక్ కు గురయ్యారు.
ఉత్తర కొరియా-దక్షిణ కొరియా సైన్యాల మధ్య నిత్యం యుద్ధ వాతావరణమే ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో దక్షిణ కొరియా KF-16 ఫైటర్ జెట్లు.. ఉత్తర కొరియా సరిహద్దుకు సమీపంలో ఉన్న పోచియాన్ నగరంలో పెద్ద ఎత్తున యుద్ధ విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే మార్చి 6న గురువారం రోజున పొరబాటున ఆ విమానాలు.. పౌర ప్రాంతంలో బాంబులు జారవిడిచాయి. దాంతో.. ఈ ప్రాంతంలో తీవ్ర ఆందోళనకర వాతావరణం ఏర్పడింది.
ఈ ఘటన “ఫ్రీడమ్ షీల్డ్” అనే పేరుతో దక్షిణ కొరియా-అమెరికా సైన్యాలు సంయుక్తంగా చేపట్టిన శిక్షణలో భాగంగా చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమం పెద్దస్థాయి యుద్ధ అభ్యాసమని.. అందులో గాలిలో, నేలపై అనేక యుద్ధ అభ్యాసాల్ని ప్రాక్టీస్ చేసినట్లుగా సైన్యం వెల్లడించింది. ఈ ప్రమాద సమయంలో జెట్ 8 MK-82 బాంబులను ఫైటర్ జెట్లు విడుదల చేశాయి. ఇవి సాధారణంగా మిలటరీ ఆపరేషన్ల కోసం ఉపయోగిస్తారు.. వాస్తవానికి వీటిని ఉత్తర కొరియా సరిహద్దులో జారవిడవాల్సి ఉంది. కానీ ఇవి దారితప్పి.. పౌర ప్రాంతంలో పడిపోయినట్లు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ఎనిమిది మందికి గాయాలు కాగా.. ఆస్తి నష్టం సంభవించింది.
బాధితుల్లో ఆరుగురు పౌరులు, ఇద్దరు సైనికులు గాయపడ్డారని స్థానిక మీడియా వెల్లడించింది. గాయపడిన వారిలో థాయిలాండ్, మయన్మార్ దేశాలకు చెందిన ఇద్దరు పౌరులు కూడా ఉన్నారు. కొన్ని ఇళ్లు, ఒక కాథలిక్ చర్చ్ దెబ్బతిన్నాయి. అదృష్టవశాత్తు.. ఈ ప్రమాదంలో మరిన్ని మరణాలు సంభవించలేదని అధికారులు వెల్లడించారు. కానీ.. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో నివసించే ప్రజలు తీవ్ర ఆందోళన, ఒత్తిడికి గురవుతున్నారని చెబుతున్నారు.
దక్షిణ కొరియా వైమానిక దళం స్పందన
ఈ ఘటనపై స్పందించిన దక్షిణ కొరియా వైమానిక దళం.. ఈ ఘటన శిక్షణ సమయంలో అనుకోకుండా జరిగిన ప్రమాదంగా తెలిపారు. గాయపడిన ప్రజలకు క్షమాపణలు తెలిపిన సైన్యం.. ఈ ప్రమాదానికి కారణాల్ని అన్వేషించేందుకు వైమానిక దళం ఓ కమిటీని ఏర్పాటు చేసి, విచారణ చేస్తున్నట్లుగా తెలిపింది. ఈ ఘటనలో ఇబ్బంది పడిన బాధితులకు సాయం చేస్తామని, ఆస్తుల విధ్వంసానికి పరిహారం చెల్లిస్తామని సైన్యం ప్రకటించింది.
గతంలోనూ ప్రమాదాలు
దక్షిణ కొరియాలో చోటుచేసుకున్న ప్రమాదం ఇదే మొదటిది కాదు.. గతంలోనూ ఇలాంటి కొన్ని ప్రమాదాలు అక్కడ జరిగాయి. 2015లో కూడా దక్షిణ కొరియా ఫైటర్ జెట్ అనుకోకుండా బాంబులను జారవిడిచింది. ఈ బాంబులు.. నివాసేతర ప్రాంతానికి దూరంగా పడడంతో ఎలాంటి నష్టం చోటుచేసుకోలేదు. కానీ ఆ ఘటన సైన్యం చేపట్టాల్సిన సురక్షిత చర్యల గురించిన చర్యల్ని లేవనెత్తింది. ఇలాంటి ప్రమాదాల్ని నివారించేందుకు, పునరావృతం కాకుండా చూసుకునేందుకు దక్షిణ కొరియా వైమానిక దళం చేపట్టాల్సిన కట్టుదిట్టం చర్యల గురించి ప్రస్తావనను తీసుకువస్తోంది.
Also Read : కశ్మీర్ సమస్య కోసం ట్రంప్ సాయం తీసుకుంటారా?.. జైశంకర్ అదిరిపోయే ఆన్సర్