Jai Shankar Kashmir Trump| ప్రపంచవ్యాప్తంగా శాంతిని నెలకొల్పాలనే లక్ష్యంతో అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ఉక్రెయిన్, గాజా సంక్షోభాలకు పరిష్కారం కనుగొనేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే, ట్రంప్ సహాయంతో భారతదేశం, పాకిస్తాన్ మధ్య దశాబ్దాలుగా ఉన్న సున్నితమైన కశ్మీర్ సమస్యను పరిష్కరించుకోవచ్చు కదా! అనే ప్రశ్న భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్‌కు ఎదురైంది. ఆయన ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్నారు. అక్కడ మీడియా ప్రతినిధులే ఈ ప్రశ్నను ఆయనపై సంధించారు.
లండన్‌లోని చాథమ్ హౌస్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో భాగంగా.. కశ్మీర్ సమస్య పరిష్కారం కోసం ట్రంప్ మధ్యవర్తిత్వం వహించమని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరుతారా? అని మీడియా ప్రతినిధులు జైశంకర్‌ను అడిగారు. దీనికి జవాబుగా.. కశ్మీర్ సమస్య పరిష్కారంలో భారతదేశం ఇప్పటివరకు స్వతంత్రంగానే వ్యవహరించిందని.. ఇకపై ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని స్పష్టం చేశారు.
జైశంకర్ తన స్టైల్ లో మాట్లాడుతూ.. “కశ్మీర్ సమస్య పరిష్కారం దిశగా భారతదేశం ఇప్పటివరకు ఒంటరిగానే ప్రయత్నాలు చేసింది. మంచి అడుగులు వేసింది. మొదటి అడుగుగా ఆర్టికల్ 370ను రద్దు చేయడం జరిగింది. కశ్మీర్‌లో అభివృద్ధి, ఆర్థిక పురోగతి, సామాజిక న్యాయం కోసం చర్యలు తీసుకోవడం రెండో అడుగు. అత్యధిక ఓటింగ్ శాతంతో ఎన్నికలు నిర్వహించడం మూడో అడుగు. అయితే.. ఇంకా పరిష్కారం కావాల్సిన అంశం ఉంది. అదే పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK). దానిని తిరిగి స్వాధీనం చేసుకోవడం మాత్రమే మిగిలి ఉంది. అది పూర్తయితే, కశ్మీర్ సమస్య పరిష్కారం అయినట్లే. దీనికి నేను మీకు హామీ ఇస్తున్నాను,” అని ఆయన తెలిపారు.
Also Read: అమెరికాకు కరెంటు కోతలు.. స్టార్ లింక్ డీల్ రద్దు చేసిన కెనెడా
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK) భారతదేశంలోని భాగమేనని.. అది 1947 నుంచి పాకిస్థాన్ ఆక్రమణలో ఉందని జైశంకర్ పలుమార్లు స్పష్టం చేస్తున్నారు. ఈ విషయంలో.. గత ఏడాది పాకిస్థాన్ ప్రభుత్వం ఇస్లామాబాద్ హైకోర్టులో PoKను విదేశీ భూభాగంగా అంగీకరించింది. ఒక జర్నలిస్ట్ కిడ్నాప్ కేసులో.. పాకిస్థాన్ అదనపు అటార్నీ జనరల్.. PoK విదేశీ భూభాగమని, అక్కడ పాకిస్థాన్ చట్టాలు చెల్లవని తెలిపారు. ఈ ప్రకటన భారతదేశం వాదనని మరింత బలపరిచింది.
జైశంకర్ కారు వద్దకు దూసుకొచ్చిన ఖలిస్తానీ
భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ లండన్ పర్యటనలో భద్రతా వైఫల్యం సంభవించింది. ఖలిస్థానీ మద్దతుదారులు ఆయన పర్యటనకు అంతరాయం కలిగించారు. ఛాఠమ్ హౌస్‌లో సమావేశాలు ముగించిన తర్వాత, జైశంకర్ బయటకు వచ్చేసరికి ఖలిస్థానీ అనుకూల వ్యక్తులు నిరసన వ్యక్తం చేశారు. వారిలో ఒకరు జైశంకర్ కారు వద్దకు దూసుకొచ్చారు. అతను భారత జాతీయ జెండాను అవమానించేలా ప్రవర్తించి నినాదాలు చేశాడు. లండన్ పోలీసులు వెంటనే అతన్ని అరెస్ట్ చేసి, ఇతర నిరసనకారులను తరిమికొట్టారు. ఈ సంఘటన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
జైశంకర్ మార్చి 4న యూకే పర్యటనకు వెళ్లి, మార్చి 9 వరకు అక్కడే ఉన్నారు. ఈ సందర్భంగా బ్రిటన్ విదేశాంగ మంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. వ్యూహాత్మక సహకారం, వాణిజ్యం, విద్య, సాంకేతికత మరియు రాజకీయ రంగాల్లో పరస్పర సహకారం గురించి చర్చించారు. అదనంగా, ‘ప్రపంచంలో భారతదేశ వృద్ధి.. పాత్ర’ అనే అంశంపై ప్రసంగించారు.