Turkiye Airport Indians| తుర్కియేలోని ఓ మారుమూల ప్రదేశంలో ఉన్న దియార్ బకీర్ ఎయిర్ పోర్ట్‌లో ఒక విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ కారణంగా అందులోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. 40 గంటలకు పైగా 300 మందికి పైగా ప్రయాణికులు విమానాశ్రయంలోనే చిక్కుకుపోయారు. వారి అక్కడ సరైన భోజనం లేదు, అంతమందికి టాయిలెట్ కూడా ఒకటే ఉండడంతో పాటు తీవ్ర చలి వాతావరణం కారణంగా పరిస్థితి నరకంగా మారింది. మారుమూల ప్రాంతంలో ఉన్నందున సౌకర్యాలు అరకొరగా ఉన్నాయి.
వివరాల ప్రకారం.. ఏప్రిల్ 2న లండన్ నుంచి ముంబైకి బయలుదేరిన వర్జిన్ అట్లాంటిక్ విమానం తుర్కియేలోని దియార్‌బాకిర్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసింది. విమానం గాల్లో ఉండగా.. ఒక ప్రయాణికుడు తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతుండటంతో వైద్య చికిత్స కోసం ఈ ల్యాండింగ్ జరిగింది. అయితే ల్యాండింగ్ సమయంలో విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి, దీంతో విమానం అక్కడే నిలిచిపోయింది. విమానం పూర్తిగా రిపేర్ అయ్యేంతవరకు ప్రయాణికులు అక్కడే ఉండాల్సిన పరిస్థితి.
Also Read: ఆ దేశం కాజేయాలని దొంగ స్వామిజీ ప్లాన్.. భూ కబ్జా చేయబోయి 20 మంది భక్తులు అరెస్ట్
తాజాగా, విమానం ల్యాండింగ్ అయి 40 గంటలకు పైగా గడిచి పోయాయి. అప్పటి నుంచి ప్రయాణికులు ఎయిర్‌పోర్టులోనే బిక్కు బిక్కు మంటున్నారు. విమానయాన సంస్థ ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం, వసతి సౌకర్యం కల్పించకపోవడం వంటి అంశాలపై ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. మారుమూల ప్రాంతంలో చిమ్మచీకటి వాతావరణం, ఒకటే టాయిలెట్ వంటి సమస్యలు కూడా ఉన్నాయని వారు తెలిపారు. తక్కువ ఉష్ణోగ్రతలతో జ్వరంతో బాధపడుతున్న ప్రయాణీకులకు బ్లాంకెట్స్ కూడా అందించకపోవడం పై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యలపై ఇండియాలోని వారి బంధువులు సోషల్ మీడియా వేదికగా విమానయాన సంస్థను తప్పుపడుతున్నారు.
ఒక ప్రయాణికుడి బంధువు ఈ మేరకు సోషల్ మీడయాలో ఒక పోస్ట్ చేశారు. “నా కుటుంబంతో పాటు 250 మందికి పైగా ప్రయాణికులు ఆ ఎయిర్ పోర్ట్ లో దీనమైన పరిస్థితిలో ఉన్నారు. వర్జిన్ అట్లాంక్ సంస్థ అమానవీయంగా వ్యవహరించింది. ఈ సమస్య గురించి బిబిసి లాంటి ప్రధాన మీడియా ఎందుకు చూపించట్లేదు” అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఎక్స్ లో ఒక పోస్ట్ చేశాడు.
వర్జిన్ అట్లాంటిక్ విమాన సంస్థ స్పందిస్తూ, ప్రయాణీకుల కోసం తాత్కాలికంగా స్థానిక హోటల్‌లో బస ఏర్పాట్లు చేస్తున్నామని, త్వరగా సమస్యను పరిష్కరిస్తామని తెలిపింది. ఆ ప్రాంతంలో ప్రయాణికులు బహిరంగంగా తిరిగేందుకు అనుమతులు లేవని.. తాము ప్రయత్నిస్తున్నామని.. ఒకవేళ అనుమతులు రాకపోతే.. బస్సు మార్గంలో సమీపంలోని మరో విమానశ్రయానికి తరలించి అక్కడి నుంచి మరో విమానం ద్వారా ముంబైకి చేరుస్తామని వెల్లడించింది.
తుర్కియే రాజధాని అంకారాలో ఉన్న భారత ఎంబసీ అధికారులు కూడా ఈ సమస్యపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.