Nityananda Bolivida Kailasa | పిల్లల కిడ్నాపింగ్, లైంగిక వేధింపులు తదితర తీవ్ర నేరా రోపణల కేసుల్లో చిక్కుకొని, భారత దేశం నుంచి పరారైన నిత్యానంద స్వామి (Nithyananda) ఎక్కడో కైలాస అనే కొత్త దేశాన్ని సృష్టించి.. అక్కడే అజ్ఞాతంలో నివసిస్తున్నట్లు అప్పుడప్పడు వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా నిత్యానంద కన్ను దక్షిణ అమెరికా దేశమైన బొలీవియాపై పడినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఆ దేశంలో భూ ఆక్రమణకు (Land Grabbing) ప్రయత్నించిన నిత్యానంద సన్నిహితులు.. స్థానిక తెగలతో భూమి లీజుకు సంబంధించి ఒప్పందాలు చేసుకున్నట్లు తేలింది. ఈ విషయం బహిర్గతం కావడంతో ‘కైలాస’తో సంబంధమున్న 20 మందిని అరెస్టు చేసిన అక్కడి అధికారులు వారి సొంత దేశాలకు పంపించివేశారు.
కైలాసతో సంబంధమున్న కొందరు వ్యక్తులు ఇటీవల బొలీవియాలో పర్యటించారు. ఈ క్రమంలో కార్చిచ్చును ఎదుర్కోవడంలో స్థానిక ప్రజలకు సాయపడిన వీరు.. ఏకంగా అక్కడి భూమిపై కన్నేశారు. వాటి లీజు కోసం స్థానిక తెగలతో ఒప్పందాలు కూడా చేసుకున్నారు. అధ్యక్షుడు లూయిస్ ఆర్స్‌తోనూ కైలాస ప్రతినిధులు ఫొటోలు దిగారు. చివరకు 2లక్షల డాలర్లు చెల్లిస్తే.. ఓ ప్రాంతాన్ని (ఢిల్లీకి దాదాపు మూడింతల ప్రదేశాన్ని) 25 ఏళ్లపాటు లీజుకు ఇచ్చేందుకు స్థానిక తెగ ప్రతినిధి అంగీకరించారు. అయితే, కైలాస ప్రతినిధులు మాత్రం వెయ్యి సంవత్సరాల లీజుతో పాటు అక్కడ గగనతల వినియోగం, సహజవనరుల తవ్వకం వంటి అంశాలను వారి ముందు ప్రతిపాదించారు.
Also Read: వెబ్ సిరీస్ చూసి బ్యాంకులో చోరీ.. 17 కిలోల బంగారం కోసం అదిరిపోయే ప్లాన్
వీటికి సంబంధించి బొలీవియా వార్త పత్రిక పరిశోధనాత్మక కథనం ప్రచురించడం స్థానికంగా సంచలనంగా మారింది. అప్రమత్తమైన ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. కైలాసతో సంబంధమున్న 20 మంది ఈ వ్యవహారంలో అరెస్టు అయ్యారు. స్థానికులతో వారు చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసింది. సంబంధిత వ్యక్తులను ఆయా దేశాలకు (భారత్, చైనా, అమెరికా) పంపించింది. వీరు పర్యటకులుగా అనేకసార్లు బొలీవియాలోకి ప్రవేశించారని.. ఈ క్రమంలోనే స్థానికులతో ఒప్పందాలు చేసుకున్నారని ఇమిగ్రేషన్ అధికారులు పేర్కొన్నారు. గత నవంబర్ నుంచి కొంతమంది అక్కడే ఉండిపోయారని గుర్తించామన్నారు. ఈ వ్యవహారంపై బొలివియా విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ఓ అంతర్జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. వివాదాస్పద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాసతో ఎటువంటి దౌత్య సంబంధాలు కొనసాగించడం లేదని స్పష్టం చేశారు.
ఇదిలాఉంటే.. భారత దేశం నుంచి పారిపోయిన నిత్యానంద.. ‘కైలాస’ అనే ప్రాంతంలో ఆశ్రమాన్ని స్థాపించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, కైలాస అనే ప్రదేశం ఎక్కడ ఉందన్న దానిపై ఎన్నో ఊహాగానాలు వెలువడ్డాయి. ఈక్వెడార్ దేశానికి సమీపంలో ఓ చిన్న దీవిని కొనుగోలు చేసి.. దానికి కైలాసం అని పేరు పెట్టినట్లు నిత్యానంద గతంలో పేర్కొన్నాడు. తమిళనాడు పోలీసులు కూడా .. ఇటీవల ఓ కేసుకు సంబంధించి హై కోర్టులో విచారణ సందర్బంగా నిందితుడు నిత్యానంద ఈక్వెడార్ దేశంలో ఉన్నట్లు తెలిపారు.