Arabs Reject Trump Gaza| అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదనను అరబ్ దేశాలు తిరస్కరించాయి. ఇజ్రాయెల్ వైమానిక దాడులతో పాలస్తీనాలోని గాజా భారీ నాశనానికి గురైంది. ప్రజలు నివసించడానికి అనుకూలమైన పరిస్థితులు లేని స్థితిలో, ట్రంప్ పాలస్తీనీయులకు ఈజిప్టు, జోర్డాన్‌లలో పునరావాసం కల్పించాలని ప్రతిపాదించారు. కానీ ఈ ప్రతిపాదనను ఈజిప్టు, జోర్డాన్, యూఏఈ, ఖతార్, పాలస్తీనా అధికారులు, సౌదీ అరేబియా, అరబ్ లీగ్ సంయుక్తంగా తిరస్కరించాయి.
‘‘పాలస్తీనీయుల పునరావాసం కోసం ఈ ప్రణాళికను మేం అంగీకరించలేం. ఇది ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీసి, సంఘర్షణను మరింత విస్తరించే ప్రమాదం ఉంది. ప్రజలు శాంతియుతంగా జీవించడం కష్టమవుతుంది’’ అని అరబ్బు దేశాలన్నీ సంయుక్తంగా శనివారం ఒక ప్రకటన జారీ చేశాయి.
కొన్ని రోజుల క్రితం గాజాలోని పాలస్తీనా వాసుల నివాసాల గురించి మాట్లాడుతూ.. ‘‘గాజా ఇప్పుడు శిథిలాల కుప్పగా మారింది. ఆ స్థాలం నివాస యోగ్యంగా లేదు. మౌలిక వసతులు కూడా లేవు. దాన్ని పునర్నిమించాలి. ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. వారికి ఆశ్రయం కల్పించడానికి అరబ్ దేశాలతో కలిసి కొత్త ప్రాంతంలో ఇళ్లను నిర్మించాలని భావిస్తున్నాను. ఈ పునరావాసం తాత్కాలికంగా లేదా దీర్ఘకాలికంగా కొనసాగవచ్చు’’ అని వ్యాఖ్యానించారు.
మరోవైపు, గాజా కాల్పుల విరమణ ఒప్పందం కింద హమాస్ మరో ఇద్దరు బందీలను విడుదల చేసింది. యార్డెన్ బిబాస్ (35), ఫ్రెంచ్-ఇజ్రాయెలీ ఓఫర్ కల్డెరోన్ (54) అనే ఇద్దరిని శుక్రవారం విడుదల చేసినట్లు తెలిసింది. కీత్ సీగెల్ (65) అనే మరో అమెరికన్-ఇజ్రాయెలీ వ్యక్తిని కూడా విడుదల చేయడానికి హమాస్ సిద్ధంగా ఉంది. 2023 అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై దాడి సమయంలో హమాస్ ఈ పౌరులను బంధించింది.
Also Read: వంద శాతం సుంకాలు.. ఇండియా సహా బ్రిక్స్ దేశాలకు ట్రంప్ వార్నింగ్..
అంతకుముందు రోజు 8 మంది బందీలను గురువారం హమాస్ విడుదల చేయగా, ఇజ్రాయెల్ 110 మంది పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టింది. విడుదలైన బందీలను హమాస్ సాయుధులు ఖాన్ యూనిస్ పట్టణంలోని హమాస్ ముఖ్యనేత యాహ్యా సిన్వర్ ఇంటి సమీపంలో రెడ్‌క్రాస్ ప్రతినిధులకు అప్పగించారు. ఈ సమయంలో వేలాది పాలస్తీనియన్లు సమీపించి, బందీలను తిట్టడం మరియు ఎగతాళిగా మాట్లాడడం వంటి సంఘటనలు జరిగాయి.
మహిళా బందీ ఆర్బెల్ యేహూద్ భయంతో నడిచిన దృశ్యాలు మీడియాలో ప్రసారమయ్యాయి. ఈ సంఘటనల తర్వాత, ఇజ్రాయెల్ ఖైదీలను విడుదల చేయడం ఆపివేసింది. హమాస్ నుంచి విడుదలైన బందీలు క్షేమంగా చేరుకున్నాకే ఖైదీలను వదిలేస్తామని ఇజ్రాయెల్ స్పష్టంచేసింది. తరువాత ఇరువైపులా బందీల విడుదల, అప్పగింత సజావుగా కొనసాగింది.
42 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం కింద హమాస్ తన చెరలో ఉన్న 94 మంది బందీల్లో 33 మందిని విడుదల చేయనుంది. ప్రతిగా ఇజ్రాయెల్ దాదాపు 1700 మంది పాలస్తీనీయులను జైళ్ల నుంచి విడుదల చేయనుంది. హమాస్ వద్ద ఉన్న బందీలలో ఎనిమిది మంది మరణించినట్లు ఇజ్రాయెల్ పేర్కొంది.