Bangladesh Interim Govt: బంగ్లాదేశ్ ఫ్యూచర్ భవిష్యత్తు ఏంటి? అల్లర్లు తగ్గుముఖం పట్టాయా? ఆర్మీ అధికారుల దౌత్యం ఎంతవరకు ఫలించింది? అధికార పగ్గాలు అందుకునేందుకు ఎవరు ముందుకొస్తు న్నారు? తొలుత తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా? దానికి నాయకత్వం వహించేదెవరు? నోబెల్ అవార్డు గ్రహీత మమ్మహద్ యూనస్ కీలక బాధ్యతలు చేపడతారా? ఇవే ప్రశ్నలు అక్కడి ప్రజలను వెంటాడుతున్నాయి.
ప్రజల తిరుగుబాటుతో ప్రధాని షేక్ హసీనా దేశం విడిచిపెట్టారు. కొత్తగా ప్రభుత్వం బాధ్యతలు తీసుకునే వరకు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఆర్మీ అధికారులు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని విద్యార్థి ఉద్యమ నేతలను అధికారులు కోరారు. దీనిపై సంప్రదింపులు జరుగుతున్నాయి.
మంగళవారం సాయంత్రంలోగా మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని చెబుతున్నారు. వీలు కుదర కుంటే గురువారం నాటికి ప్రభుత్వం ఏర్పాటు అయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇదిలావుండగా మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నోబెల్ అవార్డు గ్రహీత మహమ్మద్ యూనస్ పిలుపు నిచ్చారు.
ALSO READ: యూకే రెడ్ సిగ్నల్? అప్పటి వరకు భారత్‌లోనే షేక్ హసీనా? గతంలోనూ ఇది పరిస్థితి!
ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన నహిద్ ఇస్లాం.. ఇప్పటికే యూనస్‌తో చర్చలు జరిపారు. మరోవైపు ఆ దేశ అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్ రంగంలోకి దిగారు. ప్రతిపక్ష రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జైలులో ఉన్న బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ చీఫ్ ఖలీదా జియాను విడుదల చేయాలని పార్టీలు ఏకగ్రీవంగా నిర్ణయించాయి.
అవినీతి కేసులో అరెస్టుయిన జైలులో ఉన్న 78 ఏళ్ల ఖలీదా జియా ఆరోగ్యం క్షీణించింది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిరసనల్లో అరెస్టయిన వారిని విడుదల చేయాలని నిర్ణయించారు ఆదేశ అధ్యక్షుడు.
మంగళవారం నుంచి కర్ఫ్యూ ఎత్తి వేయాలని అధికారులు నిర్ణయించారు. కార్యాలయాలు, విద్యా సంస్థలు తిరిగి ఓపెన్ కావాలని భావించారు. అయితే కొన్ని ప్రాంతాల్లో హింస కొనసాగింది. మంగళవారం సాయంత్రానికి సమస్య చక్కబడుతుందని భావిస్తున్నారు. మధ్యంతర ప్రభుత్వంలో ఎన్నికల జరిపాలని భావిస్తున్నారు ఆ దేశ అధ్యక్షుడు. దీనిపై రేపోమాపో ఓ క్లారిటీ రానుంది.