Rail Hijack: పాకిస్తాన్ బోలాన్‌లో హైజాక్ చేయబడిన రైలు నుంచి ప్రయాణికులను రక్షించడానికి పాకిస్తాన్ భద్రతా దళాలు ఇప్పటికీ ఇంకా సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ భద్రతా దళాలు 190 మంది ప్రయాణికులను రక్షించామని చెబుతుండగా, బలూచ్ తిరుగుబాటుదారులు మహిళలు, పిల్లలు, వృద్ధులను విడుదల చేసినట్లు అన్నారు. ఇదే సమయంలో రైలు నుంచి హైజాక్ చేసిన వారిలో తాజాగా 50 మంది బంధీలను హతమర్చినట్లు బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) ఉగ్రవాదులు ప్రకటించారు.
రైలును హైజాక్ చేసిన తర్వాత BLA 48 గంటల అల్టిమేటం జారీ చేసింది. వారి డిమాండ్లను నెరవేర్చకపోతే, బందీలను చంపుతామని హెచ్చరించింది. పాకిస్తాన్ సైన్యం కిడ్నాప్ చేసిన బలూచ్ రాజకీయ ఖైదీలు, కార్యకర్తలు, తప్పిపోయిన వ్యక్తులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పాకిస్తాన్ సైనిక చర్య తీసుకుంటే, బందీలందరూ చంపబడతారని హెచ్చరించారు. అయితే ఇప్పటికే ప్రకటన చేసి 20 గంటలైన నేపథ్యంలో ప్రస్తుతం పాకిస్తాన్ సైన్యం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గతంలో ఈ అల్టిమేటం తిరస్కరించబడిన నేపథ్యంలో పాక్ ప్రభుత్వం నుంచి ప్రస్తుతం ఎలాంటి స్పందన రాలేదు.
మరోవైపు పాకిస్తాన్ కూడా 30 మంది బలూచ్ తిరుగుబాటుదారులను చంపినట్లు ప్రకటించింది. సంఘటన స్థలంలో ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయని చెబుతున్నారు. రెస్క్యూ ఆపరేషన్ సమయంలో 37 మంది ప్రయాణికులు గాయపడ్డారని, వారికి వైద్య చికిత్స అందించామని భద్రతా వర్గాలు తెలిపాయి. బీఎల్ఏ ఉగ్రవాదులు అనేక చిన్న బృందాలుగా విడిపోయారని, ఈ కారణంగా వారిని పట్టకోవడంలో ఇబ్బందులు తలెత్తుతున్నట్లు చెబుతున్నారు.
మంగళవారం పాకిస్తాన్‌లో బలూచిస్తాన్ స్వాతంత్ర్యం కోరుతూ BLAతో అనుబంధ వేర్పాటువాదులు జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును హైజాక్ చేశారు. ఈ రైలు క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న క్రమంలో జరిగింది. మంగళవారం మధ్యాహ్నం బోలాన్ ప్రాంతంలోని కొండ ప్రాంతాల సమీపంలో ఈ దాడి జరిగింది. మొదట ఉగ్రవాదులు రైల్వే ట్రాక్ ను పేల్చివేసి, జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలుపై కాల్పులు జరిపారు. కాల్పుల తర్వాత ఉగ్రవాదులు భద్రతా సిబ్బందిని ఎదుర్కొంటూ రైలును అడ్డగించారు. కాల్పుల్లో రైలు డ్రైవర్ గాయపడ్డాడు.
బలూచ్ ఉగ్రవాదుల ప్యాసింజర్ రైలుపై దాడి చేసిన తర్వాత రక్షించబడిన ప్రయాణికులలో ముష్తాక్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. అయితే దాడి ప్రారంభంలో ‘పెద్ద పేలుడు’ జరిగిందని ముష్తాక్ అన్నారు. ఆ తరువాత కాల్పులు ప్రారంభమయ్యాయని, అవి ఒక గంట పాటు కొనసాగాయని, ఈ దాడిని మరిచిపోలేనని ఆయన వెల్లడించారు.