Rajinikanth: సినీ పరిశ్రమలో మోసాలు అనేవి చాలా కామన్. ఎవరైనా కొత్తగా యాక్టర్స్, డైరెక్టర్స్ అవ్వాలని వస్తే వారిని మోసం చేసి పలు రకాలుగా దోచుకునేవారు ఉన్నారు. అలాగే క్యాస్టింగ్ కౌచ్ అనేది కూడా ఏర్పడింది. అలా ఎంతోమంది నటీనటులు మోసపోయారు. తాజాగా ఒక సీనియర్ నటి కూడా ఇలాంటి ఒక చేదు అనుభవం గురించి బయటపెట్టింది. తనకు ఏకంగా రజినీకాంత్ భార్య పాత్ర చేసే ఛాన్స్ ఇప్పిస్తానని చెప్పి మోసం చేశారంటూ రివీల్ చేసింది. సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా అంటే, అందులోనూ ఆయన భార్య పాత్ర అంటే ఏ నటి మాత్రం ఒప్పుకోకుండా ఉంటుంది.? అలా ఒప్పుకోవడం వల్ల తాను ఎలా మోసపోయారో వివరించారు ఈ సీనియర్ నటి.
డబ్బులు అడిగారు
మలయాళంలో తల్లి పాత్రలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న నటీమణుల్లో షైనీ సారా కూడా ఒకరు. ఆమె ‘మహేశింటే ప్రతీకారం’ అనే సినిమాతో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. అలా మలయాళంలో ఎన్నో సినిమాల్లో కూడా నటించింది. తాజాగా తను ఒక క్యాస్టింగ్ కాల్ ఫ్రాడ్‌లో ఇరుక్కుపోయానని బయటపెట్టింది. రూ.12,500 విలువ గల ఆర్టిస్ట్ కార్డ్‌ను కొనుగోలు చేస్తే తనకు ఒక తమిళ సినిమాలో రజినీకాంత్ భార్య పాత్రలో నటించే ఛాన్స్ ఇప్పిస్తానని తనను కొందరు సంప్రదించారని సోషల్ మీడియా ద్వారా బయటపెట్టింది. మరొక నటి అయిన మాల పార్వతి సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని బయటపెట్టింది షైనీ సారా.
ఆర్టిస్ట్ కార్డ్
‘‘ఒకరోజు ఒక క్యాస్టింగ్ ఏజెన్సీ ద్వారా నేను ఇచ్చిన అప్లికేషన్ ఓకే అయ్యిందని నాకొక వాట్సాప్ నెంబర్ ద్వారా మెసేజ్ వచ్చింది. వాళ్లు జైలర్ 2లో రజినీకాంత్ భార్య పాత్రలో నటించడానికి నటీమణులను వెతుకుతున్నామని నాకు చెప్పారు. ఆ తర్వాత నా దగ్గర ఆర్టిస్ట్ కార్డ్ ఉందా అని అడిగారు. మాలీవుడ్ అలాంటి కార్డ్స్ ఏమీ ఉండవని నేను వారితో చెప్పాను. అయితే నాకు ఆ కార్డ్ అరేంజ్ చేస్తానని వాళ్లు చెప్పారు. ఆ తర్వాత సురేశ్ కుమార్ అనే వ్యక్తి నుండి నాకు కాల్ వస్తుందని చెప్పి ఫోన్ పెట్టేశారు. వాళ్లు చెప్పినట్టుగానే నాకు రెండు రోజుల తర్వాత కాల్ వచ్చింది. చీర కట్టుకొని వీడియో కాల్ ఇంటర్వ్యూ కోసం సిద్ధంగా ఉండమని అన్నారు’’ అని జరిగిందంతా వివరించింది షైనీ సారా (Shiny Sarah).
Also Read: మోసం చేసి పెళ్లి చేసుకుంది, అందుకే విడాకుల కోసం అలా.. నటిపై భర్త ఆరోపణలు
అనుమానం కలిగింది
‘‘సురేశ్ కుమార్ నన్ను ఇంటర్వ్యూ చేసి నేను రజినీకాంత్ (Rajinikanth) భార్య పాత్రకు సెలక్ట్ అయ్యానని చెప్పాడు. జైలర్ 2లో రమ్యకృష్ణ ఆల్రెడీ రజినీకాంత్‌కు భార్య పాత్రలో నటిస్తుంది కదా అని నేను కన్ఫ్యూజ్ అయ్యాను. అదే విషయాన్ని ఆయనను అడగగా.. వేరే సినిమా కోసం నన్ను తీసుకుంటున్నారని చెప్పారు. ఆర్టిస్ట్ కార్డ్ అప్లికేషన్‌ను నాకు మెయిల్ చేస్తానని చెప్పి నా వివరాలు అడిగారు. ఆపై నన్ను డబ్బులు అడిగారు. అవి అరేంజ్ చేయడానికి రెండు రోజులు సమయం పడుతుందని చెప్పినా వినలేదు. అప్పుడే నాకు అనుమానం కలిగింది. చాలామంది ఈ ఫ్రాడ్‌కు బాధితులు అయ్యారు. అందరూ జాగ్రత్తగా ఉండాలి’’ అంటూ ఈ విషయాన్ని ప్రేక్షకులతో పంచుకుంది షైనీ సారా.