Bluesky Jack Dorsey | ట్విట్టర్ ఎక్స్ కు పోటీగా కొత్త ప్లాట్ ఫామ్ వచ్చింది. వచ్చీ రాగానే లక్షల కోట్ల మంది నెటిజెన్లను ఆకర్షిస్తూ దూసుకుపోతోంది. ఈ కొత్త సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ పేరు బ్లూ స్కై. ఈ ప్లాట్ ఫామ్ లోని చాలా ఫీచర్స్ ట్విట్టర్ ఎక్స్ లాగానే ఉన్నాయి. పోస్టింగ్, కామెంటింగ్, లైక్ చేయడం ఇలాంటవన్నీ సేమ్ గానే ఉన్నా.. ఇది డీసెంట్రలైజ్డ్ కావడంతో ఎక్స్ కంటే ఇదే బెటర్ అని యూజర్లు అభిప్రాయపడుతున్నారు. డీసెంట్రలైజ్డ్ అంటే యూజర్ల డేటాని బ్లూ స్కూ సంస్థ కంట్రోల్ చేయదు.. ఆ డేటా కంట్రోల్ యూజర్ల వద్దే ఉంటుంది. పైగా యూజర్లు తమ డేటాని తమ సొంత సర్వర్లపైనే హోస్ట్ చేయగలరు. కంపెనీ సర్వర్లపై ఆధారపడాల్సిన పని ఉండదు. అయితే ఇది ఆప్షనల్. అయితే కంపెనీ సర్వర్లపై డేటా స్టోర్ చేసే సాధారణ యూజర్లకు బ్లూస్కై వారి యూజర్ నేమ్ చివర్లో “.bsky.social.” అని కేటాయిస్తుంది.
బ్లూస్కై విశేషమేమిటంటే.. దీన్ని రూపకర్త మరెవరో కాదు.. జాక్ డోర్సే. ట్విట్టర్ స్థాపించింది ఈయనే. అయితే ట్విట్టర్ ని బిలియనీర్ వ్యాపారవేత్త ఎలన్ మస్క్ కు విక్రయించేశాక ఆయన ట్విట్టర్ కంపెనీ బోర్డు నుంచి వైదొలిగారు. ఆ తరువాతనే ఒక డీసెంట్రలైజ్డ్ సోషల్ మీడియా యాప్ తయారు చేయాలని భావించి బ్లూస్కైని రూపొందించారు. అయితే ప్రస్తుతం జాక్ డోర్స్ మే 2024 నుంచి బ్లూస్కై బోర్డ్ నుంచి కూడా వైదొలిగారు. సెప్టెంబర్ 2024లో ఆయన తన బ్లూస్కై అకౌంట్‌ని కూడా డెలీట్ చేసేశారు. ఇప్పుడు బ్లూస్కై సీఈఓ గా జే గ్రేబర్ ఉన్నారు. ఆయన బ్లూస్కై యాప్ ని పబ్లిక్ బెనిఫిట్ కార్పొరేషన్ గా నడుపుతున్నారు.
నిజానికి బ్లూ స్కై యాప్ 2019 నుంచి ఉంది. కానీ ఫిబ్రవరి 2024 నుంచి ప్రజలకు ఉచిత సేవలు అందిస్తోంది. అందుకే ఈ సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెలల నుంచి ఈ యాప్ వినియోగించే యూజర్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ప్రతి రోజు 10 లక్షల మంది యూజర్లు ఈ యాప్ ని సైన్ అప్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా అమెరికా ఎన్నికల సమయంలో ప్రచార కార్యక్రమాల కోసం ఈ యాప్ వినియోగించిన వారు ఎక్కువ. బ్లూ స్కై యాప్ కు ఇంత అనూహ్య ఆదరణ పెరగడానికి కారణం.. ట్రంప్ కోసం ఎలన్ మస్క్ ప్రత్యక్షంగా ప్రచారం చేయడం. ఆయన తన సోషల్ మీడియా కంపెనీ ‘ఎక్స్’ని ట్రంప్ ప్రచార ఆయుధంగా మార్చేశారు. దీంతో అమెరికా మీడియా సంస్థలన్నీ ఎలన్ మస్క్ ని తీవ్రంగా విమర్శించాయి. అందుకే ఎక్స్ కు ప్రత్యామ్నంగా బ్లూస్కై వైపు యూజర్లు మొగ్గుచూపారు.
Also Read: ఇండియా టు అమెరికా అరగంటలో ప్రయాణం.. ఇది సాధ్యమే అంటున్న ఎలన్ మస్క్!
బ్లూస్కై యూజర్లలో ప్రస్తుతం అమెరికా సెలిబ్రిటీల సంఖ్య పెరుగుతోంది. పాప్ సింగర్ లిజో, టాస్క్ మాస్టర్ గ్రెగ్ డేవిస్, హాలీవుడ్ ప్రముఖ నటులు బెన్ స్టిల్లర్, జేమీ లీ కర్టిస్.. లాంటి వారు బ్లూ స్కై లో అకౌంట్లు కలిగి ఉన్నారు. అయితే ట్విట్టర్ ఎక్స్ తో పోటీ పడాలంటే బ్లూస్కైలో ఉన్న యూజర్లు సంఖ్య చాలా తక్కువ అనే చెప్పాలి. ట్విట్టర్ ఎక్స్ లో వందల కోట్ల మంది యూజర్లు ఉన్నారు.
దీనికి తోడు బ్లూస్కై ఇంతవరకు కమర్షియల్ కాలేదు. అంటే ఈ కంపెనీకి సరైన ఆదాయం లేదు. దీని యజమానులు కూడా యాడ్స్ ద్వారా సంపాదించాలనే యోచనలో లేరు. కానీ కస్టమ్ డొమైన్స్, కమర్షియల్ యూజర్ నేమ్స్ ద్వారా ఆదాయ మార్గం కోసం అన్వేషిస్తున్నారు. ప్రస్తుతానికి బ్లూస్కై ఒక పెద్ద సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ అని చెప్పలేం కానీ ఇదే స్పీడుతో కొనసాగితే మరి కొన్ని సంవత్సరాలలో ఫేస్ బుక్, ట్విట్టర్ ఎక్స్ లకు ఇది గట్టి పోటీ ఇవ్వగలదు.