కాళేశ్వరంతో కోటి ఎకరాలకు నీరు ఒక అందమైన అబద్ధంగా మారిపోయిందా.. రైతులను ఊహల్లో తేలేలా చేసిందా.. లక్ష కోట్లు ఖర్చు చేసి కట్టిన ప్రాజెక్టు కుంగిపోయి చేతులెత్తేసినా మన రైతులు ఎలా నిలబడ్డారు? గతంలో కంటే రికార్డు స్థాయిలో ధాన్యం ఎలా పండించగలిగారు? నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి? తెరవెనుక ఏం జరిగింది? అసలేం జరిగిందో అన్నీ డీకోడ్ చేద్దాం.
గత ప్రభుత్వం హయాంలో తుమ్మినా దగ్గినా కాళేశ్వరం మాట ఎత్తేవారు. ఆ కాళేశ్వరంతోనే రైతులు రికార్డులు సృష్టించారని చెప్పుకున్నారు. సీన్ కట్ చేస్తే ఈ ఏడాది జరిగిందేంటో చూస్తున్నారుగా… కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీరు లేకపోయినా రాష్ట్రంలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో వరి ధాన్యం ఉత్పత్తి అయిందని తేలింది. తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా ఈ ఏడాది 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అయింది.
కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్లనే రాష్ట్రంలో వరి ఉత్పత్తి పెరిగిందని ప్రచారం చేసిన బీఆర్‌ఎస్ నేతలు ఇప్పుడేం సమాధానం చెబుతారన్నది ప్రశ్న. గతంలో కోటి 46 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి రాగా ఈ ఏడాది 66.77 లక్షల ఎకరాల్లో కోటి 53 లక్షల టన్నుల ధాన్యం దిగుబడితో అసలు కాళేశ్వరానికి, వరి ఉత్పత్తికి సంబంధమే లేదన్నది తెలంగాణ ప్రజలు, రైతులకు క్లారిటీ వచ్చింది. సో పంజాబ్, హర్యానా రాష్ట్రాలను దాటేసి మరీ ఉత్పత్తి సాధిస్తోంది తెలంగాణ. ధాన్యం దిగుబడిలో దేశంలోనే నెంబర్ వన్ గా ఎదిగింది.
రైతులు శ్రమజీవులు. ఏదైనా అనుకుంటే లక్ష్యాన్ని సాధిస్తారు. వరి వేస్తే ఉరే.. సన్నాలు వస్తే అంతే సంగతి అని బెదిరించడం కాదు.. ఎలా చేస్తే బాగుంటుందో విడమరిచి చెబితే రికార్డులు వారంతట వారే సృష్టిస్తారనడానికి ఈ ఏడాది ధాన్యం ఉత్పత్తే నిదర్శనం. సన్న రకాల సాగు 25 లక్షల ఎకరాల నుంచి 40లక్షలకు పెరగడానికి ప్రభుత్వ చర్యలే కారణం. అలాగే దొడ్డు రకం వరి సాగు 41 లక్షల నుంచి 21 లక్షల ఎకరాలకు తగ్గిపోయింది. ప్రభుత్వం సన్నాలకు బోనస్ ప్రకటించడమే కాదు బోనస్ కోసం ఇప్పటికే 33 కోట్ల రూపాయలు విడుదల కూడా చేశారు.
అటు FCI కూడా పారాబాయిల్డ్ రైస్ కొనబోమని తేల్చేసింది. సో ఈ పరిస్థితుల్లో రైతులు దొడ్డు బియ్యం పండించినా పెద్దగా ఉపయోగం ఉండదన్న ఉద్దేశంతో సన్నాలకు బోనస్ ప్రకటించి ఆ దిశగా రైతులను మళ్లించింది. దిగుబడులు తక్కువగా ఉన్నా.. తెగుళ్ల బెడద ఉన్నా సన్నాలే పండించారు రైతు. కారణం దొడ్డు బియ్యానికి పెద్దగా డిమాండ్ లేకపోవడమే. దాన్ని రైతులకు అర్థమయ్యేలా వివరించడంలో రేవంత్ సర్కారు సక్సెస్ అయింది. నమ్మకం కలిగించడం అంటే ఇదీ. గతంలో కేసీఆర్ మాత్రం వరి వేస్తే ఉరే అన్నారు. సన్నాలు వేస్తేనే కొంటామన్నారు. రైతులను ఒప్పించడం ఇలానా అన్న ప్రశ్నలు అప్పట్లో వచ్చాయి.
ఇక ధాన్యం కొనుగోళ్లపైనా గత సర్కార్ హయాంలో చాలా గొప్పలు చెప్పుకున్నారు. కరోనా టైంలో అయితే దేశంలోనే ఎక్కడా లేనివిధంగా కొన్నామన్నారు. ఇప్పుడు ప్రభుత్వం కొంటున్నా సరే.. ఏమీ లేదు అంతా తుస్సే అని ప్రచారం చేస్తుండడంపై మంత్రులు ఫైర్ అవుతున్నారు. గత ఏడాది ఈ టైంలో 9.35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే.. ఈ ఏడాది 9.58 లక్షలు మెట్రిక్ టన్నులు కొనుగోలు జరిగింది కూడా. సో మ్యాటర్ ఏంటంటే.. కిలో బియ్యం ఉత్పత్తికి 5000 లీటర్ల నీరు అవసరం. మరి ఈ నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి? అన్నిటినీ మందు కాళేశ్వరమే అని చెప్పుకున్నారు కదా.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల లేకపోయినా, రిజర్వాయర్లను నింపకపోయినా.. ఎలా పండిందన్న పాయింట్ తో బీఆర్ఎస్ కు కౌంటర్ వేస్తున్నారు మంత్రులు.
గతంలో వరి ఎక్కడ పండినా అది కాళేశ్వరం ఘనతే అని చెప్పుకున్న బీఆర్ఎస్ నేతలు.. ఇప్పుడు పండిన రికార్డు ధాన్యం ఉత్పత్తికి ఇచ్చే జవాబు ఏంటన్న ప్రశ్నలు వస్తున్నాయి. కిలో బియ్యం ఉత్పత్తికి 5 వేల లీటర్ల నీరు అవసరం. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? రిజర్వాయర్ గేట్లు ఎత్తేసే ఉన్నాయి. ఎత్తిపోతలు జరగలేదు. అయినా మ్యాజిక్ ఎలా జరిగింది? ఇన్నాళ్లూ కాళేశ్వరం పేరు చెప్పి మభ్యపెట్టారా అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.
గత ప్రభుత్వ హయాంలో మాటకు ముందు కాళేశ్వరం. మాటకు వెనుక కాళేశ్వరం అన్నట్లుగా పరిస్థితి ఉండేది. కాళేశ్వరం వల్లే కోటి ఎకరాల్లో సాగంటూ డబ్బా కొట్టుకున్న పరిస్థితి. నిజానికి కోటి ఎకరాలకు నీరు చేరదని, ఇవ్వడం అసాధ్యమని కేసీఆర్ సహా అందరికీ తెలుసు. కానీ రైతులను మభ్యపెట్టొచ్చు అన్న కాన్సెప్ట్ తో వెళ్లారన్న పాయింట్ తెరపైకి వస్తోంది. కాళేశ్వరం లేకపోతే ధాన్యం ఉత్పత్తి పెరిగేది కాదని చెప్పుకున్న గులాబీ లీడర్లు ఇప్పుడు రికార్డు స్థాయి ధాన్యం ఉత్పత్తికి జవాబేమిస్తారన్న ప్రశ్నలైతే వస్తున్నాయి.
కాళేశ్వరం కలరింగ్ తో 13 జిల్లాలు, 31 నియోజకవర్గాలు, 121 మండలాలు 1698 గ్రామాలకు లబ్ది అంటూ ఆహా ఓహో అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మూడు ఆనకట్టలు, 22 లిఫ్టులు, 21 భారీ పంప్ హౌస్‌లు, సొరంగ మార్గాలు వీటన్నింటిని 36 నెలల టైంలోనే పూర్తి చేశామని బీఆర్ఎస్ అప్పట్లో క్లైయిమ్ చేసుకుంది. హడావుడిగా పనులు చేసిన శ్రద్ధ…, పంటలకు నీళ్లివ్వడంలో మాత్రం లేకుండా పోయిందన్న విమర్శలు ప్రాజెక్టు కుంగడంతో మరింత పెరిగాయి. 28 ప్యాకేజీలు, 7 మెగా లింకులతో నిర్మించిన కాళేశ్వరానికి లక్ష కోట్లు ఖర్చయింది. పైగా అధిక వడ్డీలకు రుణాలు తెచ్చి కట్టారు. ఇంత చేస్తే కాళేశ్వరం చుక్క నీరు లేకపోయినా వరి ధాన్యం ఎలా పండిందన్నదే అసలు పాయింట్.
నా చేను దాకా నీరు రావాలనేది ప్రతి రైతు ఆకాంక్ష. రైతుల ఉద్వేగాలకు గాలం వేసి కాళేశ్వరం కట్టడంలో సక్సెస్ అయిన కేసీఆర్.. అదే మేడిగడ్డ కుంగడం ఓటమికి కారణమైంది. కాళేశ్వరం ప్రపంచంలోనే భారీ ఎత్తిపోతల పథకం. ఇంజనీరింగ్ మార్వెల్. కేసీఆర్ అపర భగీరథుడు, ఆయనే కాళేశ్వరం చీఫ్ ఇంజనీర్, కాళేశ్వరం మోటార్లు బాహుబలి మోటార్లు అని అంతా ఆహా ఓహో అన్నారు. కానీ ఏమైంది? మేడిగడ్డ కుంగింది. అన్నారం, సుందిళ్లలో బుంగలు పడ్డాయి. గతంలో వరదలకు బాహుబలి మోటార్లు మునిగిపోయాయి. దీంతో కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతా ఓ స్క్రాప్ మాదిరిగా తయారైందన్న విమర్శలు మరింత పెరుగుతున్నాయి.
ప్రాణహిత తుమ్మిడిహెట్టిని కాదని కాళేశ్వరం కట్టారు. ఇది సుస్థిర ప్రాజెక్ట్ అసలే కాదు అని చాలా మంది మొత్తుకున్నారు. కానీ కేసీఆర్ ఎవ్వరి మాట కూడా లెక్కచేయలేదు. అద్భుతాలు సృష్టిస్తానన్నారు. కాళేశ్వరం కట్టారు. వరి దిగుబడి పెరగడానికి కారణం అదే అన్నారు. కానీ ఇప్పుడు కాళేశ్వరం పూర్తిగా చేతులెత్తేసినా సరే మన రైతులు అద్భుతాలు సృష్టించారు. కడెం ప్రాజెక్టు వరద గేట్ల సామర్థ్యం రెండున్నర, మూడు లక్షల క్యూసెక్కులే కానీ.. ఆరున్నర లక్షల క్యూసెక్కుల దాకా వరదను తట్టుకొని నిలబడింది. అదే మేడిగడ్డ చేతులెత్తేసి కుంగిపోయింది. ఇదే ప్రాజెక్టు తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించి ఉంటే ఇంత విధ్వంసం ఉండేది కాదన్న వాదనను ఎంతో మంది వినిపించారు. రెండు మూడు దశలు దాటి ఎత్తిపోతలు ఎంతమాత్రం అనువైనవి కావు. అయినా నమ్మించారు. కానీ ఏం జరిగింది. ఇప్పుడు మేడిగడ్డలో నీళ్లు లేవు. అన్నారం సుందిళ్లలోనూ లేవు. అయినా పంటలు ఇంకా రికార్డు స్థాయిలో పండాయని గుర్తు చేస్తున్నారు హస్తం నేతలు.
కేసీఆర్ హయాంలో పదే పదే కాళేశ్వరం ద్వారా కోటి ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యమని చెప్పుకునే వారు. నిజానికి అన్ని ఎకరాలకు ఆ స్థాయిలో నీటిని ఎత్తిపోసి ఇవ్వాలంటే కరెంట్ బిల్లులకే రాష్ట్ర ఖజానా ఖాళీ అవుతుందని కేసీఆర్ సహా అందరికీ తెలుసు. సో కాళేశ్వరంతోనే ధాన్యం దిగుబడులు అంటూ పైపైన చెబుతూ మభ్యపెట్టారా అన్న విమర్శల్ని కాంగ్రెస్ నేతలు వినిపిస్తున్నారు. ప్రస్తుతం కాళేశ్వరం నడిస్తే నష్టం, నడవకపోయినా నష్టమే. ఎందుకంటే నడిస్తే కరెంట్ బిల్లుల రూపంలో నష్టం, నడవకపోతే భారీ వడ్డీలకు తెచ్చిన అప్పులకు మిత్తీలు కట్టడం భారం. ఇదో లాజిక్ లెస్ ప్రాజెక్టుగా మారిపోయింది. ఈ ఎత్తిపోతలు లేకుండానే రైతులు వరి ధాన్యం అందులోనూ సన్నాలు రికార్డు స్థాయిలో పండించిన విషయాలను ప్రస్తావిస్తున్నారు.
Also Read: కారు.. కిస్సా కల్లాస్.. జిల్లాలకు జిల్లాలే ఖాళీ!
కాళేశ్వరం కింద నీళ్లు ఉన్నాయి కాబట్టి వరి వేయండి, ధాన్యాన్ని ఇంటర్నేషనల్ మార్కెట్లో అమ్ముతాం అని గత ప్రభుత్వ హయాంలో హామీలు ఇచ్చారు. కానీ వాస్తవంలో అలా జరగలేదు. ఇప్పుడు రేవంత్ సర్కార్ హయాంలో మాత్రం రైతులకు ఏవేవో ఆశలు కల్పించకుండా వాటిని ప్రభుత్వ వసతి గృహాల్లో పిల్లలకు, రేషన్ షాపులు, గురుకులాలు, హాస్టళ్లలో పంపిణీ చేస్తామని చెప్పడం ద్వారా రైతుల్లో నమ్మకాన్ని కల్పించారు. అందుకే కష్టనష్టాలు ఉన్నా సన్నాలు సాగు చేశారు రైతులు. అందుకు తగ్గ ప్రతిఫలం అందుకుంటున్నారు. సో కాళేశ్వరం సంగతి వట్టి మాటే అని పదే పదే తేలుతున్నా.. ఇప్పుడు మరోసారి అందరికీ అర్థమయ్యేలా ఆ ప్రాజెక్టు వినియోగంలో లేకపోయినా రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడులు రావడం కీలకంగా మారింది.