Russia-Ukraine : కాలం మారింది. యుద్ధం మారింది. వ్యూహం మారింది. దాడి మారింది. ఒకప్పుడు కత్తులతో పోరాటాలు. ఆ తర్వాత తుపాకులు. బాంబులు. యుద్ధవిమానాలు. ఇప్పుడంతా టెక్నాలజీతోనే యుద్ధాలు జరుగుతున్నాయి. డ్రోన్లు వార్ రీతినే మార్చేశాయి. ఇటీవలి ఇండియా, పాకిస్తాన్ యుద్ధంలోనూ డ్రోన్లు కీ రోల్ ప్లే చేశాయి. కొన్ని రూ.వేలు ఖర్చు చేస్తే చాలు. రూ.కోట్ల ఖరీదైన ఫైటర్‌జెట్స్‌ను కూల్చేయొచ్చు. శత్రు దేశాల ఆయుధ సంపత్తిని నాశనం చేసేయొచ్చు. ఫైటర్‌జెట్స్ పదుల సంఖ్యలోనే ఉంటే.. డ్రోన్లు ఏకంగా వందలు, వేలు, లక్షల్లో అటాక్ చేయొచ్చు. అందుకే లేటెస్ట్ జనరేషన్ వార్‌లో డ్రోన్లు గేమ్ ఛేంజర్స్.
ఉక్రెయిన్‌కు డ్రోన్లే దిక్కు
రష్యా, ఉక్రెయిన్ వార్. ఏళ్ల తరబడి నడుస్తోంది. ఎవరూ గెలవట్లే. ఎవరూ ఓడట్లే. యుద్ధం మాత్రం జరుగుతూనే ఉంది. చాలాకాలం బలమైన రష్యాన్ ఆర్మీదే అప్పర్‌హ్యాండ్. దాడులను కాచుకోవడంతోనే సరిపోతోంది. అప్పుడప్పుడూ అటాక్ చేసినా రష్యాకు అంతగా డ్యామేజ్ జరిగేది కాదు. కానీ, ఈసారి ఉక్రెయిన్ గేమ్ ఛేంజ్ చేసింది. డ్రోన్లను నమ్ముకుంది. 18 నెలల పాటు పక్కాగా ప్లాన్ చేసింది. 118 డ్రోన్లతో సింపుల్‌గా అటాక్ చేసింది. ఏకంగా రష్యాకు చెందిన 41 యుద్ధ విమానాలను స్మాష్ చేసిపడేసింది. దెబ్బకు యావత్ ప్రపంచం ఉలిక్కిపడింది. ఉక్రెయిన్ డ్రోన్ వ్యూహానికి రష్యాకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. ఆ షాక్ నుంచి తేరుకోకముందే మరో అటాక్.
క్రిమియా బ్రిడ్జి బ్లాస్ట్
ఈసారి పుతిన్ మానసపుత్రిక లాంటి బ్రిడ్జిని కూల్చేసింది ఉక్రెయిన్. రష్యాను క్రిమియాతో కలిపే కీలకమైన బ్రిడ్జి అది. అండర్ గ్రౌండ్ ఎక్స్‌ప్లోజివ్స్‌తో ధ్వంసం చేసింది ఉక్రెయిన్. రష్యా క్షిపణులతో రివేంజ్ అటాక్స్ చేస్తున్నా.. ఇప్పటికే తీవ్రంగా నష్టపోయిన ఉక్రెయిన్‌కు అదేమంత ఎదురుదెబ్బ కాదు. రష్యాకే దారుణమైన డ్యామేజ్.
ఉక్రెయిన్‌కు లక్ష డ్రోన్లు
డ్రోన్ల ఇంపార్టెన్స్ గుర్తించిన ఉక్రెయిన్ ప్రపంచ దేశాల నుంచి మరింత సాయం కోరుతోంది. బ్రిటన్ వెంటనే స్పందించింది. ఉక్రెయిన్‌కు ఏకంగా లక్ష డ్రోన్లు అందిస్తామని హామీ ఇచ్చింది. 2026 ఏప్రిల్ నాటికి ఆ డ్రోన్ల సరఫరా పూర్తి చేస్తామని చెప్పింది. వామ్మో.. లక్ష డ్రోన్లే. రష్యాకు సౌండ్ బంద్. కేవలం 100 డ్రోన్లతోనే రష్యాకు చెందిన 41 ఫైటర్ జెట్స్‌ను ధ్వంసం చేస్తే.. ఇక ఉక్రెయిన్ చేతికి లక్ష డ్రోన్లు వచ్చాయో…!
బాలిస్టిక్ మిస్సైల్స్ అటాక్‌కు పర్మిషన్
ఉక్రెయిన్‌కు ఇచ్చే 4.5 బిలియన్ పౌండ్ల మిలిటరీ మద్దుతులో భాగంగానే.. 350 మిలియన్ పౌండ్ల విలువైన లక్ష డ్రోన్లను అందిస్తామని బ్రిటన్ ప్రకటించింది. త్వరలోనే ఉక్రెయిన్‌కు మద్దతుగా 50 దేశాల డిఫెన్స్ కాంటాక్ట్ గ్రూప్ బ్రస్సెల్స్‌లో కీలక సమావేశం కూడా నిర్వహించనుంది. మరోవైపు, రష్యాపై దీర్ఘశ్రేణి ఆయుధాలు ప్రయోగించకుండా ఉక్రెయిన్‌పై ఇప్పటి వరకు విధించిన ఆంక్షలను పశ్చిమ దేశాలు తొలగించాయి. దీంతో ఇక ముందు ఉక్రెయిన్ వార్ స్ట్రాటజీలు అమాంతం మారిపోవచ్చు. రష్యాకు మరింత డ్యామేజ్ తప్పకపోవచ్చు. అదే జరిగితే.. అణుయుద్ధం తప్పదా? ఇప్పటికే రష్యా తన అణ్వాయుధాలను రెడీ చేస్తోందనే ప్రచారం జరుగుతోంది. మునుముందు మూడో ప్రపంచ యుద్ధ ప్రమాదం పొంచిఉందా?