Big Stories

Brunei : గాంధీజీ కలగన్న దేశం.. బ్రూనై..!

Share this post with your friends

Brunei

Brunei : మన దేశంలో అర్థరాత్రి ఆడది ఒంటరిగా తిరగగలిగిన రోజే.. మన దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లని జాతిపిత మహాత్మాగాంధీ ప్రబోధించారు. మన దేశంలో నేటికీ ఆ పరిస్థితి లేనప్పటికీ.. బ్రూనై అనే చిన్న దేశం మహాత్ముని ఆశయాలను నిజం చేసి చరిత్రకెక్కింది. గత 20 ఏళ్ళలో ఆ దేశంలో ఒక్క హత్య కూడా నమోదు కాలేదంటే నమ్మాల్సిందే.

బోర్నియో ద్వీపకల్పపు వాయువ్య భాగాన గల బుల్లి అందమైన దేశమే.. బ్రూనై. దీని పూర్తి పేరు బ్రూనై దారుస్సలాం. ఈ దేశపు అధికారిక మతం ఇస్లాం. భాష మలయ్. దీని పొరుగుదేశాలైన మలేషియా, ఇండోనేసియాల్లోనూ ఇదే అధికార భాష. జనాభా నాలుగున్నర లక్షలు. జనసాంద్రత బాగా తక్కువ గనుక దేశం ప్రశాంతంగా, పరిశుభ్రంగా ఉంటుంది. నాలుగున్నర లక్షల జనాభా కోసం.. అక్కడ లక్షన్నర మంది విదేశీయలు ఉద్యోగులుగా పనిచేస్తున్నారు.

నిజానికి మలయ్ అనేది ఓ జాతిపేరు. ఇక్కడి జనాభాలో 67 శాతం మలయ్‌ జాతికి చెందిన వారే కాగా, రెండు మూడు స్థానాల్లో ఇంగ్లీష్, చైనీస్ భాషలు మాట్లాడేవారున్నారు. దేశాన్ని నాలుగు జిల్లాలుగా విభజించారు. గతంలో బ్రిటిష్ పాక్షిక పాలనతో ఉన్న ఈ దేశం.. 1984 జనవరిలో స్వతంత్ర దేశంగా అవతరించింది. గల్ఫ్ దేశాల్లాగా పూర్తి స్థాయి రాజరికం ఉన్న అతి తక్కువ దేశాల్లో ఇదొకటి. ఈ దేశానికి ఆర్థిక వనరులు చమురు, సహజ వాయువే.

బ్రూనై అనగానే అందరికీ బ్రూనై సుల్తాన్(76) గుర్తుకొస్తాడు. ప్రపంచ సంపన్నుల్లో ఒకడైన హసనల్ బోల్కియా ఈ దేశపు రాజుగా ఉన్నారు. 1967 నుంచి ఈ దేశాన్ని పరిపాలిస్తున్న వారిలో ఆయన 29వ రాజు. సుమారు అరవై బిలియన్ డాలర్ల ఆస్తితో 1990 దశకంలో ఇతను ప్రపంచ ధనికుడిగా రికార్డులకెక్కారు. చమురు, సహజవాయువు నిక్షేపాల కారణంగా ఈ దేశం సంపన్న దేశంగా నిలుస్తోంది. సాధారణంగా చమురు దొరకే ప్రాంతాల్లో నీరు దొరకదు. కానీ.. ఈ రెండు పుష్కలంగా ఉన్న అరుదైన దేశం.. బ్రూనై.

క్రీస్తు శకం 6-7 శతాబ్దాల వరకు శ్రీవిజయన్ అనే మహారాజు ఈ దేశాన్ని పాలించాడు. దేశంలో అందరూ సంస్కృతమే మాట్లాడే సంప్రదాయానికి ఆయన శ్రీకారం చుట్టాడు. 15వ శతాబ్దం నాటికి ఇస్లాం ప్రాబల్యం పెరిగి అదే అధికారిక మతంగా మారింది.

దేశ జనాభా చాలా తక్కువ గనుక.. ప్రజలందరికీ ఉచిత విద్య, వైద్యం, అందరికీ ఇల్లు, కారు సమకూర్చుకోవడానికి తక్కువ వడ్డీకే బ్యాంకు ఋణాలు లభిస్తాయి. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ చాలా తక్కువ కనుక ఇంటికో కారు ఉంటుంది. అక్కడక్కడ విదేశీ శ్రామికుల కోసం మినీ బస్సులు కనబడతాయి.

టీవీ ఛానళ్ళు రోజుకి కొన్ని గంటలు మాత్రమే పనిచేస్తాయి. అందులో నేరాలు-ఘోరాలు లాంటి కార్యక్రమాలు అసలే ఉండవు. విదేశీ కార్మికులు చేసే చిన్న చిన్న దొంగతనాలు తప్ప 25 ఏళ్లుగా ఈ దేశంలో ఒక్క హత్య కూడా జరగలేదు. ఇక్కడి వారు చాలా నెమ్మదిగా మాట్లాడతారు. భావావేశాలకు, ఉద్రేకాలకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించే వీళ్ళ నుండి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది.

ఇక.. సుల్తాన్ గారి ఆదాయం ప్రతీ సెకనుకి 90 యూరోల మేర పెరుగుతూ ఉంటుంది. ఈయన రాజప్రాసాదం పేరు.. ‘ఇస్తానా నూరుల్ ఇమాన్’. ఇదే ప్రపంచంలోనే అతిపెద్ద రాజప్రాసాదం. దీని విస్తీర్ణం.. 2.15 మిలియన్ చదరపు అడుగులు. బ్రూనై నది ఒడ్డున పూర్తి ఇస్లామిక్ సంస్కృతిలో నిర్మితమైన ఈ రాజభవనంలో 1788 గదులు (వాటికన్ కంటే 388 ఎక్కువ గదులు), 650 సూట్లు, ప్రతీ అంతస్థుకీ ఎస్కలేటర్స్, ఒకేసారి 500 మంది కూర్చొనే డైనింగ్ హాల్, సుమారు 1500 మంది ఒకేసారి ప్రార్థన చేసేందుకు లోపలే ఓ మసీదు.. దీని ప్రత్యేకతలు.
‘ది లైట్ ఆఫ్ ఫెయిత్ ప్యాలెస్’ అని కూడా పిలిచే ఈ భవనం గోపురానికి 22 క్యారెట్ల బంగారంతో తాపడం చేశారట. రాజకుటుంబం వద్ద 7000 కంటే ఎక్కువ లగ్జరీ కార్లు ఉన్నట్లు సమాచారం. వీటి విలువ సుమారు రూ. 41,600 కోట్లు.

ఇక ఆయన కోసం.. ఓ హెలిపాడ్, 300 కార్లు పట్టే పార్కింగ్ ప్లేస్, క్లినిక్, స్పోర్ట్స్ కాంప్లెక్స్ వగైరాలెన్నో ఉన్నాయి. దీని నిర్మాణానికి కావలసిన సామాగ్రిని 30 దేశాల నుంచి తెప్పించారు. ఈ రాజప్రాసాదం చూడ్డానికి ఏటా రంజాన్ పండుగ సందర్భంగా మూడు రోజులు ప్రజలందరినీ (విదేశీయుల్ని కూడా) అనుమతిస్తారు. ఆ రోజు మగవాళ్ళందరూ రాజుగారితో, మహిళలు రాణిగారితో కరచాలనం చేసే అవకాశం లభిస్తుంది.

అంతేకాదు.. సుల్తాన్ గారి వైభవం సంగతికొస్తే.. ఈయన 100 మిలియన్ డాలర్లు ఖరీదైన విమానం కొని, దాన్ని మరో 100 మిలియన్ డాలర్లు ఖర్చుపెట్టి.. బంగారంతో తాపడం చేయించారు. ఇవిగాక.. 6 చిన్న విమానాలు, 4 హెలికాప్టర్లు కూడా ఉన్నాయి. అంతేకాదు.. తన కూతురి 18వ పుట్టినరోజుకి ఏకంగా ఓ ఎయిర్‌బస్‌నే కానుకగా ఇచ్చాడు. తన 50వ పుట్టినరోజు సంబరాల్లో భాగంగా మైఖెల్ జాక్సన్‌ మ్యూజిక్ ప్రోగ్రాంను ఏర్పాటు చేశారు.

ఈయన మన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మాదిరిగా.. వీలయినప్పుడల్లా తన విమానాన్ని తానే నడుపుకుంటూ వెడతాడు. 2018లో ఈయన భారత రిపబ్లిక్ డే ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు వచ్చినప్పుడు.. 71 ఏళ్ల సుల్తాన్.. అలాగే స్వయంగా విమానం నడుపుకుంటూ ఢిల్లీలో దిగారు.

ప్రశాంతంగా సెలవు దినాలను గడపాలనుకునే వారికి బ్రూనై ఒక చక్కని హాలిడే స్పాట్. ఇక్కడి ప్రజలంతా ఎంతో కొంత ఇంగ్లిష్ మాట్లాడుతారు. కనుక పర్యాటకులకు పెద్ద ఇబ్బంది ఉండదు. అయితే.. ఒక సమస్య మాత్రం ఉంది… పేరులో ‘దారు’ ఉన్నా ఈ దేశంలో మద్యం దొరకదు. పూర్తిగా డ్రై కంట్రీ. టూరిజం ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందకపోవడానికి ఇదీ ఒక కారణమని కొందరు వాపోతుంటారు.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Latest News