California Los Angeles Wildfire | ప్రపంచంలోనే మోస్ట్ ఎంటర్‌టైన్మెంట్ సిటీ, హాలీవుడ్ సినిమాల పుట్టినిల్లుగా పేరున్న లాస్ ఏంజిలిస్ నగరాన్ని కార్చిచ్చు చుట్టుముట్టింది. ఈ నగరం చుట్టూ ఉన్న దట్టమైన అడవిలో కార్చిచ్చు రగలడంతో వేయి ఇళ్లకు పైగా దహనమయ్యాయి. ప్రముఖ హాలీవుడ్ సినీతారలు, సెలెబ్రిటీలు తమ ఇళ్లను వదిలి పారిపోతున్నారు. ప్రభుత్వం లక్ష మందికి పైగా నగరం నుంచి ఖాళీ చేసి వెళ్లి పోవాలని నిర్దేశించింది. దీంతో వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇప్పటివరకు అయిదుగురు మృతి చెందారని సమాచారం.
అయితే ఈ భారీ మంటలు ఇప్పటివరకు అదుపులోకి రాలేదు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని, లాస్ ఏంజిలిస్ స్టేట్ గవర్నమెంట్ ఎమర్జెన్సీని ప్రకటించింది. యుద్ధ ప్రాతిపదికన స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టింది. 1,00,000 మందిని తరలించే ప్రకటన ఇచ్చింది లాస్ ఏంజిలిస్ ఫైర్ డిపార్ట్‌మెంట్. లాస్ ఏంజిలిస్ నగరాన్ని భారీ అగ్నిజ్వాలలు కమ్ముకోవడంతో ఇప్పటికే 2000 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తోంది. ఈ సంఖ్య కూడా తక్కువ కావడంతో రిటైర్మెంట్ తీసుకున్న ఫైర్ ఫైటర్లు కూడా సాయం చేయాలని ప్రభుత్వం వారిని కోరింది.
లాస్ ఏంజిలిస్ చుట్టూ దట్టమైన అడవులు ఉన్నాయి. ఏంజిలిస్ నేషనల్ ఫారెస్ట్, మౌంటో ఆంటోనియో, శాంటా మోనికా మౌంటెయిన్స్ నేషనల్ పార్క్, పాయింట్ ముగు స్టేట్ పార్క్, మలీబు, పాలిసేడ్స్ తదితర ప్రాంతాలు అన్నీ అటవీ ప్రాంతాలే. ఈ అటవీ ప్రాంతాలు వేల హెక్టార్లలో విస్తరించాయి. ఇటీవల పాలిసేడ్స్‌లో భారీగా కార్చిచ్చు వ్యాప్తి చెందింది. సుమారు 2,921 ఎకరాల్లో విస్తరించిన ఈ అటవీ ప్రాంతంలో 800 ఎకరాలు అగ్నికి కట్టుబడ్డాయి. ఆకాశం నుంచి రాలిపడుతున్న బలమైన ఈదురుగాలులు మరియు పొడి వాతావరణం ఈ మంటలకు ప్రేరణగా మారాయి. ఈ కారణంగా మంటలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. పాలిసేడ్స్ అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న లాస్ ఏంజిలిస్‌లోని పలు జనావాసాలు కూడా అగ్నికి తాకాయి.
Also Read: ప్రిన్సెస్ డయానాకు సైట్ కొట్టిన ట్రంప్.. ఛీకొట్టిన యువరాణి.. ఆ లవ్ స్టోరీ తెలుసా?
లాస్ ఏంజిలిస్, ఆరెంజ్, వెంచురా, శాన్ డియాగో, శాన్ బెర్నార్డినో తదితర ప్రాంతాలలోని భారీ అపార్ట్‌మెంట్లలో కూడా మంటలు ఆందోళన కరంగా వ్యాప్తి చెందాయి. వేలాది వాహనాలు మంటల్లో చిక్కుకుపోయాయి. ప్రజలు తమ నివాసాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. వెస్ట్ హాలివుడ్ ప్రాంతంలో ఈ మంటల తీవ్రత అత్యధికంగా కనిపించింది. ఈ మంటలు వాతావరణాన్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఉష్ణోగ్రతలు పెరిగాయి, వేడి గాలులు ప్రజలను ఇబ్బంది పెట్టాయి. నేషనల్ వెదర్ సర్వీస్ ప్రకారం, ఈ గాలుల తీవ్రత 80 నుండి 130 కిలోమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉంది. మరో 24 గంటల పాటు ఈదురుగాలులు కొనసాగవచ్చని తెలిపింది.
లాస్ ఏంజిలిస్ లో సినీ తారలు నివసించే హాలీవుడ్ హిల్స్, బెవర్లీ హిల్స్ లో కూడా భవనాలు దగ్ధమయ్యాయి. ఇక్కడ నివసించే ప్రముఖ తారలు కీను రీవ్స్ (జాన్ విక్), బెన్ అఫ్లెక్ (బ్యాట్ మెన్), జారెడ్ లేటో, జస్టిన్ టింబర్ లేక్, అరియాన్ గ్రాండే, టేలర్ స్విఫ్ట్, జెన్నెఫర్ అన్నిస్టన్, జెన్నిఫర్ లారెన్స్, ఎల్లెన్ డిజెనెరెస్ తదితురులు.. బుధవారమే తమ ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు.
లాస్ ఏంజిలిస్ ఫైర్ డిపార్ట్‌మెంట్ చీఫ్ క్రిస్టిన్ క్రాలీ ప్రకారం.. సిటీ పరిధిలో 20,000 నివాసాలు మంటల్లో చిక్కుకున్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని, కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసొమ్ ఎమర్జెన్సీ ప్రకటించి, యుద్ధ ప్రాతిపదికన తరలింపు చర్యలకు ఆదేశించారు. ఇదే సమయంలో, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఈ రోజు కాలిఫోర్నియా పర్యటనకు రానున్నారు కానీ, అది రద్దయింది.