
Climate Change : పర్యావరణ మార్పులపై శాస్త్రవేత్తలు ఎంతగానో ఆందోళన చెందుతున్నా.. ప్రజలకు మాత్రం చెవికెక్కడం లేదు. గత నెలలో మనం అత్యంత వేడిమిని చవిచూశాం. ప్రపంచంలోనే అత్యంత ఉష్ణోగ్రతలు నమోదైంది సెప్టెంబర్ నెలలోనే. మరి పర్యావరణ మార్పుల దుష్ఫలితాలపై పౌరులు కలవరపడుతున్నారా? భూతాపంపై సరిగానే ప్రచారం జరుగుతోందా? ఆ ప్రతికూల అంశాలపై పౌరుల్లో ఏ మాత్రం కదలిక వస్తోంది? అంటే లేదనే చెప్పాలి.
పర్యావరణ మార్పులు సహా 18 అంశాలపై 21 దేశాల్లో సర్వే చేశారు. 18-64 ఏళ్ల లోపు వయసున్న 12-60 వేల మంది అభిప్రాయాలు తెలుసుకున్నారు. జూలై 2022 నుంచి జూన్ 2023 వరకు నిర్వహించిన ఆ సర్వే విస్మయకర అంశాలను బయటపెట్టింది.
శిలాజ ఇంధనాల వాడకం.. ఫలితంగా ఉష్ణోగ్రతల పెరుగుదల, వాతావరణంపై దాని ప్రభావం వంటి అంశాలేవీ రెస్పాండెంట్లకు పట్టకపోవడం దిగ్భ్రమ కలిగించింది. పర్యావరణ మార్పులను వారేమీ పెద్ద సమస్యగా తీసుకోవడం లేదని స్పష్టమైంది. 21 దేశాల్లో సర్వేలో పాల్గొన్నవారందరి తీరూ ఇలాగే ఉండటం విశేషం.
భూతాపంపై స్విట్జర్లాండ్ ప్రజలు మాత్రం కొంత చైతన్యవంతులయ్యారు. క్లైమేట్ ఛేంజ్‌ను వారు తీవ్రమైన అంశంగానే పరిగణిస్తున్నారు. ప్రధానమైన సమస్య అదేనని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ అంశంలో ఏ ఏ దేశాల్లో ఎంత మేర చైతన్యం ఉందన్నదీ ర్యాంకుల రూపంలో పరిశీలిస్తే స్విట్జర్లాండ్ రెండో స్థానంలో ఉంది. ఫ్రాన్స్, జర్మనీ 4వ ర్యాంక్ దక్కించుకున్నాయి.
బ్రిటన్ 6వ ర్యాంక్, స్పెయిన్ 8వ ర్యాంకుల్లో ఉన్నాయి. తమ ప్రధాన సమస్య పర్యావరణ మార్పులేనన్న అభిప్రాయం అమెరికా, భారత్ దేశాల్లో సమానంగా ఉంది. ఆ రెండు దేశాలు 9వ ర్యాంక్‌లో నిలిచాయి. మెక్సికో 10వ ర్యాంక్, పోలండ్ 12, సౌతాఫ్రికా 13వ ర్యాంక్‌ను దక్కించుకున్నాయి. పోలండ్, దక్షిణాఫ్రికాల్లో పర్యావరణ మార్పులపై అవేర్‌నెస్ చాలా తక్కువగా ఉందన్నమాట.