HIV InJection| దశాబ్దాల నుంచి మానవాళిని భయపెట్టే ప్రాణాంతక వ్యాధులలో హెఐవి ఎయిడ్స్ ఒకటి. ఈ వ్యాధికి మందు లేదు. హెఐవి పాజిటివ్ ఇన్‌ఫెక్షన్ సోకితే క్రమంగా రోగనిరోధక శక్తి తగ్గి మనిషి చనిపోవడమే మార్గం. అయితే ఇదంతా ఇప్పటివరకు. తాజాగా ఎయిడ్స్ వైరస్ కు శాస్త్రవేత్తలు మందు కనుగొన్నారు. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ విభాగం బుధవారం జూన్ 18, 2025 హెచ్ఐవి వైరస్ కు నివారణ మందుగా ఒక ఇంజెక్షన్‌కు అనుమతి ఇచ్చింది. ఈ ఇంజెక్షన్ ఏడాదికి రెండు సార్లు తీసుకోవాల్సి ఉంటుంది.
క్లినికల్ ట్రయల్స్‌లో HIV సంక్రమణ నుండి ఈ ఇంజెక్షన్ దాదాపు 99.9 శాతం అంటే పూర్తిగా రక్షణ కల్పిస్తుందని తేలింది. ఈ ఇంజెక్షన్ పేరు లెనాకాపవిర్, దీన్ని గిలియడ్ సైన్సెస్ కంపెనీ తయారు చేసింది. ఈ ఇంజెక్షన్‌ని మార్కెట్లో గిలియడ్ సైన్సెస్ కంపెనీ యెజ్టుగో అనే పేరుతో విక్రయించనుంది. ఈ ఇంజెక్షన్ రావడంతో HIV నివారణలో ఒక ముఖ్యమైన అడుగు. కానీ పేద దేశాల్లో ఈ ఔషధం పంపిణీకి కష్టతరంగా మారింది. ఎందుకంటే ఇలాంటి ఔషధాలు కొనుగోలు చేసి పంపిణీ చేసే గ్లోబల్ హెల్త్ ప్రోగ్రామ్‌లకు అమెరికా నిధులు తగ్గించేయడం వల్ల దీని పంపిణీ ఎంతవరకు సాధ్యమవుతుందో ప్రస్తుతంగా అనిశ్చితంగా ఉంది.
గత 44 ఏళ్లుగా HIV చికిత్స, నివారణ కోసం జరుగుతున్న ప్రయత్నాల్లో ఇది అత్యంత ప్రభావవంతమైన ఆప్షన్ అని AVAC అనే అంతర్జాతీయ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మిచెల్ వారెన్ అన్నారు. కానీ గత ఐదు నెలల్లో వచ్చిన పాలసీ మార్పుల వల్ల ఈ అవకాశం చేజారిపోతుందేమోనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నిధుల కొరత వల్ల పేద దేశాలు HIV సోకినవారి చికిత్సకే ప్రాధాన్యం ఇవ్వవచ్చు, నివారణకు కాదు. హెచ్ఐవి నివారణకు ఈ ఇంజెక్షన్ సమర్థవంతంగా ఉపయోగపడుతుందని తెలిసినా పేదరికం కారణంగా ప్రజలు దీన్ని కొనలేని పరిస్థితి. ఎందుకంటే ప్రస్తుతం ఈ ఇంజెక్షన్ ధర 28,218 డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.25 లక్షలు.
లెనాకాపవిర్ HIV నివారణలో రెండో దీర్ఘకాలిక ఆప్షన్. మొదటిది కాబోటెగ్రావిర్ (బ్రాండ్ నేమ్: అప్రెట్యూడ్), దీనిని రెండు నెలలకొకసారి ఇస్తారు. అప్రెట్యూడ్‌ను అమెరికాలో 21,000 మంది ఉపయోగిస్తున్నారు. అయితే చికిత్స కోసం రోజువారీ మాత్రలను 5 లక్షల మంది వాడుతున్నారు. ఏడాదికి రెండుసార్లు ఇచ్చే ఈ ఇంజెక్షన్ HIV వ్యాప్తిని మార్చగల సామర్థ్యం ఉందని నిపుణులు భావిస్తున్నారు. క్లినికల్ ట్రయల్స్‌లో ఈ ఇంజెక్షన్ దాదాపు పూర్తి రక్షణ ఇచ్చింది.
అమెరికాలో 2023లో 39,000 మంది HIV బారిన పడ్డారు. ప్రతి కొత్త ఇన్ఫెక్షన్ వ్యక్తికి జీవితకాలంలో సుమారు 11 లక్షల డాలర్ల వైద్య ఖర్చు అవుతుందని గిలియడ్ సీఈవో డానియల్ ఓ’డే చెప్పారు. నివారణ ఈ వ్యాధిని నియంత్రించడానికి అత్యంత ఖర్చు-ప్రభావవంతమైన మార్గమని ఆయన అన్నారు. లెనాకాపవిర్ ఇప్పటికే HIV చికిత్సకు ఉపయోగిస్తున్నారు. సంవత్సరానికి రెండు ఇంజెక్షన్ల ధర 42,000 డాలర్లు. అప్రెట్యూడ్ ధర సంవత్సరానికి 24,000 డాలర్లు. అయితే ఎయిడ్స్ చికిత్స కోసం ఉపయోగించే జెనరిక్ మాత్రల ధర ఒక్కో డోస్‌కు 1 డాలర్ మాత్రమే.
గిలియడ్ కంపెనీ ప్రకారం.. ఇన్సూరెన్స్ లేదా పేషెంట్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్‌ల ద్వారా చాలామంది ఈ ఔషధం ఉచితంగా పొందవచ్చు. కానీ ఇన్సూరెన్స్ కంపెనీలు అడ్డంకులు సృష్టించవచ్చని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. అమెరికాలో మెడికేడ్ కోతలు కూడా ఈ ఔషధం అందుబాటులో ఉండటాన్ని పరిమితం చేయవచ్చు.
Also Read: రోజూ రెండు కప్పులు ఈ కాఫీ తాగితే ఎక్కువ కాలం జీవించవచ్చు.. అధ్యయనంలో షాకింగ్ ఫలితాలు
ప్రపంచవ్యాప్తంగా 2023లో 13 లక్షల మంది HIV బారిన పడ్డారు. గిలియడ్ కంపెనీ.. 120 పేద దేశాలకు తక్కువ ధరలో లెనాకాపవిర్‌ను అందించడానికి ఆరు కంపెనీలతో ఒప్పందం చేసింది. అయితే, బ్రెజిల్ వంటి మధ్యతరగతి దేశాలకు ఈ ఒప్పందం వర్తించదు. ఈ దేశాల్లో ధరలపై చర్చలు జరుగుతున్నాయి.
ప్రస్తుతం సెనెట్‌లో ఉన్న బిల్ PEPFAR, గ్లోబల్ ఫండ్‌కు నిధులను తగ్గిస్తుంది. ఈ రెండూ లెనాకాపవిర్‌ను కొనుగోలు చేసే అవకాశం ఉన్న సంస్థలు. ట్రంప్ ప్రభుత్వం.. HIV నివారణ నిధులను నిలిపివేసింది. చికిత్సకు మాత్రమే నిధులు ఇచ్చింది. ఇది HIV నివారణకు పెద్ద అడ్డంకిగా మారింది. ఈ అవకాశాన్ని వినియోగించుకోకపోతే, ఈ మహమ్మారి మరింత కొనసాగవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
హెచ్‌ఐవీ/ఎయిడ్స్ ఎంత ప్రమాదకరం?
హెచ్‌ఐవీ అంటే రోగనిరోధక శక్తిని బలహీనం చేసే వైరస్. ఇది శరీరాన్ని వ్యాధులతో పోరాడలేని స్థితికి తీసుకెళ్తుంది. హెచ్‌ఐవీ రక్తం, రక్షణ లేని సెక్స్, సోకిన సూదులు, తల్లి నుంచి బిడ్డకు సంక్రమిస్తుంది. సుఖవ్యాధులు ఉన్నవారికి ఈ వైరస్ సోకే అవకాశం ఎక్కువ.
ఎయిడ్స్ అనేది హెచ్‌ఐవీ వైరస్ చివరి దశ. ఇది రోగనిరోధక శక్తిని పూర్తిగా క్షీణింపజేస్తుంది. అయితే, హెచ్‌ఐవీ ఉన్నవారందరికీ ఎయిడ్స్ రాదు. రక్తపరీక్ష ద్వారా హెచ్‌ఐవీని గుర్తించవచ్చు. తొలి దశలో జ్వరం, దద్దుర్లు, గొంతునొప్పి వంటి లక్షణాలు కనిపించవచ్చు. తర్వాత బరువు తగ్గడం, విరేచనాలు, దీర్ఘకాల జ్వరం రావచ్చు. చికిత్స లేకపోతే టీబీ, క్యాన్సర్ వంటి తీవ్ర వ్యాధులు సోకొచ్చు.
హెచ్ఐవీ నివారణకు ఇతర మార్గాలు
కండోమ్ వాడకం, సురక్షిత రక్తమార్పిడి, సున్తీ, హెచ్‌ఐవీ పరీక్షలు చేయించుకోవడం ద్వారా నివారణ సాధ్యం. హెచ్‌ఐవీ తాకడం, కౌగలించుకోవడం, దోమ కాటు ద్వారా సోకదు. అవగాహన, జాగ్రత్తలతో హెచ్‌ఐవీని నిరోధించవచ్చు.