Delta Flight Fire| ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరిన ఒక విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే ఆ విమానం ఎయిర్ పోర్ట్ రన్ వే మీదుగా ఎగిరే క్రమంలో ఈ మంటలు రేగడంతో విమాన సిబ్బంది టేకాఫ్ చేయలేదు. ఆ సమయంలో విమానంలో నిండుగా ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులను కాపాడడానికి విమాన సిబ్బంది వెంటనే ఎమర్జెన్సీ ద్వారాలు తెరిచారు. ఈ ఘటన అమెరికాలోని ఆర్లాండో అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ఉదయం జరిగింది.
వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం ఆర్లాండో నగరం నుంచి జార్జియా రాష్ట్రంలోని అట్లాంటా నగరానికి సోమవారం బయలుదేరిన డెల్టా ఎయిర్ లైన్స్ కు చెందిన ఎయిర్ బస్ A330 విమానం స్టాడింగ్ గేటు నుంచి రన్ వే పైకి వెళ్లింది. అక్కడి నుంచి ఆకాశంలోకి ఇక ఎగరబోతుండగా విమానం ఇంజిన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు కాసేపటికే తీవ్రం కావడంతో విమానం నడిపే పైలట్లు గుర్తించారు.
వెంటనే విమానం టేకాఫ్ చేయకుండా ఆపేశారు. తిరిగి వెంటనే స్టాండింగ్ గేటు కు సమీపంలోకి తీసుకెళ్లారు. కానీ అప్పటికే మంటలు ఇంజిన్ మొత్తంలో వ్యాపించాయి. ఈ విషయం తెలిసిన విమానంలోని ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఆ సమయంలో విమానంలో మొత్తం 282 మంది ప్రయాణికులు ఉన్నాట్లు అధికారిక సమాచారం. ప్రయాణికుల ప్రాణాలు కాపాడడానికి విమాన సిబ్బంది వెంటనే విమానంలోని రెండు ఎమర్జెన్సీ ద్వారాలను తెరిచి టార్మాక్ స్లైడ్స్ ఏర్పాటు చేశారు. దీంతో ప్రయాణికులు ఒకరి తరువాత మరొకరు విమానంలో నుంచి ఆ జారుడు టార్మాక్ మీదుగా విమానం బయటికి వచ్చారు.
ఎయిర్ పోర్ట్ లో దూరం నుంచి ఈ దృశ్యాన్ని వీక్షిస్తున్న మరో ప్రయాణికుడు వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఆ వీడియో దృశ్యాలు చూస్తే విమానం అవతలి వైపు నుంచి భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. అమెరికా ప్రభుత్వంలోని విమానయాన విభాగం అయిన ‘ది ఫెడరల్ ఏవిషేయన్ అడ్మినిస్ట్రేషన్’ (ఎఫ్ఏఏ), డెల్టా ఎయిర్ లైన్స్ సంయుక్తంగా ఈ దుర్ఘటనపై అధికారికంగా ఒక ప్రకటన జారీ చేశాయి.
“డెల్టా ఎయిర్ లైన్స్ ఎయిర్ బస్ A330 విమానం సోమవారం ఆర్లాండో ఎయిర్ పోర్ట్ నుంచి అట్లాంటా వెళ్లాల్సి ఉండగా.. ఆర్లాండో విమానాశ్రయంలో రన్ వేపై ఉన్న విమానం టేకాఫ్ చేయకముందే విమానం ఇంజిన్ లో మంటలు చెలరేగాయి. ఈ అగ్ని ప్రమాదం గురించి సమయం ఉండగానే గుర్తించిన విమాన సిబ్బంది.. వెంటనే టేకాఫ్ ని ఆపేసి రన్ వేపై విమానాన్ని నిలిపివేశారు. ప్రయాణికు భద్రత మేరకు ముందస్తు చర్యగా ఎమర్జెన్సీ స్లైడ్స్ తెరిచి మొత్తం 282 మందిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణహాని జరగలేదు. విమానం ఇంజిన్ లో మంటలు ఎలా చెలరేగాయో దర్యాప్తు కు ఆదేశించడం జరిగింది.” అని ఆ ప్రకటనలో ఉంది.
ప్రయాణికులకు ఇబ్బంది కలిగినందుకు చింతిస్తున్నామని డెల్టా ఎయిర్ లైన్స్ క్షమాపణలు కోరింది. అందరికీ మరొక విమానంలో అట్లాంటా తీసుకెళ్లేందుకు చర్యలు చేపట్టామని చెప్పింది.
BREAKING NEWS 🚨 Today a Delta Airlines plane carrying 300 passengers at Orlando International Airport had to be evacuated after the engine caught fire. pic.twitter.com/hYRtPRrdZ4
— The Internet (@KingstonLi25) April 21, 2025