Doctor Neglects Pregant Lady| డాక్టర్లు అంటే పేషెంట్ల ప్రాణాలు కాపాడటం కోసం అహర్నిశలు శ్రమించాలి. కానీ కొందరు డాక్టర్లు మాత్రం తమ వృత్తిని, వృత్తి ధర్మాన్ని మర్చిపోయి తమ నిర్లక్ష్యంతో మనుషుల ప్రాణాలకు ముప్పు తీసుకొస్తారు. ఇలాంటి ఘటనే మలేషియాలో వెలుగు చూసింది.
గర్భంతో ఆసుపత్రికి వచ్చిన ఒక తల్లి.. తీవ్రమైన రక్తస్రావంతో బాధపడుతున్న సమయంలో ఆమె రక్తస్రావాన్ని అడ్డుకొని, ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత డాక్టర్లదే కదా. అయితే మలేషియాలోని సెలాంగోర్‌లోని షాన్ క్లినిక్ అండ్ బర్త్ సెంటర్‌లో వైద్యులు మాత్రం తమ నిర్లక్ష్యంతో ఆమె ప్రాణాలకు ముప్పుతెచ్చారు.
అదే ప్రాంతంలో నివశిస్తున్న పునీతా మోహన్ అనే మహిళ గర్భస్థ మావి (మాయ) పగలడంతో తీవ్రమైన రక్తస్రావం జరిగింది. దీన్ని గమనించిన పునీత తల్లి.. ఆమెను షాన్ క్లినిక్‌కు తీసుకొచ్చింది. ఆ సమయంలో మునియాడి షణ్ముగం, అకాంబరం రవి అనే ఇద్దరు వైద్యులు డ్యూటీలో ఉన్నారు. బిడ్డ పుట్టే సమయంలో ఇలాంటివి మామూలే అన్నట్లు వాళ్లిద్దరూ బిహేవ్ చేశారు.
పునీత రక్తస్రావాన్ని ఆపడానికి ప్రయత్నిస్తుంటే.. వాళ్లిద్దరు మాత్రం పేషెంట్‌కు సేవ చేసేందుకే ప్రయత్నించలేదు. వారిలో ఒకరైతే ఆమె పరిస్థితిని మానిటర్ చెయ్యకుండా మందు కొట్టాలని వెళ్లిపోయాడు. రెండో డాక్టర్ కూడా ఆమెను పెద్దగా పట్టించుకోలేదు. ఎంతసేపటికీ పునీత రక్తస్రావం ఆగకపోవడం చూసిన ఆమె తల్లి.. ఆ ఆస్పత్రిలో డాక్టర్లు కూడా లేకపోవడంతో భయంతో వణికిపోయింది. తన కూతుర్ని వెంటనే దగ్గరలో పెద్ద ఆస్పత్రి అయిన హాస్పిటల్ టెంగూ అముపన్ రహిమా క్లాంగ్ (హెచ్‌టీఏఆర్)కు తీసుకెళ్లింది.
Also Read: రూ.40 వేల కేక్, 300 మందికి పార్టీ.. కళ్లు చెదిరేలా కుక్క బర్త్ డే సెలబ్రేషన్స్!
అక్కడకు వెళ్లేసరికి పునీత ఆరోగ్యం బాగా క్షీణించింది. దీంతో ఆమె అక్కడే తుదిశ్వాస విడిచింది. దీంతో ఆమె కుటుంబం కోర్టుకెక్కింది. షాన్ క్లినిక్‌లో డాక్టర్లు సరిగా పని చేసి ఉంటే తమ కూతురు బతికే ఉండేదని వాళ్లు వాదించారు. మలేషియాలోని కోర్టు కూడా ఈ వాదనతో ఏకీభవించింది. అలాగే షాన్ క్లినిక్‌లో పనిచేస్తున్న నర్సులకు ఆ వృత్తిలో పనిచేసే అర్హతలు కూడా లేవని విచారణలో తేలింది.
ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్న కోర్టు.. బాధితురాలు పునీత కుటుంబానికి ఈ ఇద్దరు వైద్యులు 6 మిలియన్ రింగ్‌గిట్ (రూ. 11.42 కోట్లు) చెల్లించాలని ఆదేశించించింది. క్లినిక్ అండ్ బర్త్ సెంటర్‌లో చేరిన పునీత మోహన్ మరణానికి వైద్యులు మునియాడి షణ్ముగం మరియు అకాంబరం రవి, అలాగే విధుల్లో ఉన్న ముగ్గురు నర్సులే బాధ్యులని క్లాంగ్‌లోని హైకోర్టు పేర్కొంది.
ఈ రూ.11 కోట్ల నష్టపరిహారంలో చనిపోయిన మహిళ పడిన బాధకు రూ.95 లక్షలు, ఆమె ఇద్దరు పిల్లలకు చెరో రూ.1.9 కోట్లు, ఆమె తల్లిదండ్రులకు చెరో రూ.57 లక్షలు చెల్లించాలని లెక్కలు చెప్పింది. డాక్టర్ రవి మందు తాగడానికి వెళ్లకుండా, పునీత రక్తస్రావం ఆపడానికి చూసి ఉంటే ఈ విషాదం జరిగేది కాదని కోర్టు తెలిపింది. ఈ స్థాయి నిర్లక్ష్యం ఏమాత్రం క్షమించరానిదని ఆగ్రహం వ్యక్తం చేసింది. వీరి నిర్లక్ష్యం వల్ల పూర్తి ఆరోగ్యంగా ఉన్న ఒక తల్లి మరణించిందని ఆవేదన వ్యక్తం చేసింది.