Iran-Israel War Updates: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముగిసిందంటూ ట్రంప్ పోస్ట్ చేశారు. కొన్ని రోజులుగా క్షిపణులతో దాడులు చేసుకుంటున్న ఇరుదేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాయన్నారు. 24 గంటల తర్వాత యుద్ధం అధికారికంగా ముగిసినట్లు ప్రకటించనున్నారు. దీంతో 12 రోజులుగా జరుగుతున్న యుద్ధానికి ముగింపు దొరికినట్లైంది. మరికొన్ని గంటల్లోనే కాల్పుల విరమణ జరుగనున్నట్లు తెలుస్తోంది.
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం చాలా తీవ్రంగా కొనసాగింది. రెండు దేశాల మధ్య దాడులు, ప్రతిదాడులతో.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అమెరికా కూడా ఈ యుద్ధంలో జోక్యం చేసుకోవడంతో.. పరిస్థితులు మరింత దారుణంగా మారాయి. ఇజ్రాయెల్.. ఇరాన్‌లోని వైమానిక స్థావరాలపై భారీ దాడులు చేసినట్లు ప్రకటించింది. ఈ దాడుల్లో మిస్సైల్ నిల్వ కేంద్రాలు, యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు ధ్వంసమైనట్లు తెలిపింది. 15 యుద్ధ విమానాలతో ఈ దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ మిలిటరీ తెలిపింది.
ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా కూడా ఈ వార్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇరాన్‌లోని మూడు అణు స్థావరాలపై బీ-2 బాంబర్లు, క్షిపణులతో భీకర దాడులు చేసినట్లు అగ్రరాజ్యం ప్రకటించింది. దీనిని ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్‌గా తెలిపింది. అమెరికా దాడులకు ప్రతీకారంగా.. ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌పై 40 క్షిపణులతో దాడులకు దిగింది. ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్, జెరూసలెం లాంటి నగరాల్లో పేలుళ్లు సంభవించాయి. ఇరాన్.. టూ ప్రామిస్ 3 ఆపరేషన్ పేరుతో దాదాపు 100 బాలిస్టిక్ మిసైళ్లు, డ్రోన్‌లతో ఇజ్రాయెల్‌పై దాడి చేసింది.
ఇక.. ఇరాన్‌లోని టెహ్రాన్ ఎవిన్ జైలుపై.. ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడుల్లో.. జైలు ద్వారాన్ని లక్ష్యంగా చేసుకొని.. ఇరాన్ మిసైల్‌ని సంధించినట్లు కనిపిస్తోంది. ఇజ్రాయెల్.. ఈ ఎవిన్ జైలుని లక్ష్యంగా చేసుకొని దాడి చేయడం వెనుక ఓ కారణముంది. తీవ్రమైన, క్రూరమైన నేరస్తులు ఉండే ఈ జైలుకు సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్‌పై దాడి చేశారు. ఇందులో.. ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తిన ప్రత్యర్థులను నిర్బంధించారు. ఇందులో ఎక్కువగా రాజకీయ ఖైదీలు, మానవ హక్కుల కార్యకర్తలు, విదేశీ పౌరులు, గూఢచర్యం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లు ఉంటారు. అందువల్ల.. ఈ జైలుని టార్గెట్ చేసి దాడి చేయడం హాట్ టాపిక్‌గా మారింది.
Also Read: అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ క్షిపణిదాడి.. మండిపడిన ఖతార్
మరోవైపు అమెరికాపై ఇరాన్ ప్రతీకార దాడికి దిగింది. ఖతార్‌లోని అమెరికా ఎయిర్‌బేస్‌లపై దాడి చేసింది. మొత్తం14 మిస్సైళ్లను ప్రయోగించింది ఇరాన్. ఖతార్ రాజధాని ధోహలో పలుచోట్ల పేలుళ్లకు పాల్పడింది. ఖతార్, ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసింది. దోహా శివార్లలోని అల్ ఉదీద్ వైమానిక స్థావరంపైకి టెహ్రాన్ క్షిపణులు ప్రయోగించింది. అయితే ఈ దాడుల్లో ప్రాణనష్టం జరగలేదని, ఇరాన్ క్షిపణుల్ని అడ్డుకున్నామని ఖతార్ ప్రకటించింది.