DR Congo says 129 killed in attempted prison break: డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో విషాదం చోటుచేసుకుంది. సెంట్రల్ మకాల జైలు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించి ఏకంగా 129 మంది ఖైదీలు మృత్యువాత పడ్డారు.
డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో రాజధాని మకాలా సెంట్రల్ జైలు నుంచి సోమవారం రాత్రి కొంతమంది ఖైదీలు తప్పించుకునేందుకు ప్రయత్నించారు. గుంపులుగా జైలు బద్దలుకొట్టి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా.. అధికారులు, సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే రంగంలోకి దిగడంతో ఒక్కసారిగా ఖైదీలు ఆందోళనకు గురై పరుగులు తీశారు. అయితే కట్టడి చేసేందుకు పోలీసులు కాల్పులు జరిగినట్లు అనుమానిస్తున్నారు.
ఈ క్రమంలో ఒకరిపై ఒకరు పడిపోవడంతో పాటు తొక్కిసలాట జరిగింది. అయితే కిచెన్ లో జరిగిన ప్రమాదంలో మంటలు చెలరేగాయి. దీంతో కొంతమంది ఖైదీలు చిక్కుకుపోయారు. ఈ మంటల్లో 24 మంది చిక్కుకొని ప్రాణాలు కోల్పోగా..తొక్కిసలాటలో సుమారు 129 మంది ఖైదీలు చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని ఇంటీరియర్ మంత్రి షబాని లు కో మంగళవారం ఎక్స్‌లో వెల్లడించారు.
‘మకాల జైలు నుంచి కొంతమంది ఖైదీలు తప్పించుకునేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో అనుమానంతో సిబ్బంది రంగంలోకి దిగింది. దీంతో ఒక్కసారిగా గుంపులుగా పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో మొత్తం 129 మంది మృతి చెందగా.. మరో 59మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. అలాగే కిచెన్ లో చెలరేగిన మంటల్లో అడ్బినిస్ట్రేటివ్ భవనం కూడా దెబ్బతింది.’ అని మంత్రి షబాని లుకో పేర్కొన్నారు.
ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. అయితే ఖైదీలు ఎవరూ తప్పించుకోలేదని అధికారుల తెలిపారు. ఎవరైతే తప్పించుకునేందుకు ప్రయత్నించారో వారు మాత్రమే మరణించినట్లు వెల్లడించారు. అయితే ఖైదీలు చెప్పిన సమాధానాలు మాత్రం అధికారులు చెప్పిన మాటలకు విరుద్ధంగా ఉన్నాయి. దీంతో ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తమకు బయట నుంచి భారీ కాల్పుల చప్పుళ్లు వినిపించాయని కొంతమంది ఖైదీలు పేర్కొన్నారు. అయితే మకాల జైలు నుంచి విడుదలైన ఫోటోలు చూస్తే మరణహోమం జరిగినట్లు కనిపిస్తుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జైలు నుంచి డజన్ల కొద్దీ మృతదేహాలను తీసుకెళ్లినట్లు చెబుతున్నారు.
ఈ విషయంపై కొంతమంది స్థానికులు మాట్లాడారు. రాత్రి కాల్పులు శబ్ధానికి నిద్రలో నుంచి మేల్కొన్నామని చెప్పారు. తెల్లవారుజామున 2 గంటల నుంచి సుమారు 4 గంటల వరకు తుపాకీ కాల్పులు జరిగినట్లు చెప్పారు. కొంతమంది పారిపోగా.. మరికొంతమంది చనిపోయినట్లు అనుమానిస్తున్నారు.
అయితే, ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలో న్యాయవాదులు సైతం స్పందించారు. ఈ విధ్వంసకర చర్యలకు కారణమైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించేందుకు చర్యలు తీసుకోవడంతోపాటు విచారణ చేపట్టాలని న్యాయమంత్రి కాన్ స్టంట్ ముతాంబా ఎక్స్ వేదికగా వెల్లడించారు.
Also Read: మిస్ యూనివర్స్ నైజీరియాగా చిడిమ్మా అడెత్‌షీనా.. కిరీటం ధరించిన వివాదాల సుందరి!
ఇదిలా ఉండగా, మకాల జైలులో మొత్తం 1,500 మంది ఖైదీలు ఉన్నట్లు సమాచారం. అంతకుముందు 2017లో జరిగిన ఓ దాడిలో రాత్రి కొంతమంది ఖైదీలు తప్పించుకున్నారు. సుమారు 4వేల మందికి పైగా ఉన్న ఈ జైలు నుంచి చాలామంది తప్పించుకున్నట్లు వార్తలు వచ్చాయి.