Afghanistan Earthquake| మయన్మార్‌లో సంభవించిన భూకంపం గురించి మరువకముందే ఆఫ్ఘనిస్థాన్‌లో స్వల్ప వ్యవధిలో రెండుసార్లు భూకంపాలు సంభవించాయి. నిమిషాల వ్యవధిలో సంభవించిన భూ ప్రకంపనలతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. నిమిషాల వ్యవధిలో భూమి కంపించడంతో ప్రజలు వణికిపోయారు.
ఆఫ్ఘనిస్థాన్‌లో భూకంపాలు
ఆఫ్ఘనిస్థాన్‌లో ఈరోజు (శనివారం, మార్చి 29) ఉదయం సంభవించిన భూకంపాలు ప్రజలను వణికించాయి. స్వల్ప వ్యవధిలో ఆఫ్ఘనిస్థాన్‌లో సంభవించిన రెండు ప్రకంపనల తీవ్రత వరుసగా 4.7 మరియు 4.3గా నమోదైంది. స్థానిక కాలమానం ప్రకారం శనివారం ఉదయం 4:51 మరియు 5:16 గంటలకు ఈ భూకంపాలు చోటుచేసుకున్నాయి.
భూకంపం కారణంగా ప్రజలు తమ ఇళ్లనుంచి బయటకు వచ్చారు. ప్రస్తుతానికి ఈ భూకంపాల వలన ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు వార్తలు లేవు. మార్చి 28న మయన్మార్, థాయ్‌లాండ్‌లలో బలమైన ప్రకంపనలు సంభవించినప్పుడు ఆఫ్ఘనిస్థాన్‌లోనూ భూకంపం సంభవించడం గమనార్హం.
Also Read: మయన్మార్ భూకంపం.. అక్కడ భూగర్భంలో ఏముందంటే?..
భూకంప గురించి నిపుణుల విశ్లేషణ
భూకంపశాస్త్ర నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. 4.3 మరియు 4.7 తీవ్రతతో వచ్చే భూకంపాలను మోడరేట్ భూకంపాలుగా వర్గీకరిస్తారు. ఇవి బలహీనమైన నిర్మాణాలు ఉన్న ప్రదేశాలలో భారీ నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది.
కాగా, మార్చి 21న ఆఫ్ఘనిస్థాన్‌లో 4.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) నివేదిక ప్రకారం దీని కేంద్రం భూమికి 160 కి.మీ. దిగువన ఉందని తెలియజేశారు. మార్చి 13న కూడా ఆఫ్ఘనిస్థాన్‌లో భూమి కంపించగా, రిక్టర్ స్కేలుపై 4 తీవ్రత నమోదైంది.
EQ of M: 4.3, On: 29/03/2025 04:51:37 IST, Lat: 36.59 N, Long: 71.12 E, Depth: 221 Km, Location: Afghanistan.
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjdtw0 @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/gPUcvvaCpb— National Center for Seismology (@NCS_Earthquake) March 28, 2025
మయన్మార్‌లో మళ్లీ ప్రకంపనలు
మయన్మార్ మరియు థాయ్‌లాండ్‌ను శుక్రవారం రెండు భారీ భూకంపాలు వణికించిన విషయం తెలిసిందే. ఈ పెను విపత్తులో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ ప్రకంపనల విధ్వంసానికి రెండు దేశాల్లో కలిపి మృతుల సంఖ్య 1000 దాటింది. ఒక్క మయన్మార్‌లోనే కనీసం 1002 మంది మరణించినట్లు మయన్మార్ మిలిటరీ అధికారులు వెల్లడించారు. మరో 2370 మంది గాయపడినట్లు పేర్కొన్నారు.
అటు బ్యాంకాక్ (Bangkok)లో 10 మంది మరణించగా, ఒక భారీ భవంతి కూలిన ఘటనలో దాదాపు 100 మంది నిర్మాణ కార్మికులు శిథిలాల కింద ఉన్నారు. వీరిలో ఎంత మంది బతికి ఉన్నారో స్పష్టం కాలేదు. ఈ విపత్తు కారణంగా మృతుల సంఖ్య 10,000 దాటే అవకాశం ఉందని అమెరికా ఏజెన్సీ హెచ్చరించడం గమనార్హం.
కాగా, భూకంపం కారణంగా ఇప్పటికే అతాలకుతలమైన మయన్మార్‌లో మరోసారి ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 4.2 తీవ్రతతో భూమి కంపించినట్లు అధికారులు వెల్లడించారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ప్రపంచ దేశాల ఆపన్నహస్తం
ప్రకృతి విపత్తుతో కుదేలైన మయన్మార్, థాయ్‌లాండ్ దేశాలను ఆదుకునేందుకు ప్రపంచ దేశాలు ముందుకొచ్చాయి. ఇప్పటికే భారత్ ‘ఆపరేషన్ బ్రహ్మ’ కింద మయన్మార్‌కు 15 టన్నుల సహాయక సామగ్రిని పంపింది. ఇందులో టెంట్లు, దుప్పట్లు, స్లీపింగ్ బ్యాగులు, జనరేటర్లు, ఆహార ప్యాకెట్లు ఉన్నాయి.
అటు అమెరికా, ఇండోనేషియా, చైనా కూడా అవసరమైన సాయం అందిస్తామని ప్రకటించాయి. ప్రభావిత దేశాలకు సహాయక సామగ్రిని పంపుతున్నామని యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ తెలిపారు.
మయన్మార్‌లో విపత్తు ప్రభావం
మయన్మార్‌లో శుక్రవారం మధ్యాహ్నం నిమిషాల వ్యవధిలో రెండు భారీ భూకంపాలు సంభవించాయి. ఈ ప్రభావంతో పొరుగున ఉన్న థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్లోనూ తీవ్ర ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
దీంతో తీవ్రమైన ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. వందల సంఖ్యలో భారీ భవనాలు పేకమేడల్లా నేలమట్టమయ్యాయి. ప్రార్థనాలయాలు, సాధువుల మఠాలు కుప్పకూలాయి. శిథిలాల కింద చిక్కుకుని అనేక మంది విలవిల్లాడుతున్నారు.
రెండు దేశాల్లోని ప్రభుత్వాలు వివిధ ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించాయి.