Big Stories

Earthquake: అంతులేని విషాదం.. 21 వేలు దాటిన మరణాలు

Earthquake: ప్రకృతి విలయంతో కకావికలమైన టర్కీ, సిరియాలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే విపరీతంగా కురుస్తున్న మంచు, వరుసగా వస్తున్న ప్రకంపనలు తీవ్ర ఆటంకం కలిగిస్తున్నాయి. మరోవైపు భూకంప సహాయక చర్యల్లో అత్యంత కీలకమైన 72 గంటలు కూడా ముగియడంతో.. శిథిలాల కింద చిక్కుకున్న వారు ప్రాణాలతో బయటపడుతారన్న ఆశలు క్షణక్షణానికి సన్నగిల్లుతున్నాయి.

- Advertisement -

మరోవైపు.. భూప్రళయంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉండటం దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ పెద్ద సంఖ్యలో మృతదేహాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే మృతుల సంఖ్య 21వేలు దాటింది. ఒక్క టర్కీలోనే 17వేలకు పైగా ప్రకృతి ప్రకోపానికి బలవ్వగా.. సిరియాలో 3వేలమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద ఎంతమంది ఉన్నారన్న దానిపై ఇంకా స్పష్టమైన సమాచారం లేదు. అయితే, సమయం గడుస్తున్న కొద్దీ వారు సజీవంగా ఉండే అవకాశాలు తగ్గుతున్నాయి. దీంతో మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు సహాయక బలగాలు కాలంతో పోటీపడి గాలింపు చర్యలు చేపడుతున్నారు.

- Advertisement -

శిథిలాల కింద చిక్కుకున్న 20 ఏళ్ల విద్యార్థిని వాట్సాప్‌ కాపాడింది. తూర్పు టర్కీలోని ఓ అపార్ట్‌మెంట్ భవన శిథిలాల కింద చిక్కుకున్న ఆ విద్యార్థి.. సమయస్ఫూర్తితో ఆలోచించి సోషల్‌మీడియా ద్వారా స్నేహితులకు వీడియో సందేశం పంపాడు. అందులో తాను ఏ ప్రాంతంలో ఉన్నది లోకేషన్‌ పంపించాడు. వాట్సాప్‌ స్టేటస్‌ షేర్‌ చేయడంతో అతడి స్నేహితులు సహాయక సిబ్బందికి సమాచారమిచ్చారు. వారు శిథిలాలను తొలగించి ఆ విద్యార్థిని కాపాడారు. అయితే అతడి బంధువులు మాత్రం ఇంకా శిథిలాల కిందే ఉన్నట్లు ఆ విద్యార్థి తెలిపాడు.

విపత్తుతో అల్లకల్లోలమైన టర్కీ, సిరియాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అండగా నిలిచింది. డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధానమ్‌ సిరియాకు బయల్దేరారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించి పరిస్థితిని పర్యవేక్షించనున్నారు. అటు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ దేశాలకు ఆర్థిక సాయం ప్రకటించింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News