అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ మధ్య గొడవ తెలిసిందే. ఎన్నికలకు ముందు ట్రంప్ విజయం కోసం ప్రచారం చేయడమే కాదు, ఆర్థిక సాయం కూడా చేశాడు మస్క్. ట్రంప్ అధికార పీఠం చేజిక్కించుకున్న తర్వాత కూడా కొన్నాళ్లు వీరి స్నేహం బాగానే ఉంది. కానీ అనుకోకుండా ట్రంప్ కి దూరమయ్యాడు మస్క్. అంతే కాదు, ట్రంప్ పై చెలరేగిపోయాడు. తాను లేకుండా ట్రంప్ గెలిచేవాడే కాదన్నాడు, కొత్త రాజకీయ పార్టీ పెట్టడానికి కూడా రెడీ అయ్యాడు. మరి అంతలోనే ఏమైందో ఏమో ట్రంప్ దెబ్బకి మస్క్ మామ హడలిపోయాడు. తాను పశ్చాత్తాప పడుతున్నట్టుగా ట్వీట్ చేశాడు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై చేసిన వ్యాఖ్యలు చాలా దూరం వెళ్లాయన్నారు. అందుకే తన ట్వీట్లపై పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నట్టు చెప్పాడు మస్క్.
ఆర్థిక నష్టం..
ట్రంప్ తో విభేదించిన తర్వాత ఎలన్ మస్క్ కి ఆర్థికంగా చాలా నష్టం జరిగింది. మస్క్ కంపెనీల షేర్లు కుదేలయ్యాయి. అమెరికా అధ్యక్షుడితో పెట్టుకుంటే ఎలా ఉంటుందనే విషయం మస్క్ కి వారం రోజుల్లోపే తెలిసొచ్చింది. అందుకే వెనక్కి తగ్గాడు. తాను తోపుని, తురుంని అని చెప్పుకునే మస్క్, చివరకు కాళ్లబేరానికొచ్చాడు. తన ట్వీట్ల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు.
I regret some of my posts about President @realDonaldTrump last week. They went too far.
— Elon Musk (@elonmusk) June 11, 2025
ఎక్కడ చెడింది..?
ఎన్నికల్లో తన గెలుపుకోసం కృషి చేసిన మస్క్ ని తాను అమెరికా అధ్యక్షుడు కాగానే ప్రత్యేక హోదాతో ప్రభుత్వంలో ఉద్యోగిగా నియమించుకున్నాడు ట్రంప్. సలహాదారుడిగా ఉద్యోగం ఇచ్చాడు. అతని కోసమే ప్రత్యేకంగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (DOGE) అనే విభాగాన్ని సృష్టించాడు. ప్రభుత్వ విభాగాల ఖర్చు తగ్గించడమే మస్క్ పని. కానీ ఆ పనిని మస్క్ సక్రమంగా నిర్వర్తించలేకపోయాడు. ఆ తర్వాత వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ విషయంలో వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. ఈ బిల్లుని మస్క్ బహిరంగంగా వ్యతిరేకించాడు. అంతే కాదు, ప్రభుత్వ సలహాదారుగా తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. అయితే ట్రంప్ తన స్నేహితుడికి ఆత్మీయ వీడ్కోలు ఇచ్చాడు. వీడ్కోలు సమావేశం ప్రత్యేకంగా నిర్వహించాడు.
ఆ తర్వాత గొడవ మరింత ముదిరింది. తాను లేకపోతే ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా గెలిచేవాడు కాదన్న మస్క్, తన ప్రతాపం చూపించేందుకు కొత్త రాజకీయ పార్టీ పెడతానన్నాడు. అంతే కాదు, గతంలో ట్రంప్ చేసిన తప్పుల్ని బయటపెడతాని కొత్తరాగం అందుకున్నారు. ఎప్‌స్ట్రీన్ వివాదంలో ట్రంప్ పాత్ర ఉందన్నారు. దీంతో ట్రంప్ మరింత ఫీలయ్యారు. మస్క్ వ్యాపారాలకు ప్రభుత్వ కాంట్రాక్టులు, రాయితీలు కట్ చేస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. దీంతో మస్క్ కంపెనీల షేర్లు పడిపోయాయి. దాదాపు 14 శాతం మేర టెస్లా మార్కెట్ వేల్యూ పడిపోయింది. వారం రోజుల్లోనే మస్క్ కి 152 బిలియన్ డాలర్ల నష్టం వచ్చింది.
దీంతో మస్క్ కి తత్వం బోధపడినట్టుంది. అందుకే తన ట్వీట్లపై తానే పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశాడు. ఈ వ్యవహారం చాలా దూరం వెళ్లిందని బాధపడ్డాడు. ఇక్కడితో ఈ గొడవ సద్దుమణిగిపోయిందని అనుకోవచ్చు. ట్రంప్ అహం చల్లారి ఉంటుంది, అదే సమయంలో మస్క్ వ్యాపారాలకు కూడా పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. పోరు నష్టం.. పొందు లాభం అనడానికి మస్క్-ట్రంప్ ద్వయం ఒక ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పుకోవాలి.