Sperm Donor: ఒకరు వీర్యదానం చేసి ఏదో పుణ్యం చేశానని అనుకున్నాడు. దాని ప్రభావం ఎంత భయానకంగా ఉంటుందో ఊహించని రీతిలో ఇప్పుడు బయటపడింది. ఈ ఘటన యూరప్‌లో జరిగింది. ఓ దాత ఇచ్చిన వీర్యంతో పుట్టిన 67 మంది పిల్లల జీవితాలు ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయి. ఈ దాతకు ఉన్న ఓ అరుదైన జన్యుపరమైన ఉత్పరివర్తన వల్ల, ఆ పిల్లల్లో 10 మందికి ఇప్పటికే క్యాన్సర్ వచ్చింది. ఈ ఉదంతం ఇప్పుడు అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది.
అసలు విషయం ఏమిటి?
2008లో ఒక వ్యక్తి వీర్యం దానం చేశాడు. ఆయన అప్పట్లో ఆరోగ్యంగా ఉన్నాడు. నాటి వైద్య పరీక్షల్లో ఎలాంటి సమస్యలు తలెత్తలేదు. అయితే, తర్వాత కాలంలో తెలిసిన విషయమేమిటంటే.. ఆయనలో TP53 అనే జన్యువులో ఒక అరుదైన మార్పు ఉంది. ఇది Li-Fraumeni Syndrome అనే క్యాన్సర్‌కు కారణమయ్యే అత్యంత ప్రమాదకరమైన జన్యు మార్పుగా వైద్యులు గుర్తించారు.
ఈ వీర్యంతో 2008 నుంచి 2015 మధ్య కాలంలో యూరప్‌లోని 8 దేశాల్లోని 46 కుటుంబాల్లో మొత్తం 67 మంది పిల్లలు పుట్టారు. వీరిలో 23 మందిలో ఈ జన్యు మార్పు ఉన్నట్టు తేలింది. అందులో 10 మంది పిల్లలకు ఇప్పటికే క్యాన్సర్ వచ్చింది. ఇందులో కొన్ని తీవ్రమైన రకాలైన లుకేమియా, నాన్-హాడ్కిన్ లింఫోమా ఉన్నాయని వైద్యులు నిర్ధారించారు.
ఇది ఎలా బయటపడింది?
ఇద్దరు తల్లిదండ్రులు, వారి పిల్లలకు చిన్న వయసులోనే క్యాన్సర్ రావడంతో, వారు తమ ఫెర్టిలిటీ క్లినిక్‌ను సంప్రదించారు. ఇద్దరూ వేరే ప్రాంతాల్లో ఉన్నా, వారు ఉపయోగించిన వీర్యం ఒకే వ్యక్తిదని తెలిసింది. ఇక్కడినుంచి విచారణ ప్రారంభమై, డాక్టర్ ఎడ్విజ్ కాస్పర్ నేతృత్వంలో, వీర్యం ద్వారా పుట్టిన పిల్లల వివరాలు సేకరించడంతో ఈ వివరాలు బయటపడ్డాయి.
వీర్య దాతలపై నియంత్రణలు లేకపోవడం వల్లేనా?
ఈ కేసు అంతర్జాతీయ స్థాయిలో ఒక పెద్ద ప్రశ్నను లేవనెత్తింది. ఇప్పటివరకు ఒక దాత వీర్యం ఎంతమంది పిల్లలకు ఉపయోగించాలో గరిష్ట పరిమితి ఉండదు. కొన్ని దేశాల్లో పరిమితులు ఉన్నా, అవి ఇతర దేశాలకు వర్తించవు. ఈ దాత వీర్యాన్ని అనేక దేశాల్లో ఉపయోగించడం వల్ల, ఎంతమంది పిల్లలు పుట్టారో ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఉంది.
యూరోపియన్ స్పెర్మ్ బ్యాంక్ ప్రకారం, వారు తమ రూల్ ప్రకారం ఒక దాతకు గరిష్టంగా 75 కుటుంబాల పరిమితి పెట్టారు. కానీ ఈ దాత కేసులో ఇది దాటి ఉండొచ్చనే అనుమానాలున్నాయి. క్లినిక్‌లు కూడా ఖచ్చితంగా ఎంతమందికి ఈ వీర్యం ఉపయోగించారో వెల్లడించడంలో జాప్యం చేస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి.
Also Read: Visakha City: విశాఖకు ఫుల్ జోష్.. సూపర్ ప్రాజెక్ట్ వస్తోంది.. నగరంలో ఇక సందడే సందడి!
పిల్లలకు భవిష్యత్తులో ఏం జరగొచ్చు?
ఈ జన్యు మార్పు ఉన్న పిల్లలు తీవ్రమైన క్యాన్సర్లకు లోనయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల వారికి తరచూ MRI స్కాన్లు, మెదడు, రొమ్ము, పేగుల స్కాన్లు వంటి పరీక్షలు చేయాల్సిన అవసరం ఉంది. ఇది కుటుంబాలపై ఆర్థికంగా, మానసికంగా పెద్ద భారంగా చెప్పవచ్చు.
ఇకనైనా మారాలని నిపుణుల హితవు
ప్రొఫెసర్ నిక్కీ హడ్సన్, ఈ ఘటన ద్వారా ఒకే దాత నుండి పెద్ద సంఖ్యలో పిల్లలు పుట్టడం వల్ల వచ్చే సమస్యలు హైలైట్ అయ్యాయని చెప్పారు. ఇలాంటి విషయంలో అంతర్జాతీయ స్థాయిలో ఒక సమన్వయం అవసరం. కనీసం దాతల వీర్యం ఎక్కడెక్కడ ఉపయోగించబడిందో ట్రాక్ చేసే వ్యవస్థ ఉండాలని ఆయన సూచించారు.
వీర్య దానం మంచిదే అయినా, అది నియంత్రణ లేకుండా జరిగితే ప్రాణహాని కలిగించే పరిణామాలు వస్తాయి. జన్యు స్క్రీనింగ్ మరింత కఠినంగా ఉండాలి. దాతలు ఎంతమందికి ఉపయోగించారో స్పష్టంగా రికార్డ్ ఉండాలి. అంతేకాదు, ఈ సమాచారం గ్రహీతలకు కూడా తెలియజేయాల్సిన బాధ్యత బ్యాంకులపై ఉంది. ఈ సంఘటన ఒక హెచ్చరిక మాత్రమే కాదు.. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలంటే, ఇప్పటి నుంచే మారాలి. లేకపోతే, మరో 67 మంది పిల్లల జీవితాలు మళ్లీ ప్రమాదంలో పడొచ్చు.. తస్మాత్ జాగ్రత్త!