Flydubai FZ1073 Attack: దుబాయ్ నుండి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ (FZ 1073) విమానంలో కెప్టెన్‌పై దాడి చేసి విమానాన్ని కూల్చివేసేందుకు లేదా హైజాక్ చేసేందుకు కో-పైలట్ ప్రయత్నించిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. ఈ దాడికి పాల్పడిన కో-పైలట్ ఒమన్ దేశానికి చెందిన పౌరుడని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియాన్ సార్ (Gideon Sa’ar) ప్రకటించారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కీలక విషయాలను వెల్లడించారు. ఇది స్పష్టంగా జిహాదీ ఉగ్రవాద దాడి అని అభివర్ణించారు.
ఈ ఘటనలో భారతీయ పైలట్, కెప్టెన్ స్మిత్ మచ్చార్ (Smit Machchhar) అత్యంత సాహసోపేతంగా వ్యవహరించారు. కో-పైలట్ తనపై పదునైన ఆయుధంతో దాడి చేసినప్పటికీ తీవ్ర గాయాలతోనే ఆయన కాక్‌పిట్ తలుపులను తెరవగలిగారు. ఈ సమయస్ఫూర్తే విమానంలోని ప్రయాణికులకు, ఇతర సిబ్బందికి లోపలికి వెళ్లే అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి స్మిత్ ధైర్యసాహసాలను కొనియాడుతూ.. ‘రక్తమోడుతున్నా ఆయన చూపిన చొరవ వల్లే వందలాది ప్రాణాలు కాపాడబడ్డాయి’ అని ప్రశంసించారు. ఉగ్రవాదంపై పోరులో భారత్, ఇజ్రాయెల్ ప్రజల ఐక్యతకు ఇది నిదర్శనమని ఆయన ప్రశంసించారు.
మరోవైపు కెప్టెన్ స్మిత్ కాక్‌పిట్ తలుపులు తెరవగానే విమానంలో ఉన్న ఇజ్రాయెల్ ప్రయాణికులు అత్యంత వేగంగా స్పందించారు. ప్రాణాలకు తెగించి దాడికి పాల్పడిన ఒమన్ కో-పైలట్‌పైకి దూకి అతడిని కదలకుండా పట్టుకున్నారు. అదే సమయంలో విమానంలో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు బ్యాకప్ పైలట్లు తక్షణమే కాక్‌పిట్ బాధ్యతలను స్వీకరించి, విమానాన్ని సురక్షితంగా సౌదీ అరేబియాకు మళ్లించారు. అత్యంత క్లిష్టమైన పరిస్థితి నుంచి విమానం సురక్షితంగా బయటపడటం నమ్మశక్యం కాని అద్భుతమని గిడియాన్ సార్ వ్యాఖ్యానించారు.
ఈ దాడి వెనుక మూడు ప్రధాన లక్ష్యాలు ఉన్నాయని ఇజ్రాయెల్ ప్రాథమికంగా భావిస్తున్నట్లు గిడియాన్ సార్ తెలిపారు. ‘మొదటిది వీలైనంత ఎక్కువ మంది ఇజ్రాయెల్ పౌరులను బలితీసుకోవడం. రెండోది ఇజ్రాయెల్-యూఏఈ మధ్య వికసిస్తున్న దౌత్య సంబంధాలను, అబ్రహం ఒప్పందాలను (Abraham Accords) దెబ్బతీయడం. మూడోది యూఏఈకి చెడ్డ పేరు తీసుకురావడం. ఈ కుట్ర వెనుక ఎవరున్నారనేది ఇంకా పూర్తిస్థాయిలో తేలనప్పటికీ, దర్యాప్తు ద్వారా త్వరలోనే నిజాలు బయటకు వస్తాయి’ అని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి స్పష్టం చేశారు.
Also Read: టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా? ఈ 5 విషయాలు తెలియకపోతే నష్టపోతారు!
ప్రస్తుతం దాడికి పాల్పడిన కో-పైలట్ సౌదీ అరేబియా కస్టడీలో ఉన్నాడని, ప్రాథమిక విచారణ అనంతరం అతడిని యూఏఈకి అప్పగించనున్నారని తెలుస్తోంది. నిందితుడిని తమకు అప్పగించాలని (extradition) ఇజ్రాయెల్ డిమాండ్ చేస్తోంది. కాగా, ఈ ఘటనపై యూఏఈ విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లాతో మాట్లాడినట్లు గిడియాన్ సార్ తెలిపారు. ఉగ్రవాదుల కుట్రలకు భయపడేది లేదని, ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Also Read: అనకొండ vs కొండ చిలువ.. పాముల్లో నిజమైన కింగ్ ఏది? దేని దమ్ము ఎంత?