Hamas Releases Israel Hostages | గాజాలో అమల్లోకి వచ్చిన కాల్పుల విరమణ ఒప్పందం క్రమంలో ఇజ్రాయెల్‌కు చెందిన ముగ్గురు బందీలను హమాస్ విడుదల చేసింది. ఈ బందీలను గాజాకు చేరుకున్న రెడ్ క్రాస్ ప్రతినిధులకు ఆదివారం జనవరి 19, 2025న అప్పగించింది. అనంతరం వారు బందీలను ఇజ్రాయెల్ సైన్యానికి అప్పగించారు. విడుదలైన వారిలో రోమి గోనెన్ (24), ఎమిలీ దమారీ (28), డోరాన్ స్టెయిన్‌బ్రేచర్ (31)లు ఉన్నారు. ఈ పరిణామంతో ఇజ్రాయెల్ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.
అయితే, గాజాలో శాంతి ఒప్పందం అమల్లోకి వచ్చే ప్రక్రియలో మూడు గంటలు ఆలస్యం జరిగింది. హమాస్ నుంచి ఇజ్రాయెలీ బందీల జాబితా విడుదలలో జరిగిన జాప్యం కారణంగా ఒప్పందం అమలు కూడా ఆలస్యంగా జరిగింది. సోషల్ మీడియా వేదికగా ఈ జాబితాను హమాస్ విడుదల చేసింది. ఈ జాబితాను ఇజ్రాయెల్ అంగీకరించడంతో, ఒప్పందం అమలుకు మార్గం సుగమమైంది. ఒప్పందం అమలైన సందర్భంగా గాజాలో ప్రజలు ర్యాలీలు తీశారు. చాలామంది ప్రజలు తమ స్వస్థలాలకు పయనమయ్యారు.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య 15 నెలలుగా సాగుతున్న యుద్ధం నేపథ్యంలో తాజాగా కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయితే ఈ ఒప్పందంపై ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రపంచంలో ఎవరూ ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించడానికి ప్రయత్నించినా, ఇజ్రాయెల్ సహించదు. ఒకవేళ ఒప్పందం ఎవరైనా ఉల్లంఘిస్తే హమాస్ అందుకు బాధ్యత వహించాలి. ఉల్లంఘన జరిగితే మళ్లీ యుద్ధం ప్రారంభించేందుకు ఇజ్రాయెల్ హక్కు కలిగి ఉంది ’’ అని ఆయన తెలిపారు.
Also Read: టిక్ టాక్ ఇక మస్క్ చేతికి?.. విక్రయించే యోచనలో చైనా
ఇజ్రాయెల్ మరియు హమాస్ మధ్య ఒప్పందం కుదిరిన తరువాత, ఈ ఒప్పందం స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 8:30 గంటలకు అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందానికి అమెరికా, ఈజిప్టు, ఖతార్ వంటి దేశాలు మధ్యవర్తిత్వం చేశాయి. ఇజ్రాయెల్ క్యాబినెట్ కూడా ఈ ఒప్పందానికి ఆమోదం తెలిపింది. ఒప్పందం మూడు దశల్లో అమలవుతుంది.
మొదటి దశలో 42 రోజుల పాటు కాల్పుల విరమణ కొనసాగుతుంది. ఈ దశలో హమాస్ 33 మంది ఇజ్రాయెలీ బందీలను విడుదల చేస్తుంది, అలాగే ప్రతిగా ఇజ్రాయెల్ 737 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేస్తుంది. 2023 అక్టోబరు 7న హమాస్ చేసిన దాడులతో సంబంధం లేని 1,167 మంది గాజా వాసులకు కూడా స్వేచ్ఛ కల్పించబడుతుంది. మొదటి దశలో ఇజ్రాయెల్ దళాలు జనావాస ప్రాంతాల నుంచి వైదొలగుతాయి, అలాగే గాజాలోకి మానవతా సాయం రూపంలో ఆహారం, నీరు ఇతర మౌలిక అవసరాలను అందించేందుకు ఇజ్రాయెల్ సైన్యం అనుమతిస్తుంది.
రెండవ దశలో మిగిలిన బందీలను హమాస్ విడుదల చేస్తుంది, కానీ ఇందుకు ఇజ్రాయెల్ కాల్పుల విరమణను శాశ్వత కాల్పుల విరమణగా మార్చేందుకు అంగీకరించాలి. ఇదే ఇజ్రాయెల్ అభిప్రాయం, కాగా, హమాస్ ఈ ఒప్పందాన్ని మరింత కట్టుదిట్టంగా అమలు చేయాలని కోరుకుంటుంది.
మరోవైపు కాల్పల విరమణకు అంగీకరించినందుకు నిరసనగా ఇజ్రాయెల్ మంత్రి ఇతమార్ బెన్ గ్విర్ రాజీనామా చేశారు. ఆయన జువెష్ పార్టీకి చెందిన నాయకుడు. ప్రధాని నెతన్యాహు ప్రభుత్వంలో జువెష్ పార్టీ కూడా భాగస్వామి. కానీ ఇప్పుడు గాజాలో కాల్పుల విరమణను వ్యతిరేకిస్తూ.. ఈ పార్టీ అధికార కూటమి నుంచి వైదలగింది. కానీ ప్రభుత్వాన్ని కూలదీసే ప్రయత్నం చేయబోమని ప్రకటించింది.