Elon Musk Buy Tik Tok | ప్రపంచంలో ప్రముఖ షార్ట్ వీడియో యాప్‌గా పేరుగాంచిన టిక్‌టాక్ (TikTok) ప్రస్తుతం అమెరికాలో నిషేధ ముప్పును ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో, టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్ (ByteDance) ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోంది. అందులో భాగంగా టిక్‌టాక్ అమెరికా కార్యకలాపాలను ఎలన్ మస్క్ (Elon Musk) చేతికి విక్రయించే అంశం చర్చకు వచ్చింది. ఈ సమాచారం ‘బ్లూమ్‌బర్గ్ న్యూస్’ కథనంలో చైనా అధికారిక వర్గాలను ఉటంకిస్తూ వెల్లడించారు.
‘‘టిక్‌టాక్‌ను మాతృసంస్థ బైట్‌డ్యాన్స్ ఆధీనంలో ఉంచడమే మా ప్రథమ లక్ష్యం. అయితే, అది సాధ్యం కాకపోతే, ఇతర మార్గాలను పరిశీలిస్తాము. అందులో ఎలన్ మస్క్‌కు టిక్‌టాక్ యాజమాన్యాన్ని విక్రయించటం కూడా ఒక ప్రయోజనకరమైన మార్గంగా ఉంది,’’ అని టిక్‌టాక్ ప్రతినిధులు పేర్కొన్నారు.
2017లో ప్రారంభమైన టిక్‌టాక్ ఇప్పటికే భారత్ సహా అనేక దేశాల్లో నిషేధానికి గురైంది. ప్రస్తుతం అమెరికాలో కూడా టిక్‌టాక్‌పై ఆంక్షలు ఉన్నాయి. 2024లో అమెరికా ప్రతినిధుల సభ.. టిక్ టాక్ యాప్‌పై నిషేధం విధించే బిల్లుకు ఆమోదం తెలిపింది. జనవరి 19, 2025 నాటికి టిక్‌టాక్ అమెరికా కార్యకలాపాలను విక్రయిస్తారా లేదా నిషేధాన్ని ఎదుర్కొంటారా అనే నిర్ణయం తీసుకోవాలని అమెరికా సుప్రీంకోర్టు సూచించింది.
అయితే, టిక్‌టాక్ సంస్థ ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టులో అప్పీల్ చేసింది. కానీ చట్టపరమైన పరిస్థితులు చూస్తే.. టిక్‌టాక్‌పై నిషేధం విధించేందుకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది.
డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అవుతున్న నేపథ్యంలో
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడంతో టిక్‌టాక్ పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. జనవరి 20, 2025 నాటికి ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన గతంలో అధ్యక్షుడిగా ఉన్న సమయంలో టిక్‌టాక్ డేటాని చైనా దుర్వినియోగం చేస్తోందని కారణాలు చూపుతూ.. పలుమార్లు నిషేధానికి ప్రయత్నించారు. అయితే ఇందుకు భిన్నంగా ప్రస్తుతం.. ట్రంప్ ప్రతినిధులు టిక్‌టాక్ నిషేధంపై స్టే విధించాలని కోర్టుని కోరుతూ అప్పీల్ చేశారు.
టిక్‌టాక్ అమెరికా కార్యకలాపాలు మస్క్ చేతికి అందే అవకాశాలు
ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడైన ఎలన్ మస్క్ టిక్‌టాక్ అమెరికా కార్యకలాపాలను కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. టిక్‌టాక్‌ను సగం అమెరికా జనాభా వినియోగించుకుంటోంది. టిక్‌టాక్ అమెరికా కార్యకలాపాల ద్వారా సంస్థకు 40 బిలియన్ డాలర్ల ఆదాయం వస్తోంది. అయితే, యాప్‌పై నిషేధం విధిస్తే కంపెనీకి భారీ నష్టం వాటిల్లనుంది.
Also Read: అభిశంసనకు గురైన ప్రెసిడెంట్.. అయినా జీతం పెంచారు!
చైనా వ్యూహం
టిక్‌టాక్ సంస్థ అయిన బైట్‌డ్యాన్స్.. షేర్‌హోల్డర్లలో చైనా భాగస్వామ్యంతో పాటు ఇతర దేశాల పెట్టుబడిదారుల అభిప్రాయాలను కూడా దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోనుంది. ఎలన్ మస్క్ టిక్‌టాక్‌ను చేజిక్కించుకుంటే, అది అమెరికా యూజర్ల డేటాను సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుందనే అభిప్రాయాలు ఉన్నాయి.
టిక్‌టాక్ అంశంపై మస్క్ వ్యూహాలు
ఎలన్ మస్క్ టిక్‌టాక్ ను కొనుగోలు చేస్తే, ఆ ప్లాట్‌ఫార్మ్‌ను సోషల్ మీడియా విభాగంలో అత్యంత శక్తివంతమైన యాప్‌గా మార్చే అవకాశాలు ఉన్నాయి. టిక్‌టాక్ కార్యకలాపాలను కొనుగోలు చేయడం ఎలన్ మస్క్‌కు వ్యాపారపరంగా ఎంతో లాభదాయకం అవుతుందని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. టిక్‌టాక్ భవిష్యత్‌ను ఈ పరిణామాలు ఎలా ప్రభావితం చేస్తాయో చూడాలి.