India Reduce US Tariffs| అమెరికా నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై భారత ప్రభుత్వం శనివారం సుంకాలు తగ్గించింది. అయితే భారత్ (India) అత్యధికంగా సుంకాలు విధిస్తున్న దేశంగా తాను బహిరంగంగా చెప్పడం వల్లే.. ఆ దేశం ఆందోళన చెంది సుంకాలను తగ్గించడానికి (Tariff cuts) అంగీకరించిందని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)ఇటీవల పేర్కొన్నారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలను భారత విదేశాంగ, వాణిజ్య శాఖ అధికారిక వర్గాలు మాత్రం తోసిపుచ్చుతున్నట్లు సమాచారం. సుంకాల తగ్గింపునకు చర్యలు నిజమే అయినప్పటికీ, ఆయన ఆరోపణలతో తాము ఈ నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలతో వాణిజ్య సంబంధాలను పెంపొందించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించాయి.
“గతంలో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాల నేపథ్యంలో భారత్ వరుసగా ఆస్ట్రేలియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, స్విట్జర్లాండ్, నార్వే వంటి దేశాలపై సుంకాలను తగ్గించింది. ప్రస్తుతం యురోప్ యూనియన్, యూకేతోనూ భారత్‌కు పలు ఒప్పందాల కోసం చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అగ్రరాజ్యంతో వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి వీటిని తగ్గించాలని న్యూదిల్లీ నిర్ణయం తీసుకుంది. అంతే కానీ, అమెరికా భారత్‌పై విధించనున్న సుంకాల అమలుకు సమయం దగ్గరపడుతున్నందుకు కాదు” అని భారత అధికారులు చెబుతున్నట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
Also Read: ట్రంప్ మంత్రివర్గ సమావేశంలో కుమ్ములాట.. మస్క్, రూబియో ఒకరిపై మరొకరు విసుర్లు
నివేదికల ప్రకారం.. వ్యవసాయ ఉత్పత్తులు మినహా దాదాపు అన్ని వస్తువులపై సుంకాలను తొలగించాలని అమెరికా భారత్‌ను కోరింది. భారత్‌కు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. గత ఆర్థిక సంవత్సరంలో ద్వైపాక్షిక వాణిజ్యం రికార్డు స్థాయిలో 118.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ సంఖ్యను 2030 నాటికి 500 బిలియన్ డాలర్లకు చేర్చాలనే లక్ష్యం దిశగా భారత్ అడుగులు వేస్తోంది. గత నెల ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళ్లిన సమయంలో 2025 చివరి నాటికి, ఇరుదేశాల మధ్య పరస్పరం ప్రయోజనకరమైన బహుళ రంగాల ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA) తొలిదశపై చర్చలు జరపడానికి ట్రంప్ అంగీకరించారు. ఇందులో భాగంగానే మరిన్ని వస్తువులకు మార్కెట్‌ను తెరవడం, సుంకాల అడ్డంకులను తొలగించడానికి ఇరుదేశాల నేతలు ఒప్పందం చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
అయితే చైనా, భారత్ సహా పలు దేశాలపై ప్రతీకార సుంకాలు విధిస్తామని ట్రంప్ పలుమార్లు పేర్కొన్న విషయం తెలిసిందే. ట్రంప్ వైట్ హౌస్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, “పన్నులను తగ్గించడానికి భారత్ అంగీకరించింది. భారత్ అధిక సుంకాలు విధించే దేశం. అమెరికా వస్తువులపై భారత్ భారీగా సుంకాలు విధిస్తోంది. భారత్ విధిస్తున్న సుంకాలు ఇలాగే కొనసాగితే అమెరికాకు చెందని ఏ ఒక్క వస్తువును కూడా అక్కడ విక్రయించలేం. అధిక పన్నుల వల్ల భారత్‌కు ఏదైనా ఓ వస్తువును విక్రయించడం దాదాపు అసాధ్యంగా మారింది. అమెరికా ఉత్పత్తులపై 100 శాతం కంటే ఎక్కువ ఆటో సుంకాలను భారత్ వసూలు చేస్తోంది. కొన్ని దశాబ్దాలుగా ఇదే కొనసాగుతోంది. అందుకే మేము కూడా సుంకాలు విధించాలనే నిర్ణయానికి వచ్చాం. ప్రతీకార సుంకాలు అమలు చేస్తాం. ఈ పరిణామాలోతనే మా దేశ ఉత్పత్తుల పై విధించిన టారిఫ్‌ను తగ్గించడానికి భారత ప్రభుత్వం అంగీకరించింది. నేను ఎవరికి నిందించడం లేదు. వ్యాపారం చేయడానికి ఇది వేరొక మార్గం మాత్రమే” అని చెప్పుకొచ్చారు.
ఏప్రిల్ 2న భారత్, చైనాలపై విధించే సుంకాలు, అమెరికా దశను మార్చనున్నాయని అన్నారు. అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. సుంకాలు, సుంకాలేతర అడ్డంకులను అధిగమించడానికి బీటీఏ కింద అమెరికాతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటామని పేర్కొంది.