Elon Musk Marco Rubio| అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షతన జరిగిన తాజా కేబినెట్ మీటింగ్‌లో పెద్ద గొడవ జరిగింది. ట్రంప్ సమక్షంలోనే వైట్ హౌస్ సలహాదారు ఎలాన్ మస్క్, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియో (Marco Rubio) వాగ్వాదానికి దిగారు.
స్టేట్ డిపార్ట్మెంట్‌లో ఉద్యోగులను ఎందుకు తొలగించకలేదని రుబియోపై మస్క్ చిందులు తొక్కారు. ట్రంప్ ఏరికోరి నియమించుకున్న వ్యక్తి కేవలం టీవీల్లో కనిపించడంపైనే దృష్టి సారిస్తున్నారని సెటైర్‌లు వేశారు. అయితే.. మస్క్ అబద్ధాలు చెబుతున్నారని ఆయన ముఖం మీదే రుబియో కౌంటర్‌లు ఇచ్చారు. దీంతో అందరి ముందు ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది.
స్టేట్ డిపార్ట్మెంట్ నుంచి 1,500 మంది ఉద్యోగులను ఇప్పటికే తొలగించామని (Layoffs) చెప్పి.. ఒకవేళ వాళ్ళందరినీ తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకుని మళ్లీ తొలగించాలని మస్క్ భావిస్తున్నారేమోనని వెటకారంగా రుబియో సమాధానం ఇచ్చారు. ఆ తరువాత మస్క్ కూడా మాటకు మాట అని కాసేపు ఆయన పనితీరుపై విమర్శలు చేశారు. అయితే ట్రంప్ మాత్రం ఒకానొక సమయంలో రుబియోకి మద్దతుగా నిలిచినట్లు సమాచారం.
Also Read: ట్రంప్ మళ్లీ ఎసేశాడు.. ఈసారి పాకిస్తాన్‌కు ఝలక్
ఈ కేబినెట్ సమావేశంలో పాల్గొన్న అధికారులంతా మస్క్‌పై ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. మస్క్ చర్యలతో రిపబ్లికన్‌లలోనూ అసహనం పెరిగిపోతోందని, ఈ క్రమంలోనే వైట్ హౌస్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని చీఫ్ ఆఫ్ స్టాఫ్ సుసీ వైల్స్ మీటింగ్‌లో ప్రస్తావించారు. ఈ మేరకు గురువారం కేబినెట్ మీటింగ్‌లో జరిగిన అంశాలన్నింటిని ప్రస్తావిస్తూ న్యూయార్క్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది.
మీడియపై ట్రంప్ ఫైర్
కేబినెట్ మీటింగ్ లో అంతా రచ్చ జరిగిందని వచ్చిన మీడియా కథనాన్ని ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఖండించారు. ఓవల్ ఆఫీస్‌లో శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘‘నేను అక్కడే ఉన్నా కదా. అక్కడ ఎలాంటి ఘర్షణ జరలేదు. మీరే (మీడియాను ఉద్దేశించి) లేనిపోనివి సృష్టిస్తున్నారు. ఎలాన్, మార్కో. ఇద్దరూ ప్రతిభావంతులే.. వాళ్ళు తమ విధులను అద్భుతంగా నిర్వర్తిస్తున్నారు’’ అని ట్రంప్ ఇద్దరినీ ప్రశంసించారు.
డోజెపై తీవ్ర విమర్శలు.. మస్క్ ఏమన్నారంటే..
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత రిపబ్లికన్ నాయకుడు డొనాల్డ్ ట్రంప్.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌ను డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (DOGE) సారథిగా నియమించారు. అమెరికా ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులే ‘డోజె’ ప్రాజెక్టు లక్ష్యమని, తన ప్రభుత్వంలో సమర్థత పెంచేందుకు ఈ విభాగం కృషి చేస్తుందని ఆ సమయంలో ట్రంప్ ప్రకటించారు.
ప్రభుత్వ శాఖల్లో వృథా ఖర్చులకు కత్తెర, దుబారా ఖర్చులకు కోత, అవినీతి నిర్మూలన, ఫెడరల్ సంస్థలను పునర్మిర్మాణం.. ఇవన్నీ డోజె చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా.. ప్రభుత్వ శాఖల్లో భారీగా ఉద్యోగాల తొలగింపు చేపట్టారు. అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవం, 2026 జులై 4వ తేదీలోపు మొత్తం ఫెడరల్ బ్యూరోక్రసీని ఇది ప్రక్షాళన చేయాల్సి ఉంది. ఆ తర్వాత డోజె దానికదే ఎక్స్‌పైరీ కానుంది.
అయితే, డోజె తీసుకునే తీవ్రమైన నిర్ణయాల వల్ల దేశ రక్షణ, మౌలిక సదుపాయాల కల్పన వంటి ప్రభుత్వం అందించే సేవలు నిర్వీర్యం అయ్యే అవకాశం ఉందని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. కానీ ఇందుకు వ్యతిరేకంగా.. దీర్ఘకాలిక అభివృద్ధి కావాలంటే, కొన్నింటిని వదులుకోవాలని మస్క్ తన చర్యలను సమర్థించుకుంటున్నారు.