India Halts Pakistan Exports| ఇండియా, పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తల కారణంగా అంతర్జాతీయ స్థాయిలో పాకిస్తాన్ లేనిపోని కష్టాలు తెచ్చుకుంది. ముందే ఆర్థికంగా కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్.. భారత్ తో తలపడడంతో ఆ కష్టాలు మోయలేని భారంగా మారాయి. యుద్ధ ప్రణాళికలో భాగంగా భారత్ తీసుకున్న ఒక ముఖ్యమైన నిర్ణయం వల్ల పాకిస్థాన్ ఆర్థికంగా, వాణిజ్యపరంగా సమస్యల్లో కూరుకుపోయింది. ఆపరేషన్ సింధూర్ తరువాత పాకిస్థాన్ నుంచి ఇతర దేశాలకు వెళ్లే ఎగుమతి షిప్పులు తమ ఓడరేవుల ద్వారా వెళ్లడంపై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. పాకిస్తాన్ సరుకు రవాణాను పూర్తిగా నిషేధించింది. ఈ నిషేధం పాకిస్థాన్ దిగుమతులు, ఎగుమతులపై పెద్ద ఎత్తున ప్రభావం చూపింది.
ఈ నిషేధం వల్ల పాకిస్థాన్ నుంచి ఇతర దేశాలకు వెళ్లే సరుకులను తీసుకెళ్లే పెద్ద షిప్పింగ్ కంపెనీలు తమ సేవలను నిలిపివేశాయి. చివరకు పాకిస్తాన్ చిన్న ఫీడర్ ఓడలపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ సమస్య ముఖ్యంగా యురోప్ దేశాలతో జరిగే పాకిస్తాన్ వాణిజ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. ముఖ్యంగా భారత్‌లోని ముంద్రా ఓడరేవు, పాకిస్తాన్ నుంచి యూరప్‌కు వెళ్లే సరుకులకు మధ్యవర్తిగా (ట్రాన్స్‌షిప్‌మెంట్ కేంద్రం) ఉండేది. కానీ, పాకిస్థాన్ ఉగ్రవాదులు పహల్గాంలో భారత పర్యాటకులను దారుణంగా హతమార్చిన తరువాత ప్రతీకార చర్యగా భారత్ ఆపరేషన్ సింధూర్‌ను విజయవంతంగా నిర్వహించింది. ఆ తరువాతే పాకిస్తాన్ సరుకు రవాణాను నిలిపివేసింది.
పాకిస్తాన్ షిప్పింగ్ కంపెనీలు ఇప్పుడు కొలంబో, సలాలా, జెబెల్ అలీ వంటి ఇతర ఓడరేవుల ద్వారా సరుకులను రవాణా చేస్తున్నాయి. ఈ ప్రక్రియ వల్ల బీమా ఖర్చులు చాలా ఎక్కువ అవుతున్నాయి. అంతేకాక, పాకిస్తాన్ వ్యాపారులు మరిన్ని కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఎగుమతుల కోసం కంపెనీలు బ్యాంకు గ్యారంటీలు ఇవ్వాలని వారిపై ఒత్తిడి చేస్తున్నాయి. ఇది వాణిజ్య కార్యకలాపాలను మరింత కష్టతరం చేస్తోంది.
సరుకుల నిల్వలు పేరుకుపోవడం
పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే కష్టాల్లో ఉంది. ఈ నిషేధం వల్ల ముఖ్యమైన పరికరాలు, ముడిసరుకులు, యంత్రాల దిగుమతులు ఆలస్యమవుతున్నాయి. ధాన్యాలు, వస్త్రాల వంటి ఎగుమతులు కూడా దెబ్బతింటున్నాయి. ఈ పరిస్థితి కారణంగా పాకిస్తాన్ లోని వివిధ ఓడరేవుల వద్ద సరుకు కంటైనర్లు పేరుకుపోతున్నాయి. దీంతో సరుకుల రవాణా ఒకటి నుంచి మూడు రోజుల వరకు ఆలస్యమవుతోందని వ్యాపారులు చెబుతున్నారు.
Also Read: హోంమంత్రి ఇంటికి నిప్పు.. పాకిస్తాన్‌లో తిరుగుబాటు
ఈ నిషేధం వల్ల పాకిస్తాన్ ఆర్థికంగా బలహీనపడుతోంది. దిగుమతులు, ఎగుమతులు తగ్గడంతో వ్యాపారులు, కంపెనీలు నష్టపోతున్నాయి. భారత్ తీసుకున్న ఈ నిర్ణయం పాకిస్తాన్ వాణిజ్యానికి చాలా పెద్ద దెబ్బ. ఈ సమస్యల నుంచి బయటపడేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం, వ్యాపారులు కొత్త మార్గాలను వెతకాల్సిన అవసరం ఉంది. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో అది అంత సులభం కాదు.