రైల్వే ప్రాంగణాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ఇండియన్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఉమ్మివేసినా, చెత్తవేసినా, సిగరెట్లు తాగిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. రైల్వే పరిసరాల్లో పరిశుభ్రతను కాపాడుకోవడానికి, బాధ్యతాయుతమైన ప్రవర్తనను ప్రోత్సహించడానికి తూర్పు రైల్వే (ER) కీలక చర్యలు తీసుకుంటున్నది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి పెద్ద మొత్తంలో జరిమానాలు విధిస్తోంది. ఈ ఏడాది మొదటి మూడు నెలల్లోనే స్టేషన్ కాంప్లెక్స్ లలో ఉమ్మి, చెత్త వేస్తూ పట్టుబడిన వ్యక్తుల నుంచి రూ.32 లక్షలకు పైగా జరిమానాలు వసూలు చేసింది.
ప్రయాణీకులలో మార్పు కోసం కఠిన చర్యలు
గత ఏడాది(2024) డిసెంబర్ వరకు ప్రయాణీకులలో అవగాహన కల్పించిన తూర్పు రైల్వే.. జవనరి 2025 నుంచి పెద్ద మొత్తంలో జరిమానాలు విధిస్తోంది. జనవరి నుంచి మార్చి నెల చివరి వరకు రైల్వే స్టేషన్లలో అపరిశుభ్రతకు కారణమైన 31, 576 మందికి జరిమానా విధించారు. వీరి నుంచి ఏకంగా రూ. 32,31,740 పైన్ వసూళు చేశారు. “ఈ చర్యలు కేవలం క్రమ శిక్షణ గురించి మాత్రమే కాదు, దీర్ఘకాలికంగా ప్రయాణీకుల ప్రవర్తనలో మార్పు తీసుకురావాడానికి ఉద్దేశించినవి. ఇకపై రైల్వే స్టేషన్లలో ఉమ్మి, చెత్త వేయాలన్నా, సిగరెట్ తాగాలన్నా భయపడేలా జరిమానాలు విధిస్తున్నాం. కోల్ కతాలో తూర్పు రైల్వే ప్రధాన కార్యాలయం ఉండగా, మా నెట్ వర్క్ అంతటా పరిశుభ్రతను పెంపొందించేదుకు ఈ నిర్ణయం తీసుకున్నాం” అని రైల్వే అధికారులు వెల్లడించారు. “రైల్వే స్టేషన్లను శుభ్రంగా ఉంచుకునేలా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, కొంతమంది ప్రయాణీకులు ఇప్పటికీ అపరిశుభ్రమైన పనులకు పాల్పడుతూనే ఉన్నారు. అలాంటి వారిలో మార్పు తీసుకురావడం కాస్త కష్టంగా అనిపిస్తోంది. అయినప్పటికీ, జరిమానాలతో వారిలోనూ మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం” అన్నారు.
Read Also: హైదరాబాద్ నుంచి ఆ సిటీకి స్పెషల్ రైళ్లు, దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం!
పరిశుభ్రతను కాపాడే ప్రయాణీకులకు గులాబీలు
రైల్వే స్టేషన్లను అపరిశుభ్రంగా మార్చే వారికి జరిమానా విధించడంతో పాటు పరిశుభ్రతను కాపాడే వారికి గులాబీలను ఇస్తూ అభినందిస్తున్నారు. పరిశుభ్రతను పాటించే ప్రయాణీకులు, విక్రేతలకు రైల్వే అధికారులు ప్రశంసలతో పాటు ప్రోత్సాహానికి చిహ్నంగా గులాబీలను అందిస్తున్నారు. తూర్పు రైల్వే కూడా ప్రయాణీకులకు, విక్రేతలకు పరిశుభ్రత ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించే లక్ష్యంతో స్టేషన్లలో విస్తృతమైన అవగాహన ప్రచారాలను ప్రారంభించింది. ఆరోగ్య సిబ్బంది, రైల్వే రక్షణ దళం (RPF), స్టేషన్ ఉద్యోగుల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. “ప్రయాణీకులలో అవగాహన అనేది ఒకేసారి కలగదు. కానీ, కొద్ది కాలం తర్వాత కచ్చితంగా మార్పు వస్తుంది. పరిశుభ్రత గురించి అవగాహన ఏర్పడుతుంది. అందుకు జరిమానాలు కూడా ఉపయోగపడుతాయి. ప్రచార కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఇకపై రైల్వే ప్రయాణీకులు రైల్వే స్టేషన్లలో చెత్త, ఉమ్మి వేయకుండా జాగ్రత్త పడాలి” అని రైల్వే అధికారులు సూచించారు. పద్దతి మార్చుకోని ప్రయాణీకులకు జరిమానాలు అనేవి తప్పవని హెచ్చరించారు. రైల్వే సూచనలు పాటించి ప్రయాణాలను మరింత ఆహ్లాదకరంగా మార్చుకోవాలని సూచించారు.
Read Also: రైల్వే టికెట్ల రిజర్వేషన్ వెనుక ఇంత కథ ఉంటుందా? మీరు అస్సలు ఊహించి ఉండరు!