Indonesia ship fire: సముద్రంలో ప్రయాణం సాగుతూ ఉంది. ఆ నౌకలో అందరూ తెగ సందడి చేస్తున్నారు. అంతలో మంటలు.. అసలేమైందో గుర్తించేలోగా అగ్ని ఎగిసిపడుతోంది. భయాందోళనతో కొందరు నౌకలో నుండి సముద్రంలోకి దూకేశారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఇండోనేషియాలోని ఉత్తర సులవేసి ప్రావిన్స్ సముద్ర జలాల్లో ఓ పెద్ద ప్రమాదం చోటు చేసుకుంది. కేఎం బార్సిలోనా 5 (KM Barcelona 5) అనే ప్రయాణికుల నౌక, మెనడో నగరానికి సమీపంలో ప్రయాణిస్తుండగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో చోటు చేసుకుంది.
ముగ్గురు మృతి.. మిగిలిన వారు?
ఈ ప్రమాదంలో కనీసం ముగ్గురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 150 మందిని రక్షించగలిగారు. రెస్క్యూ టీమ్‌తో పాటు స్థానిక మత్స్యకారుల పడవలు కలసి పెద్ద ఎత్తున రక్షణ చర్యలు చేపట్టినట్టు ప్రావిన్షియల్ రెస్క్యూ అధికారి వెరి అరియాన్తో తెలిపారు. మిగిలిన ప్రయాణికుల కోసం ఇప్పటికీ శోధన కొనసాగుతోంది.
ఇంకా కొనసాగుతున్న రక్షణ చర్యలు
దాదాపు 280 మంది ప్రయాణికులు ఆ నౌకపై ఉన్నట్టు అధికారులు తెలిపారు. మంటలు ఎలా చెలరేగాయో ఇప్పటి వరకు స్పష్టత లేదు. ప్రమాద సమయంలో నౌక పూర్తిగా సముద్రంలో ఉండటంతో సహాయక చర్యలు కాస్త కష్టంగా మారాయి. ఈ నేపథ్యంలో రెండు పెద్ద నౌకలు, పలు రబ్బరు బోట్లు, ఇతర రక్షణ వాహనాలను రంగంలోకి దించారు.
Also Read: Bhishm Health Cube: గాల్లో తేలే హాస్పిటల్.. ఆపరేషన్స్ కు సిద్ధం.. ఏపీలో సరికొత్త ప్రయోగం!
డిజాస్టర్ మేనేజ్‌మెంట్ విభాగం సమగ్ర ఏం అంటోంది?
ప్రాంతీయ విపత్తు నిర్వహణ విభాగం ‘క్విక్ రియాక్షన్ టీమ్’ అధికారి దాని రెపీ తెలిపిన వివరాల ప్రకారం, నౌకలో ప్రయాణిస్తున్న వారిలో కొంతమంది సముద్రంలో దూకినట్టు అనుమానిస్తున్నారు. అందుకే సముద్రతీర ప్రాంతాల చుట్టూ ప్రత్యేకంగా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
ప్రాణాపాయాన్ని తప్పించుకున్నా..
సురక్షితంగా బయటపడిన ప్రయాణికులు ఇప్పటికీ భయాందోళనల్లో ఉన్నారు. నౌక నుంచి మంటలు ఎలా వచ్చాయో తమకు అర్థం కాలేదని, చాలా మందికి లైఫ్ జాకెట్లు కూడా అందలేదని చెబుతున్నారు. ప్రమాద తీవ్రత పట్ల ప్రభుత్వ యంత్రాంగం త్వరితగతిన స్పందించినా, విచారణ మాత్రం కొనసాగుతోంది.
ఇండోనేషియా తీర ప్రాంతాల్లో తరచూ నౌక ప్రయాణాలు జరుగుతుంటాయి. అయితే భద్రతా ప్రమాణాలపై ఎన్నోసారి ప్రశ్నలు వచ్చినా, ఈసారి జరిగిన అగ్ని ప్రమాదం మరోసారి ఆత్మపరిశీలనకు దారి తీస్తోంది. ప్రయాణికుల ప్రాణాలకు ప్రాధాన్యతనిస్తూ, ప్రభుత్వం త్వరగా స్పందించినా.. ఇది ఒక తీవ్రమైన హెచ్చరికగా మారింది.